పన్నెండు రోజులుగా ఒక సర్కిల్‌‌లా చుట్టూ తిరుగుతున్న గొర్రెలు

పన్నెండు రోజులుగా ఒక సర్కిల్‌‌లా చుట్టూ తిరుగుతున్న గొర్రెలు

ఏదైనా అర్థం లేని పనులు చేసినప్పుడు గొర్రెలతో పోలుస్తుంటారు కొంతమంది. అయితే ప్రస్తుతం గొర్రెలు చేస్తున్న ఓ పని.. సైంటిస్టులనే ఆలోచింపజేస్తోంది. నార్త్ చైనాలోని ఒక ఊళ్లో గొర్రెలు పన్నెండు రోజులుగా ఒక సర్కిల్‌‌లా చుట్టూ తిరుగుతున్నాయి. అవి ఎందుకలా తిరుగుతున్నాయో ఎవరికీ అంతుపట్టడం లేదు. గొర్రెలు ఇలా తిరుగుతున్న వీడియో ప్రస్తుతం చైనా మీడియాలో వైరల్ అవుతోంది. అయితే గొర్రెలకు ఏదైనా వ్యాధి సోకిందేమో అని గొర్రెల కాపరిని అడిగితే అవి పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పాడు అతను. “ఈ ఏడాది నవంబర్ 4 నుంచి గొర్రెలు ఇలా వింతగా బిహేవ్ చేస్తున్నాయి. గుంపులో ఉన్న 34 గొర్రెల్లో  ముందు 13 గొర్రెలు ఇలా తిరగడం మొదలుపెట్టాయి.

ఆ తర్వాత మిగతావి కూడా జాయిన్ అయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటివరకూ గ్యాప్ లేకుండా తిరుగుతూనే ఉన్నాయి” అని కాపరి చెప్తున్నాడు. గొర్రెలు ఇలా తిరగడానికి సర్కిల్ డిసీజ్ అనే వ్యాధి కారణమని కొన్ని థియరీలు ఉన్నాయి.  అయితే అలాంటి డిసీజ్  వచ్చినప్పుడు జంతువులు రెండు రోజులపాటు వింతగా ప్రవర్తించి, ఆ తర్వాత చనిపోతాయి. కానీ, ఇక్కడ మాత్రం పన్నెండు రోజులుగా ఒకదానివెంట ఒకటి తిరుగుతూనే ఉన్నాయి. మధ్యలో కొన్ని అలా బయటకెళ్లి మేత మేసి మళ్లీ వచ్చి సర్కిల్‌‌లో జాయిన్ అవుతున్నాయి. ఈ గొర్రెలకు ఏమైందో ఎవరికీ అర్థం కావట్లేదు.