మరికొద్ది నిమిషాల్లో తీరం దాటనున్న బిపార్జోయ్ తుపాన్

మరికొద్ది నిమిషాల్లో తీరం దాటనున్న బిపార్జోయ్  తుపాన్

మరికొద్ది నిమిషాల్లో బిపార్జోయ్ తుపాన్ తీరం దాటనుంది. సమయం గడిచే కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. తరుముకొస్తున్న  బిపార్జోయ్ తుపాను సృష్టించబోయే విధ్వంసం ఎలా ఉండబోతుందా..?.. ఆ పరిస్థితులను ఎదుర్కొగలమా..? అనే ఆందోళన సర్వత్రా నెలకొంది.

సరిగ్గా రెండేళ్ల తర్వాత గుజరాత్‌ను తాకబోయే తుపాను ఇదే అంటున్నారు వాతావరణశాఖ అధికారులు. ఇప్పటికే తీరం వెంట నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అతిభారీ వర్షాల ముప్పు పొంచి ఉండడంతో రెడ్‌, ఆరెంజ్‌ అలర్ట్‌లు జారీ చేసింది వాతావరణ శాఖ.

గంటకు 150 కిలోమీటర్లకు తగ్గకుండా వాయువేగంతో గుజరాత్‌ తీరం వైపుగా దూసుకొస్తోంది సైక్లోన్‌  బిపార్జోయ్.  సౌరాష్ట్ర, కచ్‌ తీరాన్ని దాటుకుని జఖౌ పోర్ట్‌ వద్ద మాండ్వీ, కరాచీ(పాకిస్థాన్‌) వైపుగా మళ్లీ.. అక్కడ తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. 

తుపాను కేటగిరీ-3 ప్రకారం.. ఇది అత్యంత తీవ్రమైన తుపానుగా పరిగణించనున్నారు. గరిష్టంగా 125 కిలోమీటర్ల వేగంతో దూసుకురానుంది ఇది. కచ్‌తో పాటు దేవ్‌భూమి ద్వారకా, జామ్నానగర్‌ జిల్లాల్లో ఊహించని స్థాయిలో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ ఇదివరకే ప్రకటించింది. కచ్‌ జిల్లాలో 120 గ్రామాల ప్రజలను(తీరానికి పది కిలోమీటర్ల రేంజ్‌లో..) ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

కేంద్రం నుంచి ఎన్డీఆర్‌ఎఫ్‌ తరపున ఎనిమిది బృందాలు, రాష్ట్రం తరపున ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలు 12, రోడ్లు భవనాల విభాగం నుంచి 115 బృందాలు, విద్యుత్‌ విభాగం నుంచి 397 బృందాలను తీరం వెంబడి జిల్లాల్లో మోహరింపజేశారు. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సైతం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటన చేసింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, ఇండియన్‌ కోస్ట్‌ గార్డు సిద్ధంగా ఉన్నాయి. 

మత్స్యకారులను రేపటి వరకు సముద్రంలోకి అనుమతించబోమని ఇదివరకే అధికారులు తెలిపారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పశ్చిమ రైల్వే 76 రైళ్లను రద్దు చేసింది. ద్వారకా, సోమనాథ్‌ ఆలయాలను గురువారం వరకు మూసేస్తున్నట్లు ప్రకటించారు. బిపార్జోయ్ తుపానుతో పెను విధ్వంసం జరగొచ్చని ఐఎండీ ఇదివరకే హెచ్చరించింది. భారీ ఎత్తున్న అలలు ఎగసిపడే అవకాశం ఉండడంతో.. తీరం ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. 

తుపాను తీరం దాటే పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమల్లో ఉంచారు. ఆలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేశారు.