దుబ్బాకలో… నిశ్శబ్ద విప్లవం

దుబ్బాకలో… నిశ్శబ్ద విప్లవం

ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీజేపీ వైపే జనం

రాష్ట్ర రాజకీయం ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో బలమైన శక్తిగా బీజేపీ ఎదుగుతున్న క్రమంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికతో జనం దృష్టి దుబ్బాకపై పడింది. టీఆర్​ఎస్​కు ముచ్చెమటలు పట్టిస్తూ, ఆ పార్టీ నాయకులకు కొరకరాని కొయ్యలా మారిన రఘునందన్​రావు బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉండడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ‘‘రాష్ట్రంలో బీజేపీ ఎక్కడున్నది. దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అని మాట్లాడిన కల్వకుంట్ల ఫ్యామిలీ ఇప్పుడు సోషల్ మీడియాలో బీజేపీ శ్రేయోభిలాషి ఏదో పోస్ట్ పెట్టాడని, దాన్ని పట్టుకుని బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నది. ఉప ఎన్నిక కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ.. తిరిగి బీజేపీ డబ్బులు పంపిణీ చేస్తోందని చెప్తూ అధికార దుర్వినియోగా నికి పాల్పడుతున్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజలు ఎన్నుకున్న ఒక ఎంపీ అని కూడా చూడకుండా ఆయనపై దాడి చేసి గొంతు నులిమే ప్రయత్నం చేసింది. దీన్ని బట్టి బీజేపీ బలమేంటో రుజువవుతున్నది. బీజేపీకి పూర్తి అనుకూల ట్రెండ్ ఉందనేది స్పష్టమవుతున్నది. దుబ్బాకలో పరిస్థితులను చూస్తుంటే టీఆర్​ఎస్​ ఒకవేళ ఈ ఎన్నికలో నైతికతను పాటిస్తే డిపాజిట్ దక్కడం కూడా కష్టమే. అనూహ్యంగా అధికార పార్టీ మూడో స్థానానికి పరిమితం కాక తప్పదు.

ఒక వైపు కేసీఆర్​ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం, మరోవైపు కేసీఆర్​ కొడుకు, అనధికార సీఎం కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల, ఇంకోవైపు సీఎం మేనల్లుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​రావు నియోజకవర్గం సిద్దిపేట సరిహద్దులను ఆనుకుని ఉంది దుబ్బాక. కానీ, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల.. ఈ మూడు నియోజకవర్గాల్లో కనపడుతున్న అభివృద్ధి.. దుబ్బాకలో కనపడటం లేదు? దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి చెయ్యని అభివృద్ధి ఆయన భార్య సుజాతమ్మ చేస్తుందనే నమ్మకం ఏమిటి? మూడు సార్లు గెలిచిన రామలింగారెడ్డినే ఏ రోజూ అసెంబ్లీలో మాట్లాడనివ్వని టీఆర్​ఎస్​ సుజాతమ్మను మాట్లాడనిస్తుందా? టీఆర్​ఎస్​ గెలిస్తే 100 మంది ఎమ్మెల్యేలకు ఇంకొకరు జత అవుతారు తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదు.

కానీ, రఘునందన్ రావు గెలిస్తే, అధికార పార్టీకి చెందిన 100 మంది ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తాడని, బీజేపీ ప్రజల ముందు పెట్టిన అంశాల చుట్టే ఈ ఉప ఎన్నిక ప్రచారం సాగడం బీజేపీ సాధించిన మొదటి విజయం. అందరికంటే ముందే బీజేపీ అభ్యర్థి ప్రచారాన్ని ప్రారంభించడం మరో ప్లస్ పాయింట్. రఘునందన్ రావు గతంలో రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో, ఒకసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. గెలిచినా ఓడినా నియోజకవర్గాన్ని వీడకుండా దుబ్బాక భూమిపుత్రునిగా దశాబ్దాలుగా ఇక్కడి సమస్యలపై గళమెత్తి పోరాటం చేసిన నాయకుడిగా రఘునందన్ రావుకు గుర్తింపు ఉండడం వల్ల నియోజకవర్గ ప్రజల్లో బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి.

సమస్యలపై సమాధానం ఏది?

సాధారణంగా నియోజకవర్గ అభివృద్ధి, అక్కడి సమస్యల ఆధారంగా ఎన్నికల ప్రచారం సాగుతుంది. కానీ, బీజేపీ లేవనెత్తుతున్న స్థానిక అంశాలపై సమాధానం చెప్పే దమ్ము టీఆర్‌‌ఎస్‌లో కనిపించడం లేదు. అందుకే టీఆర్​ఎస్​ అనధికార ఉప ఎన్నిక ఇన్​చార్జ్​, మంత్రి హరీశ్​ రావు సంబంధం లేని అంశాలపై మాట్లాడుతున్నారు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా దుబ్బాక చుట్టూ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులు ఉన్నా ఈ నియోజకవర్గం మాత్రం అభివృద్ధికి దూరంగానే నిలిచిపోయింది.

గజ్వేల్​లో నాలుగు లేన్ల రోడ్లు, దుబ్బాకలో మాత్రం గతుకుల రోడ్లు, సిద్దిపేటలో కొత్త మెడికల్ కాలేజీలు, కొత్త హాస్పిటల్స్, వ్యవసాయ సూపర్ మార్కెట్లు, దుబ్బాకలో మాత్రం ఉన్న డిగ్రీ కాలేజీనే మూసేశారు. మెడికల్ కాలేజీకి జాగ దొరకదు. సిరిసిల్లకు కోట్ల కొద్దీ నిధులు, దుబ్బాకలో మాత్రం 90 % పూర్తి అయినయ్ అని చెప్పే జాడ లేని 1,000 డబుల్ బెడ్ రూం ఇండ్లు. ఇలా రాష్ట్ర నలుమూలల నుంచి వెళ్తున్న అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలకు దుబ్బాక పై టీఆర్​ఎస్​  ప్రభుత్వం చూపిన వివక్ష అడుగడుగునా కళ్లకు కట్టినట్లుగా కనపడుతున్నది.

బీజేపీనే ప్రత్యామ్నాయ శక్తి

రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి రాష్ట్ర అసెంబ్లీపై కాషాయ జెండా ఎగురవేయాలని భావిస్తున్న బీజేపీకి దుబ్బాక ఉప ఎన్నిక ఇంద్రుని వజ్రాయుధం వంటిదని భావిస్తోంది. కాబట్టి అన్ని శక్తులు ఒడ్డి పోరాడుతోంది. అందుకే ఉప ఎన్నికలో టీఆర్​ఎస్​ అనుసరించే వ్యూహాలపై పూర్తి అవగాహన ఉన్న సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ జితేందర్​రెడ్డిని ఇన్​చార్జ్​గా రంగంలోకి దింపి రాష్ట్రంలోని ముఖ్య నాయకులందరినీ ఎన్నికల ప్రచారంలో భాగస్వాములను చేస్తోంది. దీన్ని జీర్ణించుకోలేని మంత్రి హరీశ్​ బీజేపీ గోబెల్స్ ప్రచారం చేస్తోందని మాట్లాడుతున్నారు. వాస్తవానికి ప్రపంచంలో అతి పెద్ద గోబెల్స్​ సీఎం కేసీఆరే. ఆయన అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారు. దళితుడిని సీఎం చేస్తానన్నారు. దళితులకు మూడెకరాల భూమి, పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇల్లు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు భృతి, గిరిజనులకు మూడెకరాల భూమి, ఇలా చెప్పుకుంటే పోతే సీఎం కేసీఆర్​ చెప్పిన అబద్ధాల గురించి రాస్తే రామాయణం అంత చెప్తే భారతం అంత అవుతుంది.

హరీశ్​కు ఓటమి భయం

దుబ్బాకలో అరాచకం రాజ్యమేలుతోంది. మంత్రి హరీశ్‌ దానిని ప్రోత్సహిస్తున్నారు. సిద్దిపేటలో పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ, దుబ్బాకలో శాంతియుతంగా ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తూ సంజయ్​ దీక్ష చేపట్టారు. ఆయన షుగర్ లెవెల్స్ 59కి పడిపోయి, ఆరోగ్యం ప్రమాదకర స్థాయికి చేరిందని డాక్టర్లు హెచ్చరించి, తక్షణమే ఆస్పత్రికి తరలించాలని సిఫారసు చేసినా అవేవి ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిని బట్టే బీజేపీపై టీఆర్​ఎస్​ ఎంత కక్ష పెంచుకున్నదో అర్థమవుతోంది. ఇప్పటికే టీఆర్‌‌ఎస్​లో తన ఉనికి అంతంత మాత్రంగానే ఉండటంతో ఈ ఎన్నిక తర్వాత అటు పార్టీలోనూ, ఇటు సిద్ధిపేట పరిసర ప్రాంతాల్లోనూ తాను చెల్లని రూపాయిగా మారతానేమో అనే భయం హరీశ్​కు పట్టుకుంది. అందుకే బీజేపీపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. హరీశ్​ ఎన్ని జిమ్మిక్కులు చేసినా దుబ్బాకలో ఆయన మంత్రం పారడం లేదు. టీఆర్​ఎస్​ క్యాడర్​లో జోష్ మిస్సయింది. తమ బలంపై నమ్మకం పోయింది.

కాంగ్రెస్​కు కేడర్ లేదు

ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్​చార్జ్​గా బాధ్యతలు చేపట్టిన మాణిక్కం ఠాకూర్ తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో భాగంగా పార్టీ నాయకుల్లో జోష్‌ పెంచడానికి ఎంతగా ప్రయత్నం చేస్తున్నా కింది స్థాయిలో కేడర్ లేకపోవడం, రాష్ట్ర నాయకుల మధ్య సమన్వయం లేక ఆ పార్టీ ఈ ఎన్నికలో పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. పైగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గతంలో టీఆర్​ఎస్​లో పని చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల కంటే టీఆర్​ఎస్​ ఓట్లనే ఎక్కువగా చీలుస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది బీజేపీకి మరో వరం.

జనం బీజేపీకే ఓటేస్తారు

బీజేపీని నిలువరించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక అప్రజాస్వామిక పద్ధతులను అవలంబిస్తోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమ పద్ధతుల్లో అభ్యర్థి సెల్ ఫోన్ గుంజుకోవడం, కార్​  సీజ్ చేయడం, అభ్యర్థి ప్రచార సమయాన్ని వృథా చేయడం వంటివి చేస్తోంది. డబ్బులు వెదజల్లి, బెదిరించి స్థానిక నాయకులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఎన్ని అక్రమ మార్గాలు ఎంచుకున్నా కమల వికాసాన్ని ఆపలేరు. దుబ్బాకలో ఒక నిశ్శబ్ద విప్లవం మొదలైంది. ప్రజలు సైలెంట్​గా బీజేపీకి  ఓటు వేసి రఘునందన్​రావుకు అవకాశం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. దుబ్బాకలో విజయం సాధించి.. రాబోయే ఎమ్మెల్సీ, జీహెచ్​ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికల్లోనూ విజయ బావుటా ఎగురవేసి టీఆర్​ఎస్​ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.

యూత్​ బీజేపీ వైపే

స్థానిక యువత సోషల్ మీడియా వేదికగా దుబ్బాక వెనుకబాటుతనంపై టీఆర్​ఎస్​ నాయకులను ప్రశ్నిస్తున్నారు. అదే విషయాన్ని బీజేపీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. యువతను ఆకట్టుకోవడంలో బీజేపీ పూర్తిగా సక్సెస్​ అయ్యిందనే చెప్పచ్చు. ఇది రఘునందన్ రావు నామినేషన్ ర్యాలీలో స్పష్టంగా కనిపించింది. ఒకవైపు టీఆర్​ఎస్​ కోట్ల రూపాయలు ఖర్చు చేసి యువతను సమీకరించాలనే ప్రయత్నం చేసినా అది విఫలమవుతోంది.

మరోవైపు బీజేపీ కార్యక్రమాల్లో జీన్స్, టీషర్ట్స్​ వేసుకున్న వాళ్లు స్వచ్చందంగా తండోపతండాలుగా పాల్గొంటున్నారంటే యువత వన్ సైడ్​గా ఉందని స్పష్టమవుతోంది. గత లోక్​సభ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్​లో ఇదే తరహా వాతావరణం టీఆర్​ఎస్​ కొంప ముంచింది. కాబట్టి దుబ్బాకలో యువత వన్ సైడ్ కావడం టీఆర్​ఎస్​ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

కేంద్రం ఇస్తున్న నిధులపై చర్చకు సిద్ధమా?

కేంద్రం ఏయే పథకాల్లో రాష్ట్రానికి ఎంత ఇస్తున్నదో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వ వెబ్​సైట్లలో వెల్లడిస్తుంటే దాన్ని వదిలేసి లెక్కల మంత్రి హరీశ్​రావు ఎవరో సోషల్ మీడియాలో పెట్టిన దాన్ని ప్రాతిపదికగా చేసుకొని బీజేపీని సవాల్ చెయ్యడం ఏమిటి? సోషల్ మీడియాలో ఎవరో ఏదో పెడితే దానిపై మాట్లాడుతున్న హరీశ్​.. ప్రజలకు అందిస్తున్న రూపాయికి కిలో బియ్యంలో కేంద్రం అందిస్తున్న 90 శాతం వాటా గురించి ఎందుకు మాట్లాడరు? గ్రామాలకు, పట్టణాలకు కేంద్రం 15వ ఆర్థిక సంఘం ద్వారా అందిస్తున్న వేల కోట్ల రూపాయల నిధుల గురించి ఎందుకు మాట్లాడరు? కేంద్ర సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. ఇది వాస్తవం.

హరీశ్​రావు రాష్ట్రానికి లెక్కల మంత్రిగా ఉండడమే మనం చేసుకున్న దౌర్భాగ్యం. వీరి హయాంలో ధనిక రాష్ట్రం కాస్తా దివాళా తీసి , అప్పుల రాష్ట్రంగా మారింది. 15 రోజులు లాక్​డౌన్​ విధిస్తే జీతాలివ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ ఘనత సాధించిన హరీశ్​.. కేంద్రం అందిస్తున్న నిధుల గురించి మాట్లాడడంపై సవాల్ విసరడం విడ్డూరంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరెన్ని నిధులు ఇస్తున్నారనే దానిపై సమావేశాలు పెడుదాం. కేంద్రం తరపున, బీజేపీ పక్షాన బండి సంజయ్ చర్చకు సిద్ధం. కేంద్రంపై నోరుపారేసుకునే సీఎం కేసీఆర్​ దీనికి సిద్ధంగా ఉన్నారా? – ఏనుగుల రాకేశ్​రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

 

for more news…