గ్రామ పంచాయతీ సిబ్బంది కొలువుండాలంటే అగ్రిమెంట్లు రాయాల్సిందే

గ్రామ పంచాయతీ సిబ్బంది కొలువుండాలంటే అగ్రిమెంట్లు రాయాల్సిందే

పంచాయతీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం బాండెడ్​ లేబర్​గా మారుస్తోంది. గతంలో బిల్‌‌ కలెక్టర్‌‌, కారోబార్‌‌, అటెండర్‌‌, పంప్‌‌ ఆపరేటర్‌‌, స్వీపర్లు వేర్వేరుగా ఉంటే.. ‘మల్టీపర్పస్​ వర్కర్లు’ అంటూ కొత్త పేరుపెట్టి ఈ పని ఆ పని అని కాదు.. మొత్తం పనులన్నీ ఎవరైనా చేయాల్సిందేనంటోంది. ఏడాదిపాటు పనితీరు బాగుంటేనే ఉద్యోగం ఉంటుందని, లేదంటే ఇంటికేనని వార్నింగ్​ ఇస్తోంది. జీతం పెరిగిందన్న సంబురంలో ఉండగానే.. ప్రభుత్వం పెడుతున్న కండీషన్లపై పంచాయతీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ‘మల్టీపర్పస్​ వర్కర్లు’గా పరిగణిస్తూ జీవో నంబర్‌‌ 51 తీసుకురావడంపై వాళ్లు మండిపడుతున్నారు.

గత ఏడాది జులై, ఆగస్టులో పంచాయతీ కార్మికులు 33 రోజులపాటు నిరవధిక సమ్మె చేయగా రాష్ట్ర ప్రభుత్వం జీతం పెంచింది. జీతం పెంచినట్లే పెంచిన సర్కార్ కొలువు చేయడానికి మాత్రం కండీషన్లు పెడుతోంది. పెరిగిన శాలరీ రూ.8,500 చేతికందకముందే ఏ పని చెప్పితే అది చేయాలంటూ అగ్రిమెంట్లు రాయించుకుంటోంది. ఏదో ఒక్క పనికే పరిమితం కాకుండా మల్టీపర్పస్ వర్కర్లుగా పనిచేయాలని చెబుతోంది. అంటే తాగునీటి సరఫరా పనిచేసే పంప్‌ ఆపరేటర్లు, పంచాయతీ ఆఫీసుల్లో పనిచేసే అటెండర్లు కూడా చెత్త ఎత్తడం, డ్రైనేజీ క్లియర్‌ చేయడంలాంటి పనులు చేయాల్సి ఉంటుంది. ఈ పని తమతో కాదన్నా.. ఏడాది పనితీరు బాగోకున్నా.. అగ్రిమెంట్‌ ప్రకారం ఉద్యోగం వదులుకోవాల్సిందే.

బాండ్‌ రాసివ్వండి..

రాష్ట్రంలోని 12,753 గ్రామ పంచాయతీల్లో కారోబార్‌, పంప్‌ ఆపరేటర్‌(వాటర్‌మన్‌), లైన్‌మన్‌, అటెండర్‌, స్వీపర్‌, కావల్దార్‌, సఫాయి తదితర పేర్లతో దాదాపు 39 వేల మంది పనిచేస్తున్నారు. జీవో నంబర్​ 51 ప్రకారం పంచాయతీల్లో పనిచేసే కార్మికులందరిని వారు చేసే పనితో సంబంధం లేకుండా ఇకపై మల్టీపర్పస్‌ వర్కర్లుగా వ్యవహరిస్తారు. ఈ మేరకు సిబ్బంది రూ. 50 బాండ్‌పేపర్‌ మీద ‘అధికారులు ఏ పని చెప్తే
అది చేస్తం. గ్రామంలో అన్ని రకాల పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నం’అంటూ రాసివ్వాల్సి ఉంటుంది.

కారోబార్లూ తట్టలెత్తాల్సిందే..

రాష్ట్రంలోని పాత గ్రామ పంచాయతీల్లో 8,500 మంది కారోబార్లు, బిల్‌ కలెక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నౌకరీ చేస్తున్నవారంతా టెన్త్ లేదా ఆపై చదువులు చదువుకున్నవారే. ఇంటి పన్నులు వసూలు చేయడం.. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు పనుల్లో సహకరించడం వీళ్ల డ్యూటీ. కొత్త రూల్స్ ప్రకారం వీరంతా మల్టీ పర్పస్ వర్కర్లు గా అగ్రిమెంట్ చేసుకోవడం ద్వారా అవసరమైతే ఊడ్వడం, చెత్త ఎత్తడం, ట్రాక్టర్ నడపడం, మొక్కలకు నీళ్లు పట్టడంలాంటి పనులు కూడా చేయాల్సి ఉంటుంది. ఇన్నాళ్లు రాత పనికే పరిమితమైన తమను ఇతర పనులు కూడా చేయాలనడం సరికాదని, ఆ పనులు చేయలేమని కారోబార్లు
అంటున్నారు.

సిబ్బందికి కత్తెర

జీవో 51 ప్రకారం 500 జనాభాకు ఒక కార్మికుడి చొప్పున రెండు వేల మంది ఉన్న గ్రామంలో నలుగురు, మూడు వేల జనాభా ఉన్న గ్రామంలో ఆరుగురు మాత్రమే సిబ్బంది ఉండాలి. ఆ నిష్పత్తి కంటే ఎక్కువ మంది కార్మికులు ఉన్న గ్రామాల్లో కార్మికుల తొలగింపు మొదలైనట్లు తెలిసింది. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి గ్రామ పంచాయతీలో 22 మంది పంచాయతీ సిబ్బంది పనిచేస్తున్నారు. ఇప్పుడు అక్కడ 18 మందే అవసరమని, మిగతా నలుగురిని తీసే అవకాశాలు ఉన్నాయని పంచాయతీ సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. ఇలా తీసేసుకుంటూ పోతే చాలా మంది రోడ్డు మీద పడాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.