
జర్మనీ, ఇజ్రాయెల్ వంటి దేశాలు కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ డెవలప్ చేయటంలో ముందంజ వేశాయనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆయా వార్తల్లో నిజమెంత ఉంది?. వాస్తవానికి ఈ వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి రావటానికి ఎంత సమయం పడుతుంది? ఇండియన్ల ఆహారపు అలవాట్లు ఇమ్యూనిటీని ఎలా పెంచుతాయి? అనే అంశాల్ని ‘వీ6 – వెలుగు’కిచ్చిన ఇంటర్వ్యూలో ‘శాంత బయోటెక్’ చైర్మన్ వరప్రసాద్‌రెడ్డి వివరించారు.
మన దేశంలో ప్రతి వంటిల్లు ఒక మెడికల్ షాపు అనే చెప్పాలి. మన ఆహారం చాలా మంచిది. మన సంప్రదాయాలు అన్నీ మెడికల్ వాల్యూస్‌తో ఉన్నాయి. అందువల్లనే మన దేశంలో వేగంగా కరోనా వైరస్ వ్యాపించడం లేదు. గణాంకాలు చూడండి. ఫస్ట్ వీక్‌లో ఇటలీ, స్పెయిన్, ఇండియా, అమెరికా లాంటి చాలా దేశాల్లో రెండు మూడు కేసులు మాత్రమే కనిపించాయి. రెండు మూడు నాలుగు వారాల్లో కేసుల సంఖ్య రేసు గుర్రాలా పరుగెత్తాయి. మూడు, నాలుగంకెలకు వచ్చేశాయి. మన దగ్గర మాత్రం ఇంకా 130ల్లోనే ఉన్నాయి. ఏదో కొద్ది మంది పిజ్జర్లు, బర్గర్లు తిన్నా నాలాంటి చాదస్తులు ఇంకా అల్లం, పసుపు తింటున్నారు. కాబట్టి మనలాంటి వాళ్లకు కరోనా వైరస్ సోకే ప్రమాదం తక్కువ. ఈ ఆహారాన్ని మనం మళ్లీ తినడం ఆరంభించాలి. రోడ్ల పక్కన బడ్డీలు, పానీపూరీలు, అర్థంపర్థంలేని రెస్టారెంట్లు, సబ్‌వేలు, ఫాస్ట్ఫుడ్లను ప్రభుత్వం మూయించేయాలి. అప్పుడే మన వంటిల్లు మళ్లీ ఔషధశాలగా మారుతుంది. వర్రీ కావాల్సిన పనే ఉండదు.
ఇమ్యూనిటీకి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి?
వరప్రసాద్‌రెడ్డి: మనం తీసుకునే ఆహారమే ఇమ్యూనిటీని పెంచుతుంది. రోజూ మన ఆహారంలో శొంటో, అల్లమో తీసుకుంటే జీర్ణవ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. ఏది తిన్నా అరాయించుకోగలరు. స్వచ్ఛమైన ఆహారం తినటం ఇకనైనా మొదలుపెట్టండి. బయటి పదార్థాలు వద్దు. గతంలో ఎన్నో వైరస్లు వచ్చాయి. అయినా చనిపోయామా?. జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకుపోవాలి. క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని అమెరికా, జర్మనీ, ఇజ్రాయెల్ అంటున్నాయి.
ఒక వ్యాక్సిన్ రూపకల్పనలో అనేక దశలు ఉంటాయి. మొదట వ్యాక్సిన్‌ని దేనికోసం తయారు చేస్తున్నామో ఆలోచించాలి. ఏ వైరస్‌ని అరికట్టడానికి చేస్తున్నామో ముందు దాని గురించి తెలుసుకోవాలి. ఆ వైరస్ తాలూకు ఆర్ఎన్ఏ లేదా డీఎన్ఏ ప్లాస్మిడ్లోకి మార్చాలి. అలా మార్చాక దాని అవశేషాన్ని తీసుకొని ఒక మీడియంలో పెట్టి గ్రో చేసి, ప్యూరిఫై చేస్తారు. ఈ ప్రక్రియకే కనీసం ఆరు నెలల నుంచి ఒక ఏడాది సమయం పడుతుంది. కరోనా వైరస్ జనవరిలో వచ్చింది. అంటే బహుశా వాళ్లు ఈపాటికే ఆ పని చేసుంటారు. వాళ్లు తయారుచేసిన వ్యాక్సిన్‌ని ఏ వ్యక్తికి ఇంజెక్ట్ చేస్తారనేదీ ముఖ్యమే. ఆ వ్యక్తికి అప్పటికే వైరస్ వచ్చి ఉంటే ఏమీ చేయలేం. ఒకవేళ హెల్దీగా ఉన్న పర్సన్‌కి గనక ఇస్తే… అతనికి వైరస్ వల్ల వచ్చే ప్రమాదాన్ని కాపాడటానికి బదులు ఇంకేదైనా కొత్త వ్యాధి వస్తే ఎలా?. అందుకని ఆ వ్యాక్సిన్ సేఫ్టీని ఎస్టాబ్లిష్ చేయాలి. దానికోసం ముందుగా ఎలుకల వంటి చిన్న చిన్న (రెండు మూడు గ్రాముల బరువున్న) జంతువులకి లాఫెల్ (ప్రమాదకర) డోస్ ఇస్తారు.
ఈ డోసు యావరేజ్‌గా 70 కిలోల బరువు ఉండే మనిషికి ఇచ్చే డోస్ కన్నా 40 రెట్లు ఎక్కువ. ఆ జీవులు ఈ డోస్‌ని తట్టుకొని బతికి ఉంటే వ్యాక్సిన్‌ని సేఫ్ అంటారు. అప్పుడు ఆ జీవిని కోసి దాని శరీరంలోని అన్ని భాగాలు (గుండె, శ్వాసకోశాలు, కిడ్నీలు, రీప్రొడక్టివ్ ఆర్గాన్స్) బాగున్నాయో లేదో చూసి, క్షేమంగా ఉన్నాయని తెలిశాక ఆ ఫేజ్‌ని దాటతాం. ఈ దశని ‘ప్రిక్లినికల్ స్టడీస్’ అంటారు. దీనికి 6 నుంచి 8 నెలలు పడుతుంది. తర్వాత హ్యూమన్ ట్రయల్స్ చేస్తారు.
ఈ దశలో పిల్లలకి, యూత్‌కి, ఆడవాళ్లకి, మగవాళ్లకి వేర్వేరు డోస్‌లు ఇస్తారు. వ్యాక్సిన్ ఇచ్చాక వాళ్లను కొన్నాళ్లు గమనిస్తారు. ఇందులో భాగంగా అప్పుడప్పుడూ వాళ్ల యాంటీబాడీస్ ఎంత వచ్చాయో చూస్తారు. ఈ ప్రాసెస్ కనీసం ఏడాదిన్నర, రెండేళ్లు కొనసాగుతుంది. అంటే, మొత్తం నాలుగైదేళ్లు పడుతుందన్నమాట. తర్వాత ఈ రికార్డులన్నింటినీ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్కి అందజేయాలి. కోర్ కమిటీ ఈ డేటా అంతా పరిశీలించి, మంచీ చెడులను గమనించి, లైసెన్స్ జారీ చేస్తారు. అప్పుడే ఆ వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తుంది.
ఏ విషయాలు పరిగణనలోకి తీసుకుంటారు?
నిజానికి ఇంతకన్నా ఎక్కువ సమయమే పట్టొచ్చు. ఎందుకంటే, ఇప్పటిదాకా నేను చెప్పింది ఒక దేశంలో జరగాల్సిన ప్రాసెస్ల గురించే. కానీ.. వేర్వేరు దేశాల్లోని జాతుల ప్రజలు ఒకలా ఉండరు. వాళ్ల జీర్ణ ప్రక్రియలు రకరకాలుగా ఉంటాయి. కాబట్టి వాళ్లందరికీ ఈ మందు సరిపడుతుందా లేదా అనేది అన్ని దేశాలు పరీక్షిస్తాయి. అయితే, కరోనాకి ఇప్పుడు ఎమర్జెన్సీ ఉన్నందువల్ల అన్ని దేశాలు సహకరించుకుంటాయి. వాళ్ల దేశాల్లో రివ్యూ టైమ్‌ని తగ్గించొచ్చేమో కానీ, ఎలుకల మీద, భిన్నమైన వ్యక్తుల మీద పరీక్షించే పద్ధతిని మాత్రం బైపాస్ చేయవు.
మన దేశం ఏ స్టేజ్‌లో ఉంది?
వరప్రసాద్‌రెడ్డి: మన దేశంలో సీరం ఇన్స్టిట్యూట్వాళ్లూ ట్రై చేస్తున్నారని విన్నా. ‘శాంత బయోటెక్’లో మాత్రం ప్రయత్నం చేయలేదు. ఇది చాలా ప్రయాస, ఖర్చుతో కూడింది. ఒకవేళ ఇంత దూరం ప్రయాణం చేశాక చూస్తే ఆ వైరస్ తన స్వరూప, స్వభావాలను మార్చుకోవచ్చు. ప్రతి ఏడాది మనం వేసుకునే ఫ్లూ వ్యాక్సిన్ ఒకే రకం కాదు. ప్రతి సంవత్సరం మారుతుంది. ఎప్పటికప్పుడు కొత్త వైరస్లు వస్తుంటాయి. వాటికి సమాంతరంగా వ్యాక్సిన్లు తయారు చేస్తుంటాం.