భారత్ భేష్..అమెరికా ఒత్తిడిని తట్టుకుని నిలబడింది

భారత్ భేష్..అమెరికా ఒత్తిడిని తట్టుకుని నిలబడింది

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ను మరోసారి ప్రశంసలతో ముంచెత్తారు. విదేశాంగ విధానంలో భారత్ భేష్ అంటూ కితాబిచ్చారు. లాహోర్ లో జరిగిన ఓ సభలో ఇమ్రాన్ మాట్లాడుతూ..అమెరికా ఒత్తిడికి తట్టుకుని రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేయడంపై విదేశాంగ మంత్రి జయశంకర్ను ఆయన ప్రశంసించారు. దీనికి సంబంధించి స్లోమేకియాలో జయశంకర్ మాట్లాడిన వీడియోను ప్లే చేసి చూపించారు. 

భారత్, పాక్ ఒకే సమయంలో స్వాతంత్య్రం పొందాయని..అయితే భారత్ తన ప్రజల కోసం ధృడమైన విదేశాంగ విధానం రూపొందిస్తే..పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మాత్రం ఇతర దేశాల ఒత్తిడితో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. భారత్ అమెరికాకు వ్యూహాత్మక మిత్రదేశమని..అమెరికా వద్దని చెప్పిన  రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంలో భారత్ ధృఢంగా నిలబడిందని అన్నారు. 

చౌక ధరకు చమురు కొనుగోలు చేసేందుకు తాము రష్యాతో మాట్లాడామని..అయితే అమెరికా ఒత్తిడికి తలొగ్గి ప్రస్తుత ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని ఆరోపించారు. దీంతో పాక్ లో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయని..ప్రజలు దారిద్యరేఖకు దిగువన ఉన్నారని అన్నారు. ఈ బానిసత్వానికి తాను వ్యతిరేకమని ఇమ్రాన్ స్పష్టం చేశారు. 

కాగా స్లోమేకియాలో జరిగిన బ్రాటిస్లావా ఫోరమ్ లో జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడి మీడియా రష్యా నుంచి చమురు కొనుగోలుపై ప్రశ్నించింది. దీనికి జయశంకర్ సమాధానమిస్తూ..‘‘యూరప్ కొనుగోలు చేస్తున్న దానికంటే మేము తక్కువ శాతం కొనుగోలు చేస్తున్నాం. మా ప్రజల అవసరాల దృష్ట్యా మాకు తక్కువ ధరకు వచ్చిన చోట కొంటాం’’ అని చెప్పారు.