
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. రోజు రోజుకీ భారీగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజులో 1,320 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 27,654కు చేరింది. అందులో 761 మంది మరణించగా.. 10.664 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 16,229 మంది వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాజధాని నగరంలో టెస్టులు చేసిన ప్రతి నలుగురిలో ఒకరికి పాజిటివ్ వస్తోందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల చివరి కల్లా ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య లక్ష వరకూ చేరే అవకాశం ఉందని ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ అంచనా వేసింది. మరో వైపు ఢిల్లీలో వైరస్ వ్యాప్తి కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ దశకు చేరిందని భారత మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ (ఐసీఎంఆర్) మాజీ చీఫ్ ఎన్.కె. గంగూలీ అన్నారు.
ఢిల్లీలో 219కి చేరిన కంటైన్మెంట్ జోన్ల సంఖ్య
ఢిల్లీలో అన్ని ప్రాంతాలకు కరోనా వైరస్ విస్తరిస్తోంది. కొత్త ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి చెందడంతో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 219కి చేరింది. ఉత్తర ఢిల్లీలో 33, నైరుతి ఢిల్లీలో 31, దక్షిణ ఢిల్లీలో 28, పశ్చిమ ఢిల్లీలో 26 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. వాయవ్య ఢిల్లీలో 19, తూర్పు ఢిల్లీలో 17, సెంట్రల్ ఢిల్లీలో 17, షాహదరాలో 16, న్యూఢిల్లీలో 14, ఆగ్నేయ ఢిల్లీలో 14, ఈశాన్య ఢిల్లీలో 4 కంటైన్మెంట్ ఏరియాలు ఉన్నాయి.
ఢిల్లీ ఆస్పత్రుల్లో లోకల్స్ కి మాత్రమే బెడ్స్
ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ ప్రభుత్వ పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌హాస్పిటల్స్ కేవలం లోకల్స్ కోసమే రిజర్వ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. హాస్పిటల్స్‌లో బెడ్లు ఖాళీ లేవనే దానిపై గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా ఢిల్లీ బోర్డర్లు తెరుస్తున్నందున బయటి రాష్ట్రాల వారు వస్తారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వచ్చే హాస్పిటల్స్‌లో ఇతర రాష్ట్రాల వారు ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చన్నారు. సోమవారం నుంచి ఢిల్లీ బోర్డర్లు తెరుస్తామని అన్నారు.