ఇంజనీరింగ్‌లో ఈ ఏడాది పాత ఫీజులే

ఇంజనీరింగ్‌లో ఈ ఏడాది పాత ఫీజులే
  • సర్కారుకు టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదన
  • అన్ని టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సుల్లో అమలుకు చర్యలు
  • తర్వాతి రెండేండ్లపై ప్రభుత్వానిదే నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు టెక్నికల్, ప్రొఫెషనల్ కాలేజీల్లో ఈ ఏడాది పాత ఫీజులే అమలు కానున్నాయి. కొత్త గా మూడేండ్ల బ్లాక్ పీరియడ్‌‌‌‌కు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఫీజు లను నిర్ణయించినా.. 2022–23లో మాత్రం గత ఫీజులే కొనసాగించాలని సర్కారు భావిస్తున్నది. దీంతో పాత ఫీజులే కొనసాగించాలని టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదించింది. ఇది అమలు జరిగితే పేద విద్యార్థులకు ఫీజుల నుంచి కొంత ఉపశమనం జరిగే అవకాశముంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, లా, బీఈడీ.. తదితర 27 కోర్సుల్లో 2022–23 నుంచి 2024–25 అక డమిక్ ఇయర్ దాకా బ్లాక్ పీరియడ్‌‌‌‌కు ప్రైవేటు కాలేజీల మేనేజ్‌‌‌‌మెంట్లతో టీఏఎఫ్ఆర్సీ ప్రతినిధులు సమావేశమై వివరాలు సేకరించారు.

వీటి ఆధారంగా మొత్తం 1,196 ప్రైవేటు కాలేజీల్లో ఫీజులను నిర్ణయించేందుకు ప్రతిపాదనలు రెడీ చేశారు. వీటిలో మినిమమ్ ఇంజనీరింగ్ ఫీజు రూ.35 వేల నుంచి రూ.45 వేల దాకా ఉండాలని, అత్యధికంగా రూ.1.73 లక్షల దాకా ఫీజు ఉండొచ్చని టీఏఎఫ్ఆర్సీ అంచనాలు రూపొందించింది. అన్ని కోర్సుల్లోనూ మినిమమ్ ఫీజును కొంత పెంచింది. అయితే వీటిని టీఏఎఫ్ఆర్సీ రాటిఫై చేసి సర్కారుకు ప్రతిపాదించాల్సి ఉంది. సోమవారం హైదరాబాద్‌‌‌‌లో టీఏఎఫ్ఆర్సీ మీటింగ్​ జరిగింది. దీంట్లో విద్యాశాఖ సెక్రెటరీ వాకాటి కరుణతో పాటు టీఏఎఫ్ఆర్సీ చైర్మన్ స్వరూప్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ఓయూ వీసీ రవీందర్, జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి, ఫైనాన్స్ డిపార్ట్‌‌‌‌మెంట్ ప్రతినిధి పాల్గొన్నారు.

వచ్చే రెండేండ్లపై క్లారిటీ రాలే
రెండేండ్ల నుంచి కరోనా వల్ల కాలేజీల్లో పెద్దగా ఖర్చులు లేకపోవడం, పేరెంట్స్ ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో 2022–23 విద్యాసంవత్సరంలో పాత ఫీజులే అమలు చేయాలని నిర్ణయించినట్టు టీఏఎఫ్ఆర్సీ సభ్యులు ఒకరు చెప్పారు. మరోపక్క మెడికల్ కాలేజీల్లోనూ గతేడాది ఫీజులను పెంచలేదని గుర్తుచేశారు. ఇదే విషయాన్ని సర్కారుకు ప్రతిపాదించారు. ఈ బ్లాక్​ పీరియడ్‌‌‌‌లో భాగంగానే తర్వాతి రెండేండ్లకు ఫీజులను పెంచుతారా లేదా అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే దీనిపై సర్కారు అధికారికంగా జీవో ఇవ్వనున్నది.