రైల్వేలో పాత పెన్షన్ విధానం అమలు చేయండి: మర్రి రాఘవయ్య

రైల్వేలో పాత పెన్షన్ విధానం అమలు చేయండి: మర్రి రాఘవయ్య
  • ఎన్‌ఎఫ్‌ఐఆర్‌‌ జనరల్‌ సెక్రటరీ మర్రి రాఘవయ్య డిమాండ్‌ 


న్యూఢిల్లీ, వెలుగు: సైన్యంలో అమలవుతున్నట్లు రైల్వేల్లో కూడా పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్ఎఫ్ఐఆర్ (నేషనల్ ఫెడరేషన్ అఫ్ ఇండియన్ రైల్వే మ్యాన్) జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం తెచ్చిన కొత్త పెన్షన్ విధానానికి (ఎన్పీసీ) వ్యతిరేకంగా ఆగస్టు 10న రైల్వే కార్మికులతో ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో మహా ఆందోళనకు నిర్వహించనున్నామని వెల్లడించారు. 


రాజకీయాలకు అతీతంగా దాదాపు లక్ష మంది కార్మికులు ఈ ర్యాలీలో పాల్గొననున్నారని చెప్పారు. అనంతరం ప్రధాని మోదీని కలిసి వినతి పత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. కాగా, 2014 నుంచి అమల్లో ఉన్న ఎన్పీసీతో రైల్వేలో కొత్తగా చేరిన కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని, అందువల్ల ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పాత పెన్షన్ విధానం అమలు కోసం జాయింట్ ఫోరమ్ స్థాపించామని, వారి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నామని చెప్పారు. కార్మికులకు సామాజిక రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినతీర్పును గుర్తుచేశారు.