నటన, మానవత్వంతో ఎందరికో స్పూర్తినింపిన అభిమాన తార

నటన, మానవత్వంతో ఎందరికో స్పూర్తినింపిన అభిమాన తార

జీవితానికి కావాల్సిన పాఠాలు, గుణ పాఠాలు తెలుసుకోవాలంటే మహానటి సావిత్రి జీవితం ఒక సాక్ష్యం. నాటికీ, నేటికీ, ఎప్పటికీ ఆవిడ అందుకున్నంత కీర్తిని ఎవరూ చేరుకోలేరు. ఆవిడ నటనతో, మానవత్వంతో ఎందరికో స్పూర్తినింపిన అభిమాన తార.. నటిగానే కాకుండా, నిర్మాతగా, దర్శకురాలిగా వెండి తెరపై చెరగని ముద్ర వేసింది. సావిత్రిని తలుచుకోగానే తెలుగుదనం ఉట్టిపడే రూపం కళ్లకు కనిపిస్తుంది. 

తన ప్రతిభతో.. తరాలు మారినా తెలుగు సినీ పరిశ్రమలో సాటిలేని మేటి నటిగా ఇప్పటికీ కీర్తించబడుతోంది. నాగేశ్వర రావు, రామారావు, ఎస్వీ రంగారావు లాంటి మేటి నటులకు ధీటుగా పోటీనిచ్చింది. కళ్లతోనే డైలాగ్ చెప్పేది. ముఖ అభినయంతోనే మొత్తం సీన్ ని నడిపించే అమర నటి సావిత్రి జన్మదినాన ప్రత్యేక కథనం.

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం, చిర్రావూరులో గురువయ్య, సుభద్రమ్మ దంపతులకు 1936లో డిసెంబర్ 6న జన్మించింది నిశ్శంకర సావిత్రి. సావిత్రి చిన్నతనంలోనే తండ్రి అనారోగ్యంతో మరణించడంతో చిర్రావూరులోని తన పెద్దమ్మ అన్నపూర్ణమ్మ వాళ్లింటికి దత్తత వెళ్లింది.

మొదట నాటకాల్లో విభిన్న పాత్రల్లో నటించేది సావిత్రి. అవి చూసిన కొందరు డైరెక్టర్లు సినిమా ఫీల్డ్ కి పరిచయం చేశారు. మొదట్లో ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో హీరోయిన్ గా నటించే చాన్స్ వచ్చినా, దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. తన నటన చూసి ఎల్.వి. ప్రసాద్ ‘నువ్వు నటనకు పనికి రావు’అని తిట్టి పంపించారు. దాంతో సినిమాల్లోనే స్థిరపడతానని పట్టు పట్టింది.

1950లో తన మొదటి సినిమా ‘సంసారం’లో హీరోయిన్ గా చేసే అవకాశం దక్కింది.  1951లో పాతాళభైరవిలో డాన్సర్ గా నటించారు సావిత్రి. 1952లో వచ్చిన పెళ్లిచేసి చూడు సినిమాతో సావిత్రి నటనకు గుర్తింపు వచ్చింది.

అయితే, 1953లో రిలీజ్ అయిన దేవదాసు సినిమా సావిత్రి జీవితాన్ని రాత్రికి రాత్రే మార్చేసింది. అనుకోకుండా పార్వతీ పాత్ర సావిత్రి పోషించాల్సి వచ్చింది. ఆ పాత్ర తన జీవితాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఈ సినిమానే సావిత్రి మొదటి విజయం కూడా. నాగేశ్వర రావును దేవదాసుగా ఎంతమంది కీర్తించారో, పార్వతినీ అంతేమంది ఆరాధించారు.

తర్వాత వచ్చిన మిస్సమ్మ కూడా సావిత్రి జీవితాన్ని మలుపు తిప్పింది. భానుమతి చేయాల్సిన ఆ పాత్రలో సావిత్రి నటించి అందరి మన్ననలు అందుకుంది. మిస్సమ్మ విజయంతో సావిత్రి వెనక్కి తిరిగి చూడలేదు. ఆ సినిమాతో సావిత్రి డేట్స్ కోసం డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూజర్లు ఎన్ని రోజులైనా వేచి చూసేవాళ్లు. 

1957లో రిలీజ్ అయిన తోడికోడళ్లు, మాయాబజార్ లాంటి సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించి చరిత్రలో నిలిచిపోయే గొప్ప విజయాలను అందుకుంది. అన్నపూర్ణ బ్యానర్లో విడుదలైన ఒకటిరెండు సినిమాల్లో తప్ప మిగిలిన అన్ని సినిమాల్లో సావిత్రినే హీరోయిన్ గా పెట్టుకున్నారు. అందులో సావిత్రి నటించిన దొంగరాముడు, వెలుగునీడలు, మాంగల్యబలం, డాక్టర్ చక్రవర్తి, చదువుకున్న అమ్మాయిలు సినిమాలు సావిత్రికి మంచి పేరు తెచ్చి పెట్టాయి. 

కనువిందు సినిమాతో మొదలైన నాగేశ్వర రావు, సావిత్రిల సూపర్ హిట్ కాంబినేషన్ అభిమానం, నమ్మినబంటు, శాంతినివాసం, సిరిసంపదలు, ఆరాధన, మంచి మనసులు, మాయాబజార్, నవరాత్రి, సుమంగళి లాంటి ఎవర్ గ్రీన్ సినిమాలతో చిరస్మరనీయంగా నిలుస్తాయి.

హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ప్రేక్షకులను అలరించారు.  గోరింటాకు చిత్రంతో  తల్లిగా పరిచయం అయిన సావిత్రి, కన్యాశుల్కం, భలేరాముడు, వినాయక చవితి, ఇంటిగుట్టు, శ్రీవేంకటేశ్వర మహత్యం, నర్తనశాల, గుండమ్మకథ, దేవత లాంటి సినిమాల్లో నటించి మెప్పించారు. 

ఒక్క తెలుగు సినీ పరిశ్రమనే కాకుండా హిందీ, తమిళ చిత్ర రంగాల్లో నటించారు. బాలీవుడ్ లో  బహుత్ దిన్ హుయే, ఘర్ బసాకే దేఖో, గంగా కీ లహరే, బలరాం శ్రీకృష్ణ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తమిళ్ లో ఎక్కువ సినిమాలు జెమిని గణేషన్ తో తీశారు సావిత్రి. వీళ్లిద్దరు తీసిన మనం పోల మాంగల్యం తమిళ్ లో హిట్ కొట్టింది. 

చిన్నారిపాపలు, మాతృదేవత, చిరంజీవి, వింత సంసారం సినిమాలకు డైరెక్టర్ గా కూడా చేశారు. తర్వాత జీవితంలో ఎదురైనా కష్టాలను మర్చిపోయేందుకు వ్యసనాలకు అలవాటు పడ్డ సావిత్రి, కొన్ని రోజులకి కోమాలోకి వెళ్లింది. దాదాపు నెల రోజుల పాటు కోమాలో ఉండి, 1981 డిసెంబర్ 26న వెండి తెరని ఏలిన మహానటి కన్నుమూశారు. ఆవిడ మరణించినా చిత్ర పరిశ్రమకు నటిగా చేసిన సేవలు చిరస్మరణీయం.