ఉమ్మడి మెదక్​ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్​  జిల్లా సంక్షిప్త వార్తలు

మెదక్​ జిల్లాలో పోలీస్​ యాక్టు అమలు
ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
మెదక్​ టౌన్, వెలుగు : శాంతి భద్రతల దృష్ట్యా ఈనెల పాటు జిల్లా వ్యాప్తంగా పోలీస్​ యాక్టు అమలులో ఉంటుందని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్​ అంతా జిల్లాలో 30,30(ఎ) పోలీస్​ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు.  పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసన, ర్యాలీలు, పబ్లిక్​ మీటింగ్​లు, సభలు నిర్వహించొద్దని చెప్పారు. 

అర్హులందరికీ ఆసరా పింఛన్లు
నర్సాపూర్, వెలుగు : ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులందరికీ ఆసరా పింఛన్లు ఇస్తోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. గురువారం నర్సాపూర్ పట్టణంలోని సాయి కృష్ణ ఫంక్షన్ హాల్ లో కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. అంతకుముందు నర్సాపూర్ మున్సిపల్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్ర గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, వైస్ చైర్మన్ నయీమ్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు.

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
 ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​
కోహెడ(బెజ్జంకి)వెలుగు: పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మానకొండూర్​ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ అన్నారు. గురువారం మండలం లోని గుండారం, చీలాపూర్ పల్లి, పోతారం, బెజ్జంకి, దాచారం గ్రామాలలో ఆయన కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలవుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల, ఏఎమ్​సీ చైర్మన్​రాజయ్య, పార్టీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్​రెడ్డి, రాష్ర్ట నాయకులు శ్రీనివాస్​ గుప్తా, లక్ష్మణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

అన్ని వర్గాల అభివృద్ధికి కృషి
ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి
రామచంద్రాపురం, వెలుగు :  రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందని పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి అన్నారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని పటాన్​చెరు, అమీన్​పూర్​, రామచంద్రాపురం, జిన్నారం మండలాలకు చెందిన 267 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదింటికీ పెద్ద దిక్కులా సీఎం కేసీఆర్​ నిలబడుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు సుష్మశ్రీ, దేవానంద్, రవీందర్ గౌడ్, జట్పీటీసీలు సుధాకర్​రెడ్డి, ప్రభాకర్, సుప్రజా, జీహెచ్​ఎంసీ కార్పొరేటర్లు కుమార్​యాదవ్, సింధూ ఆదర్శ్​రెడ్డి, పుష్ప, మున్సిపల్​ చైర్మన్లు పాండురంగా రెడ్డి, రోజా బాల్​రెడ్డి పాల్గొన్నారు. 

బస్సు బోల్తా.. పలువురికి గాయాలు 
సదాశివపేట, వెలుగు :  అదుపుతప్పి  కర్నాటక బస్సు బోల్తా పడింది. తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పరిధిలోని పెద్దాపూర్​ శివారు 65వ నేషనల్​ హైవేపై గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. పెద్దపూర్​ శివారులో ట్యాంకర్, కంటైనర్​ఢీకొని ట్యాంకర్​ డ్రైవర్ ​గాయపడ్డాడు. అక్కడే రోడ్డు దాటబోయిన బైక్​ను తప్పించబోయి  హైదరాబాద్​ వైపు నుంచి జహీరాబాద్​ వైపు వస్తున్న కర్నాటక బస్సు అదుపు తప్పి డివైడర్​ను ఢీకొని బోల్తా పడింది. బస్సులో 48 మంది ప్రయాణికులు ఉండగా, కొందరికి గాయాలయ్యాయి. వారిని సంగారెడ్డి గవర్నమెంట్​ హాస్పిటల్​కు తరలించారు. తృటిలో పెను ప్రమాదం తప్పిందని అందరూ ఉపిరి పీల్చుకున్నారు. 


రెచ్చిపోయిన జేబు దొంగలు
14 సెల్​ఫోన్లు చోరీ
సిద్దిపేట రూరల్, వెలుగు : వినాయక చవితి సందర్భంగా బుధవారం షాపింగ్ ​మాల్స్, ప్రధాన కూడళ్లు రద్దీగా మారాయి. ఇదే అదనుగా జేబు దొంగలు రెచ్చిపోయారు. పలువురి సెల్​ ఫోన్లు కొట్టేశారు. సిద్దిపేట వన్ టౌన్ సీఐ భిక్షపతి తెలిపిన ప్రకారం..  బుధవారం సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  రైతు బజార్, సుభాష్ రోడ్, బస్టాండ్ ఏరియా ప్రాంతాల్లో పూలు, పండ్లు కొనడానికి వెళ్లిన వ్యక్తుల నుంచి 14 సెల్ ఫోన్ లను జేబు దొంగలు దొంగిలించారు. ఒకే రోజు కంప్లైంట్స్ ఎక్కువగా రావడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.


వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి
సంగారెడ్డి టౌన్, వెలుగు : తమ డిమాండ్లను పరిష్కరించాలని 39 రోజులుగా సమ్మె చేస్తున్న వీఆర్​ఏలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని కేవీపీఎస్​ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కంది తహసీల్దార్ ఆఫీస్​ వద్ద ఆయన వీఆర్​ఏల సమ్మెకు మద్దతు తెలిపి మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్​ వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్​ చేశారు. పే స్కేలు, వారసులకు ఉద్యోగాలు, అర్హత కలిగిన వారికి పదోన్నతులు ఇవ్వాలన్నారు. డిమాండ్లు పరిష్కరించేంత వరకూ సమ్మె ఆగదని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా కేవీపీఎస్ సహాయ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ వీఆర్ఏల సంఘం జేఏసీ నాయకులు మల్లయ్య, మొగులయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో స్టూడెంట్ మృతి
సంగారెడ్డి(హత్నూర), వెలుగు : రోడ్డు ప్రమాదంలో ఓ స్టూడెంట్ మృతి చెందాడు. ఈ ఘటన హత్నూర మండలంలోని మంగాపూర్ శివారులో సంగారెడ్డి–నర్సాపూర్ రోడ్డుపై బుధవారం రాత్రి జరిగింది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన సార మోహన్(22) తన స్నేహితుడు సాయికిరణ్ తో కలిసి దౌల్తాబాద్ కు బైక్​పై వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో మంగాపూర్ శివారులో స్పీడ్​గా వస్తున్న వీరు అడ్డుగా వచ్చిన గేదెను ఢీకొట్టారు. మోహన్ అక్కడికక్కడే చనిపోయాడు. గేదె కూడా మృతి చెందింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
చేపల వేటకు వెళ్లి ఒకరు.. 
మెదక్ (శివ్వంపేట), వెలుగు : చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన శివ్వంపేట మండలం సికింద్లాపూర్ లో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం..  గ్రామంలోని పిట్టల వాడకు చెందిన రాజు (38), జగన్ కలిసి గ్రామ శివారులోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు వల చుట్టుకోవడంతో రాజు నీటిలో మునిగిపోయాడు. అతడిని రక్షించేందుకు జగన్ ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. జగన్​ కేకలు విని చుట్టుపక్కల వారు చెరువు వద్దకు వచ్చేలోపు రాజు చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని 
పోలీసులు తెలిపారు.

బాలికను గర్భవతిని చేసిన యువకుడి అరెస్టు 
నర్సాపూర్, వెలుగు :  ఓ బాలిక గర్భం దాల్చడానికి కారణమైన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నర్సాపూర్ ఎస్సై గంగరాజు తెలిపిన ప్రకారం.. నర్సాపూర్ మండలం జానకంపేట తండాకు చెందిన బాలిక (15) పదో తరగతి చదువుతోంది. అదే తండాకు చెందిన శత్రు నాయక్(21) ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. కొన్ని రోజులుగా వారిద్దరూ శారీరక సంబంధం పెట్టుకున్నారు. దీంతో బాలిక గర్భం దాల్చింది. గర్భం పోవడానికి బాలికకు శత్రునాయక్ టాబ్లెట్లు ఇచ్చాడు. అవి మింగిన బాలికకు బుధవారం రాత్రి కడుపునొప్పి రావడంతో పాటు, బ్లీడింగ్ అయ్యింది. వెంటనే కుటుంబ సభ్యులు బాలికను నర్సాపూర్​ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు ట్రీట్మెంట్​ చేశారు. ఈ మేరకు యువకుడిని అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.