ఇటలీలో పుట్టిన రెండు నెలలకే కరోనా బారిన పడిన చిన్నారి ఆ మహమ్మారి బారి నుంచి సురక్షితంగా బయటపడింది. ఆ పాపతో పాటు ఆమె తల్లిని బారి సిటీలోని హాస్పిటల్లో మార్చి 18న చేర్చారు. గురువారం ఆ పాపకు న్యుమోనియా, జ్వరం తగ్గాయని డాక్టర్లు తెలిపారు. చిన్నారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి, తల్లితో పాటు పంపించామని వెల్లడించారు. కరోనా మహమ్మారి విజృంభించడంతో నిత్యం వందలాది మరణాలను చూస్తున్న ఇటలీకి ఈ చిన్నారి ఓ ఆశాదీపంలా కనిపిస్తోంది. వైరస్ పై సోరాటానికి ఆ దేశానికి ఓ స్ఫూర్తిగా నిలుస్తోంది ఆ పసికందు.
చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 15 లక్షల 50 వేల మందికి పైగా కరోనా సోకింది. ఇందులో 91 వేల మంది మరణించగా.. సుమారు మూడున్నర లక్షల మంది పూర్తిగా కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రపంచంలోనే అమెరికాలో అత్యధికంగా నాలుగున్న లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో సుమారు 15 వేల మందికి పైగా మరణించారు. ఇటలీలో లక్షా 43 వేల మందికి వైరస్ సోకగా.. ప్రపంచంలోనే భారీగా 18,279 మంది ఈ దేశంలోనే మరణించారు. ఇటలీలో గురువారం ఒక్క రోజులోనే 610 మంది ప్రాణాలు కోల్పోయారు.
