రెఫరెండంలో పాల్గొనలేక పారిపోతున్నరు

రెఫరెండంలో పాల్గొనలేక పారిపోతున్నరు

కీవ్: ఉక్రెయిన్​ ప్రజలను రెఫరెండంల భయం వెంటాడుతోంది. రష్యా తమ దేశంలో నాలుగు ప్రాంతాలను ఆక్రమించి వాటిపై రెఫరెండం పెట్టడంతో ఉక్రెయిన్ వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రష్యా సాయుధ బలగాలు ఇంటింటికీ తిరిగి ఓటింగ్​లో పాల్గొనాలని అడుగుతుండడంతో ఇప్పటికే చాలామంది రెఫరెండంలో పాల్గొనలేక ప్రాణభయంతో ఊర్లు విడిచి వెళ్లిపోయారు. రష్యన్ చట్టాల పరిధిలో నివసించడమనే ఆలోచనే భయం పుట్టిస్తున్నదని ఖేర్సన్ సిటీని వీడివెళ్లిన పెట్రో కోబర్ నిక్ అనే పౌరుడు తెలిపారు. తమ భవిష్యత్తుపై ఆశలు సన్నగిల్లాయని ఆయన చెప్పారు. ‘‘ప్రస్తుతం పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఓటింగ్ లో పాల్గొనాలని రష్యా మిలటరీ బెదిరిస్తున్నది. వద్దని ఉక్రెయిన్ గెరిల్లాలు, బలగాలు వారిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తోచడం లేదు. ప్రజలంతా భయంభయంగా బతుకుతున్నరు. కొంతమంది రష్యా అధికారులు బలగాలను వెంటబెట్టుకొని ఖేర్సన్ సమీపంలోని మా గ్రామానికి పోయారు. బ్యాలట్ పేపర్లతో మా ఇంటికి వెళితే.. ఓటింగ్ లో పాల్గొనడం ఇష్టంలేక మావాళ్లు తలుపులు వేసుకున్నరు’’ అని కోబర్ నిక్ ఓ వార్తా  సంస్థకు చెప్పారు. లుహాన్స్క్​, ఖేర్సన్, డోనెట్స్క్​, జపరోజియా రీజియన్లలో ప్రస్తుతం రెఫరెండం జరుగుతోంది. ఈ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నామని రష్యా ప్రకటించింది. ఓటింగ్ అయిపోయాక ఆ నాలుగు ప్రాంతాలు తమవిగా అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. అయితే రష్యా నిర్వహిస్తున్న ఈ రెఫరెండం చెల్లదని ఉక్రెయిన్, ఇతర పశ్చిమ దేశాలు పేర్కొంటున్నాయి. రష్యాది తొందరపాటు చర్య అని విమర్శించాయి.

ఓటింగ్​లో పాల్గొంటే ఖబడ్దార్

రష్యా నిర్వహిస్తున్న రెఫరెండంలో పాల్గొంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉక్రెయిన్ అధికారులు తమ పౌరులను హెచ్చరించారు. తమ ఆదేశాలను ధిక్కరిస్తే క్రిమినల్ పనిష్ మెంట్ ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఓటింగ్ లో పాల్గొనకుండా ఊర్లు విడిచివెళ్లాలని సూచించారు. కాగా లుహాన్స్క్​, ఖేర్సన్, డోనెట్స్క్​, జపరోజియా ప్రాంతాలను వదులుకొనేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా లేదు. ఇప్పటికీ ఆ ప్రాంతాలు తమ ఆధీనంలోనే ఉన్నాయని చెబుతోంది. అయితే, పౌరులను తుపాకులతో భయపెట్టి రెఫరెండంను అడ్డుకోవాలని చూస్తున్న ఉక్రెయిన్ ప్రయత్నాలు సఫలంకావని దక్షిణ ఖేర్సన్ ప్రాంతంలో రష్యా నియమించిన గవర్నర్ అన్నారు. క్రిమియాను రష్యా ఆక్రమించుకున్నప్పటి నుంచి తూర్పు డొనెట్స్క్​, లుహాన్స్క్​ వేర్పాటువాదులు ఆ ప్రాంతాలను రష్యాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. వారికి రష్యా సపోర్టు కూడా ఉంది.