గురుకులాల్లో పెరుగుతున్న ఫుడ్ పాయిజన్ కేసులు

గురుకులాల్లో పెరుగుతున్న ఫుడ్ పాయిజన్ కేసులు
  • బువ్వ, నీళ్లు సక్కగ లేవు
  • ఈ ఏడాదిలో 615 కేసులు 
  •  ఫుడ్ క్వాలిటీపై ఎప్పటికప్పుడు చెక్​ చేస్తుండాలని సర్కార్‌‌‌‌కు అధికారుల రిపోర్ట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల్లో నాణ్యత లేని తిండితో విద్యార్థులు అనారోగ్యంపాలవుతున్నారు. తరచూ ఫుడ్ పాయిజన్​లకు తోడు.. మంచినీళ్లు కూడా కలుషితం అవుతున్నాయి. ఫలితంగా స్టూడెంట్స్​కు తీవ్ర గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర సర్కార్‌‌‌‌కు ఉన్నతాధికారుల నుంచి రిపోర్ట్ అందింది. 

కలుషిత ఆహారం, పరిశుభ్రంగా లేని నీటి కారణంగా ఈ ఏడాదిలోనే ఇప్పటి దాకా 11 ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకున్నాయని, గురుకులాలు, హాస్టళ్లలో 615 గ్యాస్ట్రిక్ సంబంధిత కేసులు నమోదయ్యాయని రిపోర్టులో పేర్కొన్నారు. గత ఐదేండ్ల లెక్కలు చూస్తే.. గురుకులాలు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ కారణంగా 2,040 మంది గ్యాస్ట్రిక్ సమస్యలు ఎదుర్కొన్నట్లు వివరించారు. ఈ లెక్క తీవ్రమైన అనారోగ్యం పాలైన వారిదేనని.. ఇంకా హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ తీసుకున్న వారందరి లెక్క కలిపితే అంతకు మూడింతలు ఉంటుందని చెప్తున్నారు. ఫుడ్ క్వాలిటీపై ఎప్పటికప్పుడు చెకప్ ఉండాలని సూచించారు. ఇటీవల ఫుడ్ పాయిజన్ వల్ల వందలాది మంది విద్యార్థులు కడుపు నొప్పితో హాస్పిటళ్లలో ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ తీసుకున్నారు. మరికొన్ని సార్లు వారికి తెలియకుండానే నాణ్యత లేని కలుషిత ఆహారం తిని సాధారణ కడుపు నొప్పిగానే భావించి వదిలేస్తున్నారు. ఇలాంటి వాటి ఫలితంగా దీర్ఘకాలంలో జీర్ణ సంబంధిత సమస్యలు మరింతగా ఎదుర్కోవాల్సి వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గురుకులాల్లో నాసిరకం ఆహారాన్ని అందించడం వల్లే విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురవుతున్న ఘటనలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

10 జిల్లాల్లో ఫుడ్ పాయిజన్

చాలాచోట్ల అన్నంలో పురుగులు ఉండటం, పాడైన కూరగాయలతో వంట చేసి వడ్డిస్తుండడంతో ఫుడ్ పాయిజనింగ్ జరిగి విద్యార్థులు హాస్పిటల్ పాలవుతున్నారు. ఇవి గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తున్నాయి. ఈ 7 నెలల్లోనే 10 జిల్లాల్లో ఫుడ్ పాయిజన్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో హనుమకొండలో 22 మంది విద్యార్థులు, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌లో 117 మంది, మెదక్‌‌‌‌‌‌‌‌లో 12 మంది, పెద్దపల్లిలో 20 మంది, మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌లో 56, జగిత్యాలలో 25, నల్గొండలో 60, సిద్దిపేటలో 132, గద్వాలలో 65 , నిర్మల్‌‌‌‌‌‌‌‌లో 106 కలిపి మొత్తంగా 615 మంది ఫుడ్ పాయిజన్‌‌‌‌‌‌‌‌కు గురయ్యారు. ఇంకా చాలా చోట్ల గురుకులాల్లో, ప్రభుత్వ హాస్టళ్లలో అన్నం తిన్న తర్వాత, కొన్నిసార్లు నీళ్లు తాగిన తర్వాత కడుపు నొప్పితో బాధపడినా.. సాధారణ నొప్పిగానే భావించి వదిలేస్తున్నారని ఆఫీసర్లే చెబుతున్నారు. పాడైపోయి.. ఫంగస్ వచ్చిన ఆహారాన్ని కొన్నిసార్లు వడ్డిస్తున్నట్లు గుర్తించారు. దీని ఫలితంగా భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో గ్యాస్ట్రిక్‌‌‌‌‌‌‌‌తోపాటు తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

అంతా పేద విద్యార్థులే

వాస్తవానికి తొలినాళ్లలో గురుకులాలకు మంచి పేరు వచ్చింది. చదువు, వసతి బాగుంటుందనే నమ్మకం పేరెంట్స్‌‌‌‌‌‌‌‌లో కలిగింది. ఇందులో 80% పైన పేదొళ్ల పిల్లలే చదువుతున్నారు. కానీ సర్కారు తీరుతో గురుకులాల్లో ప్రమాణాలు తగ్గుతూ వస్తున్నాయి. సరిగా ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దొరక్కపోగా నాసిరకం, కలుషితమైన అన్నం వడ్డిస్తున్నారు. కొంత మంది తింటే కడుపు నొప్పి వస్తోందని తక్కువ తింటున్నారు. మరికొందరు అన్నం తినడం మానేస్తూ బయట చిరుతిండ్లు తింటున్నట్లు ఆఫీసర్లు ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టులో పేర్కొన్నారు. గురుకులాల్లో నాణ్యమైన వస్తువులు, తాజా కూరగాయలు వినియోగించడం లేదని తెలిపారు. మిషన్ భగీరథ నీటిని సప్లై చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ అనేక చోట్ల ఆ నీళ్లు అందడం లేదు. భగీరథ పైప్ లైన్లు పగిలి వాటర్ కంటామినేట్ అవుతోంది. బోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్స్‌‌‌‌‌‌‌‌ దగ్గర కూడా సరైన క్లీనింగ్ లేకపోవడంతో తాగే నీరు కలుషితం అవుతున్నది.

ఐదేండ్ల నుంచి ఇట్లనే

ఐదేండ్ల నుంచి గురుకులాల్లో, ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్నా సర్కార్ పట్టించుకోవడం లేదు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టడం లేదు. 2017లో 244 మంది, 2018లో 135 మంది, 2019లో 571 మంది, 2020లో 102 మంది, 2021లో 373 మంది  విద్యార్థులు గ్యాస్ట్రిక్ సమస్యలు ఎదుర్కొన్నారు. 2020లో కరోనా ఉండటంతో గురుకులాలు, హాస్టళ్లు బంద్ ఉన్నాయి. దీంతో ఆ ఒక్క ఏడాది కేసులు తగ్గినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. తీవ్ర అనారోగ్యం పాలైన వారి వివరాలే రిపోర్టులో వెల్లడించామని, కడుపు నొప్పికి ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ తీసుకుని వెళ్లిన వారి సంఖ్య వేలల్లో ఉంటుందని అంటున్నా రు. ఎప్పటికప్పుడు సన్న బియ్యం పంపిణీ చేయడం, నిల్వ చేయకుండా తాజా కూరగాయలు, నాణ్యమైన వస్తువులు పంపిణీ చేయడం, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీ చేసి ఆహారాన్ని పరీక్షించడం చేస్తే విద్యార్థులకు మంచి ఫుడ్​ అందుతుందని నిపుణులు సూచిస్తున్నారు.