- ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి
నిర్మల్/ఆదిలాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే అందరి లక్ష్యం కావాలని, నాయకులంతా సమన్వయంతో వ్యవహరించి అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచార బాధ్యతలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి సుదర్శన్ రెడ్డి సూచించారు. నిర్మల్ లోని ఓ హోటల్లో జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరి రావు, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్‌తో కలిసి రివ్యూ నిర్వహించారు.
నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు పనిచేయాలన్నారు. సర్వేల ఆధారంగా అధిష్ఠానం టికెట్లు కేటాయిస్తుందన్నారు. ఎవరికి టికెట్ కేటాయించినా అంతా కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అర్జుమంద్, నియోజకవర్గ ఇన్చార్జ్ బోస్లే నారాయణ రావు పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఎంబడి రాజేశ్వర్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సమరసింహారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ మున్సిపల్ పీఠంపై జెండా ఎగరేస్తాం
ఆదిలాబాద్జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో శనివారం మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. పాల్గొన్న సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం కాయమన్నారు. పార్టీలో కష్టపడ్డ వారికి టికెట్లు కేటాయిస్తామన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్డీసీసీ అధ్యక్షులు నరేశ్ జాదవ్, బొజ్జు పటేల్, ఆత్రం సుగుణ, జిల్లా పరిశీలకుడు తాహెర్ బిన్ హందాన్, ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్, బోథ్ ఇన్చార్జ్ ఆడె గజేందర్, ఆత్మ చైర్మన్ సంతోష్, జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ భోజారెడ్డి తదితరులు ఉన్నారు.
