గ్రేటర్ లో నీళ్లు ఫ్రీ.. మోటార్​ వెహికల్స్​ ట్యాక్స్​ రద్దు

గ్రేటర్ లో నీళ్లు ఫ్రీ.. మోటార్​ వెహికల్స్​ ట్యాక్స్​ రద్దు

 

  • మార్చి నుంచి సెప్టెంబర్​ దాకా రాష్ట్రమంతా మోటార్​ వెహికల్స్​ ట్యాక్స్​ రద్దు
  • ఆరునెలలు పరిశ్రమలు, టాకీసులు, కమర్షియల్ కాంప్లెక్స్​లకు మినిమమ్ పవర్ బిల్లు రద్దు
  • దేశానికి నేనే దశ, దిశ చూపిస్త.. ఇందుకోసం ఏ త్యాగానికైనా రెడీ
  • సంపద సృష్టించే తెలివితేటలు బీజేపీ, కాంగ్రెస్​కు లేవ్​
  • భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవద్దు: సీఎం

హైదరాబాద్, వెలుగుగ్రేటర్​ హైదరాబాద్​లో నెలకు 20 వేల లీటర్లలోపు నల్లా నీళ్లు వాడుకునేవాళ్లు నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. ఇది డిసెంబర్​ నుంచి అమలులోకి వస్తుందన్నారు. 20 వేల లీటర్లకుపైగా నీళ్లు వాడేవాళ్లు మాత్రం బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని  చెప్పారు. గ్రేటర్​ హైదరాబాద్​తోపాటు రాష్ట్రవ్యాప్తంగా హెయిర్ సెలూన్లు, లాండ్రీ షాపులు, దోభీ ఘాట్లకు డిసెంబర్ నుంచి ఫ్రీగా కరెంట్​ సరఫరా చేస్తామన్నారు. మార్చి నుంచి సెప్టెంబర్​ వరకు రెండు దఫాలుగా చెల్లించాల్సిన మోటార్ వెహికల్ ట్యాక్స్ ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. దేశాన్ని సరైన ట్రాక్​లో పెట్టేందుకు తాను ముందుకు వెళ్తానని, ఇందుకోసం ఏ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. సంపద సృష్టించే తెలివితేటలు బీజేపీ, కాంగ్రెస్​కు లేవని, దేశానికి తాను దశ, దిశ చూపుతానన్నారు. సోమవారం తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్  టీఆర్ఎస్ పార్టీ జీహెచ్​ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అందులో పలు హామీలను ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్​ మాట్లాడుతూ .. రాబోయే రోజుల్లో కొత్త జీహెచ్ఎంసీ చట్టం తెస్తామని, పకడ్బందీగా దాన్ని అమలు చేస్తామని చెప్పారు.  కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే రీజినల్​ రింగ్​రోడ్డు నిర్మిస్తామని అన్నారు. కొందరు ఎన్నికల సంఘానికి  ఫిర్యాదు చేయడం వల్లే వరద సాయం అగిపోయిందని, ఎన్నికల తర్వాత అర్హులు అందరికీ వరద సాయం కింద రూ. 10 వేల ఇస్తామని చెప్పారు.

త్వరలో మిగతా మున్సిపాలిటీల్లోనూ ఫ్రీ వాటర్

గ్రేటర్​ హైదరాబాద్​లో 24 గంటల పాటు నీటి సరఫరా చేయాలనే ఆలోచన ఉందని సీఎం చెప్పారు. ఇది త్వరలో అమలులోకి వస్తుందని అన్నారు. గ్రేటర్​లో అమలు చేయాలనుకుంటున్న ఉచిత నీటి పథకాన్ని నాలుగైదు నెలల తర్వాత మిగతా మున్సిపాలిటీల్లోనూ అమలు చేస్తామన్నారు. రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో ఉండే జిమ్ లాంటి కమర్షియల్ ఉపయోగాలకు కూడా 20 వేల లీటర్లలోపు నీటిని ఫ్రీగా ఇస్తామని పేర్కొన్నారు. ఉచితంగా నీటి సరఫరా చేసినందుకు హైదరాబాద్ వాటర్ వర్క్స్ బోర్డుకు ప్రతి నెల రూ. 300 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు.

వెహికల్ ట్యాక్స్ రద్దు

కరోనా సమయంలో కమర్షియల్ వెహికల్స్ ఓనర్లకు పని లేదని, వారు రెండు దఫాలుగా చెల్లించాల్సిన ట్యాక్స్ ను రద్దు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ‘‘ రాష్ట్ర వ్యాప్తంగా 3.54 లక్షల వెహికల్స్ ఉన్నాయి. మార్చి నుంచి సెప్టెంబర్​ వరకు చెల్లించాల్సిన ట్యాక్స్ రద్దు చేస్తున్నం’’ అని చెప్పారు. ఈ నిర్ణయం వల్ల రూ. 267 కోట్లు ప్రభుత్వంపై భారం పడుతుందన్నారు.

బెంగాలీల భవనానికి స్థలం ఇస్తం

హైదరాబాద్ సెక్యులర్ సిటీ అని, ఎవరైనా వచ్చి ఉండొచ్చని కేసీఆర్​ అన్నారు. ‘‘కేరళ నుంచి వచ్చిన వాళ్లకు భవనంకట్టకునేందుకు స్థలం ఇచ్చినం. బెంగాలీలకు ఇస్తం. బోనాల పండుగకు గుళ్లకు రంగులేసుకునేందుకు పైసలు ఇచ్చినం. అన్ని మతాల వారికి ప్రభుత్వం సాయం చేసింది’’ అని పేర్కొన్నారు.

చిన్న సినిమాలకు ఎస్-జీఎస్టీ తిరిగి చెల్లిస్తం

రాష్ట్రంలో సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని కేసీఆర్ అన్నారు. ‘‘సినిమా థియేటర్లు తెరిచేందుకు జీవో ఇస్తం. సినిమాలు నిర్మించినందుకు 18 శాతం జీఎస్టీ కడ్తున్నరు. ఇందులో 9 శాతం రాష్ట్రానికి వస్తుంది. 10 కోట్ల లోపు వ్యయంతో నిర్మించే చిన్న సినిమాలకు ఎస్ -జీఎస్టీని రీయింబర్స్​ చేస్తం’’ అని ఆయన చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో పనిచేసే జూనియర్ ఆర్టిస్టులకు రేషన్ కార్డులు ఇస్తామన్నారు. ఇకనుంచి సినిమాలు రోజుకు  ఎన్ని షోలైనా వేసుకునే వెసులు బాటు కల్పిస్తామని, సినిమా టికెట్ల రేట్లు పెంచుకునే చాన్స్ ఇస్తామని ఆయన ప్రకటించారు.

దేశం కోసం ఏ త్యాగమైనా చేస్త

దేశంలో కాంగ్రెస్, బీజేపీ పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని కేసీఆర్ విమర్శించారు. లాభాల బాటలో నడిచే ఎల్​ఐసీని అమ్మేస్తున్నారని, రైల్వేస్​ను ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. ‘‘దేశానికి ఒక దిశ, దశ చూపడంలో బీజేపీ, కాంగ్రెస్​ వాళ్లకు ఒక అవగాహన కలగలేదు. దేశంలో సంపద సృష్టించే తెలివితేటలు ఈ పార్టీలకు లేవు.  2 పార్టీల పాలసీలు అట్టర్​ ఫ్లాప్​ అయిపోయినయ్. నేను 50 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్న. ఆ అనుభవంతోనే చెప్తున్న. ఈ దేశంలో కొత్త ప్రయోగం రావాల్సిన అవసరం ఉంది” అని కేసీఆర్​ చెప్పారు. దేశంలో సంపద సృష్టించే ప్రభుత్వం  రావాలని, ఆ సంపదను పేదలకు పంచే ప్రభుత్వం రావాలని, తాము తెలంగాణలో అదే చేస్తున్నామని తెలిపారు. ‘‘చిల్లర పంచాయితీలు, కిరికిరిలు పెట్టి, తాత్కాలిక భావోద్వేగాలు రెచ్చగొట్టి, రాజకీయ పబ్బాలు గడుపుకోవడం కాదు. దేశం ఒక కొత్త పంథాలో, ఒక కొత్త మార్గంలో కొత్త పద్ధతిని ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. ఆ ఆవిష్కర్తగా బహుశా నేనే ఎదుగుత కావొచ్చు. నాకు ఆ ఆలోచన ఉంది. చాలా మందితో నేను మాట్లాడిన. త్వరలో మీరే చూడబోతరు. దేశం తప్పుడు మార్గంలో పోతున్నది. సరైన ట్రాక్​లో పెట్టడానికి తెలంగాణ బిడ్డగా నేను ముందుకు పోత. అవసరమైతే జాతి ప్రయోజనాల కోసం ఏ త్యాగమైనా చేస్త.  ఒకసారి నేను ఎత్తుకుంటే ఏ విధంగా ఎత్తుకుంటనో అందరికీ తెలుసు. ఎవరో చిల్లరగాళ్లు ఏవో పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడొచ్చు. నేను బాగా ఆలోచిస్తున్న. మథనం కూడా చేస్తున్న. రాబోయే కొద్ది రోజుల్లో దేశంలోని లైక్​మైండెడ్స్​ అందరితో ఒక కాంక్లేవ్​ నిర్వహించి సెంట్రల్​ పీఎస్​యూ కార్మికుల కోసం పోరాడుత” అని కేసీఆర్​ వివరించారు.

సెలూన్లు, లాండ్రీ షాపులు, దోభీఘాట్లకు ఫ్రీ కరెంట్

రాష్ట్రంలోని హెయిర్ సెలున్లు, లాండ్రీ షాపులు, దోభీఘాట్లకు డిసెంబర్ నుంచి ఉచితంగా కరెంట్ సరఫరా చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా 6,070 సెలూన్లు ఉన్నాయి. వాళ్లు బిల్లులు కట్టేందుకు ఇబ్బంది పడ్తున్నారు. లాండ్రీ షాపుల్లో కరెంట్ చార్జీలు చెల్లించడం  కష్టంగా  ఉందని రజకులు నాకు చెప్పారు. వాళ్లు కష్టపడ్తేనే  మనం మంచి బట్టలు వేసుకుంటున్నాం. దోభీఘాట్లకు కూడా ఫ్రీ కరెంట్ ఇస్తాం’’ అని చెప్పారు. కరోనా సమయంలో షాపులు, కమర్షియల్ కాంప్లెక్స్​లు, పరిశ్రమలు, టాకీసులు పనిచేయలేదని, వాటికి మినిమం కరెంట్ చార్జీలు రద్దు చేస్తామన్నారు. ‘‘కరోనా వల్ల రాష్ట్ర  ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. పరిశ్రమలు, కమర్షియల్ బిల్డింగ్స్ కు ఆ రు నెలలు మినిమం పవర్ చార్జీలు రద్దు చేస్తున్నం. సినిమా థియేటర్లు ఇంకా తెరుచుకోలేవు కాబట్టి మార్చి నుంచి అవి తెరుచుకునేవరకు ఆ చార్జీలు రద్దు చేస్తం’’ అని అన్నారు.

మళ్లీ లాక్ డౌన్ పెట్టే పరిస్థితి వద్దు

రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్ పెట్టే పరిస్థితి రావొద్దని, అందుకు ప్రజలు సహకరిం చాలని కేసీఆర్ కోరారు. సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉందని, ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు పెట్టు కోవాలని, ఫిజికల్​ డిస్టెన్స్​ పాటించాలని, గుంపులుగా ఉండొద్దని అన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

టీఆర్‌‌ఎస్ మేనిఫెస్టోలోని మరిన్ని అంశాలు..

  •  హైదరాబాద్‌లో వచ్చే 50 ఏండ్లకు సరిపడా తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని రిజర్వాయర్ల నిర్మాణం. త్వరలోనే కేశవాపురంలో నిర్మాణం ప్రారంభం. ఔటర్ రింగ్‌రోడ్డు లోపలి గ్రామాల దాకా ఎస్టీపీలు, డ్రైనేజీల నిర్మాణం.
  • ఇప్పుడున్న నాలాలు, వరద నీటి కాలువల సామర్థ్యం 2 సెంటి మీటర్లు ఉన్నది. దీన్ని 30 నుంచి 40 సెంటిమీటర్లకు పెంచేందుకు ప్లాన్. త్వరలో నాలా అభివృద్ధి పనులు ప్రారంభం.
  • హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు గోదావరి నీళ్లు. మూసీ నదిని స్వచ్ఛంగా మార్చడం. నదికి ఇరువైపులా ఫెన్సింగ్.
  • ఐదేండ్లలో మెట్రో రెండో దశ పూర్తి. రాయదుర్గం నుంచి ఎయిర్‌‌పోర్ట్ వరకు, బీహెచ్‌ఈఎల్ నుంచి మెహిదీపట్నం వరకు నిర్మాణం. శంషాబాద్ ఎయిర్‌‌పోర్ట్‌కు త్వరగా చేరుకునేందుకు ఎక్స్‌ప్రెస్ మెట్రో రైల్ ప్రాజెక్టు అమలు. హైదరాబాద్ ఎయిర్‌‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) ఏర్పాటు.
  • 90 కి.మీ. మేర ఎంఎంటీఎస్ లైన్ విస్తరణ. ఎస్‌ఆర్‌‌డీపీ రెండో దశ త్వరలో ప్రారంభం. తొలి దశలో నగరంలోని వెస్ట్‌, ఈస్ట్‌జోన్లలో ఫ్లైఓవర్లు, అండర్‌‌పాస్‌ల నిర్మాణం.
  • మెట్రో విస్తరణకు అవకాశంలేని ప్రాంతాల్లో ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం.
  • ప్రస్తుత రింగ్‌రోడ్డుకు ఆవల రీజినల్​ రింగ్‌రోడ్డు. పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు, స్కైవాక్‌లు, సైకిల్ ట్రాక్‌ల ఏర్పాటు.
  • జీహెచ్‌ఎంసీ పరిధిలో 185 చెరువులు, హెచ్‌ఎండీఏ పరిధిలో 2,700 చెరువుల సుందరీకరణ. సిటీని జీరో కార్బన్ సిటీగా మార్చేందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్‌ పెంపు.
  • గచ్చిబౌలి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన టిమ్స్‌ (తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌) తరహాలోనే నగరం చుట్టూ మరో 3 టిమ్స్ నిర్మాణం.
  • నగరం చుట్టూ జోన్ల వారీగా బస్టాండ్లు, హాస్పిటళ్లు, విద్యాసంస్థలు, షాపింగ్‌ ఏర్పాట్లు ఉండేలా మైక్రోసిటీ కాన్సెప్ట్‌  అమలు.
  • నగరంలోని 132, 11 కేవీ విద్యుత్ కేబుళ్లు తొలగించి, అండర్‌‌గ్రౌండ్​లో ఏర్పాటు.
  • త్వరలోనే నగరంలో నిరుపేదలకు లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ. వివాదాస్పద స్థలాలు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇండ్ల క్రమబద్దీకరణకు చర్యలు. స్థలం ఉన్నోళ్లకు ఇండ్లు కట్టించేందుకు 5 లక్షలు.
  • అర్హులందరికీ రేషన్ కార్డులు. ప్రస్తుతం ఉన్న రూ.5 భోజనం సెంటర్ల విస్తరణ. షెల్టర్‌‌ హోమ్స్ సంఖ్య పెంపు. హైదరాబాద్​ను యాచకులు లేని నగరంగా మార్చడం. ఈ లైబ్రరీలు, నెట్ సౌకర్యం. సీనియర్ సిటిజన్స్ కోసం క్లబ్‌లు, యోగా సెంటర్లు, జిమ్స్‌ ఏర్పాటు. వారికి ఫ్రీగా బస్‌పాస్‌.

కేసీఆరే ఎందుకు రిలీజ్ చేసిండు? టీఆర్ఎస్​లో చర్చ

జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను సీఎం కేసీఆరే స్వయంగా విడుదల చేయడంపై టీఆర్​ఎస్​ లీడర్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. 2016లో జరిగిన గ్రేటర్ ఎన్నికల టైంలో పార్టీ మేనిఫెస్టోను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. కానీ ఈసారి కేసీఆర్ విడుదల చేయడం ఏమిటని లీడర్లు ఆరా తీస్తున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీకి నెగిటివ్ వేవ్ ఉందనే సంకేతాలు రావడంతోనే కేసీఆర్ రంగంలోకి దిగారని, దుబ్బాక బైఎలక్షన్​ ప్రభావం కూడా ఉండొచ్చని తెలంగాణ భవన్​కు వచ్చిన లీడర్లు చర్చించుకోవడం కనిపించింది.