స్టాక్ మార్కెట్ పై ఎన్నికల ఫలితాల ప్రభావం

స్టాక్ మార్కెట్ పై ఎన్నికల ఫలితాల ప్రభావం

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉండడంతో పాటు, ఆసియా మార్కెట్లు కూడా లాభపడడంతో  వరసగా మూడో సెషన్‌‌లోనూ దేశ మార్కెట్లు పెరిగాయి. రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం బలపడింది. బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌ సెన్సెక్స్‌‌ గురువారం ఇంట్రాడే సెషన్‌‌లో 1,800 పాయింట్ల వరకు పెరిగింది. చివరికి 817 పాయింట్లు (1.50 %) లాభంతో  55,464 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 250 పాయింట్లు (1.53 %) ఎగిసి 16,595 వద్ద ముగిసింది.  
కలిసొచ్చిన బీజేపీ గెలుపు..
పొలిటికల్‌‌గా కీలకమైన ఉత్తరప్రదేశ్‌‌లో వరసగా రెండో సారి కూడా బీజీపీ అధికారంలోకి రావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌‌ బలపడింది. ఉత్తరఖాండ్‌‌, మణిపూర్‌‌‌‌, గోవాలలో కూడా బీజేపీనే అధికారంలోకి రావడంతో మార్కెట్‌‌లు లాభపడ్డాయి. ‘రష్యా–ఉక్రెయిన్‌‌ టాప్ అధికారుల మధ్య జరిగే చర్చలు మెరుగ్గా ఉంటాయనే అంచనాలతో ఆసియా మార్కెట్లు గురువారం లాభపడ్డాయి. మన మార్కెట్‌‌ కూడా భారీ లాభంతో ఓపెన్ అయ్యింది. అంచనాలకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల రిజల్ట్స్ ఉండడం మరింత కలిసొచ్చింది’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌ ఎనలిస్ట్‌‌ వినోద్ నాయర్ పేర్కొన్నారు.  

యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ మీటింగ్‌‌, యూఎస్ ఇన్‌‌ఫ్లేషన్ డేటా విడుదల కానుండడం, క్రూడ్ ధరలు పెరగడంతో మార్కెట్‌‌లో వోలటాలిటీ మాత్రం కొనసాగుతోందని చెప్పారు. రష్యా–ఉక్రెయిన్ మధ్య జరిగే చర్చల్లో మెరుగైన ఫలితాలొస్తాయని మార్కెట్ అంచనావేస్తోందని  హెమ్‌‌ సెక్యూరిటీస్ ఎనలిస్ట్‌‌ మోహిత్ నిగమ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో మార్కెట్ మరింత పెరిగిందని చెప్పారు. బీఎస్‌‌ఈ స్మాల్ క్యాప్‌‌, మిడ్ క్యాప్ ఇండెక్స్‌‌లు 1.18 %  వరకు లాభపడ్డాయి. అన్ని సెక్టార్ల ఇండెక్స్‌‌లు లాభాల్లో ముగిశాయి.

బీఎస్‌‌ఈ ఎఫ్‌‌ఎంసీజీ, రియల్టీ, మెటల్‌‌, బ్యాంక్ ఇండెక్స్‌‌లు 2.68 %  వరకు లాభపడ్డాయి. బీఎస్‌‌ఈలోని 2,433 షేర్లు లాభపడ్డాయి. 929 షేర్లు నష్టపోయాయి. క్రూడ్ ఆయిల్ గురువారం 4.91 %  పెరిగి బ్యారెల్‌‌ 116.6 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.  డాలర్ మారకంలో రూపాయి విలువ 19 పైసలు బలపడి 76.43 వద్ద సెటిలయ్యింది.