మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: ఇంటర్లో ఉత్తీర్ణతా శాతం మెరుగుపడాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో నిర్వహించిన పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కు ఆమె మాట్లాడారు. ఇంటర్ స్థాయి విద్యార్థుల జీవితంలో అత్యంత కీలకమైందన్నారు. పరీక్షలకు నెల సమయం ఉందని ఇప్పటి నుంచి టెన్షన్ లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాసేందుకు సిద్ధం కావాలని సూచించారు.
ప్రభుత్వ కాలేజీల్లో మంచి విద్యార్హతలు, అనుభవం ఉన్న లెక్చరర్లు ఉన్నారని, మంచిగా చదివి పరీక్షలు రాయాలన్నారు. పేరెంట్స్, టీచర్ సమావేశాలతో విద్యార్థినుల పరిస్థితిపై అవగాహన కలుగుతుందని, పిల్లలకు ఎదురయ్యే సమస్యలను తల్లిదండ్రులు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు.
తాగునీటి సమస్య రాకుండా చూడాలి..
కోయిలకొండ: వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మండలంలోని రాంకొండ గుట్ట సమీపంలో నిర్మించిన 19 ఎంఎల్డీ మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను పరిశీలించారు. నీటి శుద్ధి జరిగే విధానం, గ్రామాలకు నీటి సరఫరా చేసే విధానాన్ని పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జమలాపురం గ్రామాన్ని సందర్శించి, గ్రామస్తులతో మాట్లాడారు.
మిషన్ భగీరథ ఎస్ఈ జగన్మోహన్, ఈఈ(గ్రిడ్) శ్రీనివాస్, ఈఈ(ఇంట్రా) జయ బాయి, సర్పంచ్ సంధ్యా రాణి పాల్గొన్నారు. అనంతరం మండలకేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అరైవ్, అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
