
టెక్నాలజీ ఇప్పుడు ఆశీస్సులు ఇచ్చే వరకు చేరింది. కేరళలోని త్రిసూర్‌లోని ఇరింజలకుడ శ్రీకృష్ణ ఆలయంలో జరిగిన నదయిరుతాల్ వేడుకలో ఏర్పాటు చేసిన రోబోటిక్ ఏనుగు వైరల్ గా మారింది. భక్తులను ఎంతో ఆకర్షిస్తోన్న ఈ రోబో ఏనుగును ,సినీ నటుడు పార్వతీ తిరువోతు సహాయంతో పెటా ఇండియా (PETA India) సభ్యులు ఆలయానికి అందజేశారు. దీని పేరు ఇరింజడపిల్లి రామన్. ఎత్తు11 అడుగులు, బరువు 800 కిలోలు. అంతే కాదు ఇది నలుగురు వ్యక్తులను ఒకేసారి మోసుకెళ్లగలదు. అచ్చం నిజం ఏనుగులా కనిపించే ఈ గజరాజు తల, నోరు, కళ్లు, చెవులు, తోక.. అన్నీ కూడా విద్యుత్ తో పని చేస్తాయి. ఆచారాలు, ఉత్సవాలు సమయాల్లోనే ఈ ఏనుగును ఉపయోగాలని ఆలయాధికారులు ఆదేశించారు. మరే ఇతర ప్రయోజనాల కోసం ఏనుగులను లేదా మరే ఇతర జంతువులను ఎప్పుడూ ఉంచకూడదని లేదా అద్దెకు తీసుకోవద్దని పిలుపునిచ్చింది. నదయిరుతాల్ వేడుకల్లో ఏనుగులను సమర్పించడం సంప్రదాయంగా వస్తున్నది. ఇలా ఒక ఆలయంలో రోబో ఏనుగును ఉపయోగించడం ఇదే మొదటిసారి.
ఐరన్ ఫ్రేమ్స్, రబ్బర్ కోటింగ్‌తో ఈ ఏనుగును తయారుచేశారు. ఈ ఏనుగు నిజం ఏనుగులాగే తొండం ఊపుతుందని, చెవులను కదుల్చుతుండడం విశేషం. మావటి ఓ బటన్ నొక్కితే తొండంతో నీళ్లు విరజిమ్ముతూ అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇలాంటి పనులు చేసేందుకు ఈ ఏనుగు లోపల కొన్ని ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చారని నిర్వాహకులు చెప్పారు. ఇనుప చట్రానికి రబ్బరు తొడుగు వేసి ఈ ఏనుగును రూపొందించారన్నారు.
సాధారణణంగా ఏనుగులను పోషించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అలా చేసినా కూడా వాటితో కొన్నిరకాల ఇబ్బందులు వస్తు్న్నాయని ఆలయ అధికారులు అంటున్నారు. ఏనుగులను హింసించడాన్ని నిరోధించే క్రమంలో ఈ రోబో ఏనుగు ఒక వినూత్న ముందడుగుగా భావిస్తున్నామని స్పష్టం చేశారు. గత 15 ఏండ్లలో ఏనుగుల వల్ల 526 మంది మరణించాలని హెరిటేజ్ యానిమల్ టాస్క్‌ఫోర్స్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.