ఒంటరిగా ఉండే టైం దొరకడమే అదృష్టమట!

ఒంటరిగా ఉండే టైం దొరకడమే అదృష్టమట!

‘‘నాతోనే నేనుంటాను.. నచ్చిన పనినే చేస్తుంటాను...” ఈ పాట వినే ఉంటారు. ఒక సినిమాలో హీరో తన ఏకాంతాన్ని ఎంజాయ్​ చేస్తూ పాడే పాట ఇది. ఒంటరితనంతో బాధపడేవాళ్లు వాళ్ల బాధను మర్చిపోవడానికి అప్పుడప్పుడు గుర్తుచేసుకోవాల్సిన మాటలివి. ఒంటరిగా ఉండే టైం దొరకడమే అదృష్టం ఈ రోజుల్లో. నిజానికి ఒంటరిగా ఉన్నప్పుడే మనల్ని మనం తెలుసుకోగలం. మనసారా ఆనందించగలిగే విలువైన సమయమది. అందుకే ఆ టైంని ‘ఏకాంతం’ అంటారు. అదేంటి? ఒంటరితనం, ఏకాంతం రెండింటికి తేడా ఉంటుందా? అంటే... కచ్చితంగా ఉంటుంది. కష్టంగా అనిపిస్తే ఒంటరితనం, ఇష్టంగా అనిపిస్తే ఏకాంతం. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. కొందరు ఫ్యామిలీతో, ఫ్రెండ్స్​తో, రిలెటివ్స్​తో ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్లు లైఫ్​ని​ ఎంజాయ్​ చేస్తుంటే... ఒంటరివాళ్లకి అది చూసి బాధ కలుగుతుంది. ‘‘నేను ఒంటరిని. నాకెవరూ లేరు. నా జీవితంలో సంతోషం లేదు’’ అనుకుంటూ డిప్రెషన్​లోకి వెళ్లిపోతుంటారు. ఒంటరిగా ఉన్నంత మాత్రాన డిప్రెషన్​ బారిన పడాల్సిన అవసరం లేనే లేదు. ఒంటరిగానే ఈ లైఫ్​ని హ్యాపీగా గడపొచ్చు అంటున్నారు ఎక్స్​పర్ట్స్​. 
కొత్తగా ట్రై చేయాలి
చాలామందికి ఒంటరిగా ఉండటం అస్సలు ఇష్టం ఉండదు. కారణం ఫ్రీ టైం దొరికినప్పుడు ఏం చేయాలో వాళ్లకి తెలియదు. అలాంటివాళ్లు రాని వాటిని లేదా ఇష్టమైన వాటిని నేర్చుకోవచ్చు. వాటిలో బుక్ రీడింగ్, పెయింటింగ్​, డాన్స్​, సింగింగ్ వంటివి ఏవైనా ఉండొచ్చు. అది కూడా ఇష్టంగా, ఎంజాయ్​ చేస్తూ నేర్చుకోవాలి. దానివల్ల ఎవరితో వాళ్లు చాలా బాగా కనెక్ట్ అవుతారు. 
ఇతరులతో పోల్చుకోవద్దు
సంతోషంగా ఉండలేకపోవడానికి మరో కారణం ఇతరులతో పోల్చుకోవడం. చుట్టూ ఉండేవాళ్లు ఎప్పుడూ ఎంకరేజ్​ చేస్తారనుకోవడం తప్పు. ఎవరి ఉద్దేశాలను బట్టి వాళ్లు మాట్లాడతారు. అవి సీరియస్​గా తీసుకుని ఇతరులతో పోల్చుకోవడం, ‘‘నేను వాళ్లలా ఉండలేకపోతున్నానే..’’ అని బాధపడటం తప్పు. అలాగే సోషల్​ మీడియాలో పంచుకునే పోస్ట్​లు కూడా ఈ విషయంలో చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. వేరే వాళ్లు పెట్టిన పోస్ట్​లు, ఫొటోలు చూసి పోల్చుకోవడం కూడా తప్పే. 
సోషల్ మీడియాకు బ్రేక్​ 
ఈరోజుల్లో సోషల్​ మీడియా అంటే ప్రజలకు ఎనలేని వ్యామోహం. గంటల తరబడి అందులోనే గడిపేస్తుంటారు. మనసుకు నచ్చినట్టు ఉండడానికి అదొక వరంలా భావిస్తున్నారు. ఎందుకంటే దాని ద్వారా ఎక్కడ ఉన్న వ్యక్తులతోనైనా మాట్లాడొచ్చు. ఎంత దూరాన ఉన్నా, ఒకరినొకరు చూసుకోవచ్చు. కానీ, సోషల్ మీడియా వల్ల జరుగుతున్న మంచి ఒకలా ఉంటే... దానివల్ల చెడు కూడా ఆ లెవల్లోనే ఉంటోంది. ముఖ్యంగా యాంగ్జైటీ, స్ట్రెస్ లెవల్స్ పెరిగిపోయి హెల్త్​ పాడవుతుంది. కాబట్టి ఏదైనా ఎంతలో వాడాలో అంతలోనే వాడాలి. మితిమీరితే గతి తప్పుతుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాకి బ్రేక్​ ఇచ్చి, ఆ వాల్యుబుల్ టైంని ‘నాతో నేను’ అని గడిపేయాలి.
రిలాక్స్​ అవ్వాలి
ఈ బిజీ లైఫ్​లో రిలాక్స్​ అవడానికి కాస్త టైం దొరకడమంటేనే గ్రేట్. రిలాక్స్​ అవడానికి, తిరిగి యాక్టివ్​గా మారడానికి ఆ టైం ఎంతో అవసరం. వీలైతే ఆ టైంలో స్పాకి వెళితే బెటర్​ రిలీఫ్​ ఉంటుంది. లేదా ఫేవరెట్​ ప్లేస్​లో బ్రేక్​ఫాస్ట్, లంచ్, డిన్నర్​ లాంటివి ప్లాన్​ చేసుకోవచ్చు. అవి కూడా కాదనుకుంటే మనసుకి నచ్చిన విధంగా రిలాక్స్​ అవ్వొచ్చు. కావాల్సిందల్లా రిలాక్స్​ అవడమే. 
యాక్టివ్​గా ఉండాలి
ప్రతిరోజు ఎక్సర్​సైజ్​ చేయడం వల్ల హెల్దీగానే కాదు హ్యాపీగా కూడా ఉండొచ్చు. ఎలాగంటే... ఎక్సర్​సైజ్ చేయడం వల్ల బ్రెయిన్​లో ఎండార్ఫిన్​లు విడుదలవుతాయి. న్యూరోట్రాన్సిమిటర్స్ యాక్టివ్ అవుతాయి. అవి మనసుకు సంతోషాన్నిస్తాయి.
ప్రకృతితో కాసేపు
ప్రకృతితో చెట్టపట్టాలు వేసుకుని నాలుగు నిమిషాలు ఉన్నా చాలు మనసుకు కావాల్సినంత హ్యాపీనెస్​ దొరుకుతుంది. పచ్చని చెట్ల మధ్య, స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ కాసేపు నడుస్తుంటే మైండ్ రిలాక్స్ అవుతుంది. అలాగే సైకిల్​ మీద లాంగ్ రైడ్​లకు వెళ్లడం, ఇంకేదైనా ప్రకృతి​తో కనెక్ట్ అయ్యే పనిచేయడం వల్ల కూడా మనసుకు హాయిగా అనిపిస్తుంది. ప్రకృతితో కాసేపు గడిపితే డిప్రెషన్​ కలిగించే లక్షణాలు కూడా మైండ్​లో నుంచి ఎగిరిపోతాయట. అంతేకాకుండా రక్త ప్రసరణలో హెచ్చుతగ్గులు ఉండవు. 
గ్రాటిట్యూడ్ 
జీవితంలో సంతోషాన్నిచ్చేవి, కొత్త ఆశ పుట్టించే విషయాలకు ‘థ్యాంక్స్‌’ చెప్పాలి అని కొన్ని స్టడీస్ చెబుతున్నాయి. అందుకోసం మనసుకు హ్యాపీగా అనిపించేవి, అప్రిసియేట్ చేయాలనిపించే విషయాలను లిస్ట్ రాసుకోవాలి. మూడ్​ బాగోలేకపోయినా, ఒంటరిగా అనిపించినా ఆ లిస్ట్​ని గుర్తుచేసుకుంటే బెటర్​గా ఫీల్​ అనేది ఎక్స్​పర్ట్స్ మాట.