కామారెడ్డి జిల్లాలో నిరుటి కంటే తగ్గిన సాగు విస్తీర్ణం

కామారెడ్డి జిల్లాలో నిరుటి కంటే తగ్గిన సాగు విస్తీర్ణం

కామారెడ్డి, వెలుగు: వానకాలం సీజన్‌‌‌‌లో కామారెడ్డి జిల్లాలో 70,716 ఎకరాల్లో రైతులు మక్క పంట సాగు చేశారు. జిల్లాలో నిరుటి కంటే ఈసారి 20 వేల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గింది. వానకాలంలో నల్లరేగడి నేలల్లో 25 క్వింటాళ్లు,   చవుడు నేలల్లో 18 నుంచి 20 క్వింటాళ్ల సగటు దిగుబడి వస్తుంది. కొందరు రైతులు 30 క్వింటాళ్ల వరకు దిగుబడి తిస్తారు. ఈసారి సగం దిగుబడి కూడా రాలేదు. చాలా ఏరియాల్లో నల్లరేగడి భూముల్లో 10 నుంచి 12 క్వింటాళ్లు,  చవుడు నేలల్లో  6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇంకా  కొన్ని ఏరియాల్లో అయితే దిగుబడి ఇంకా బాగా పడిపోయింది.  

పరిస్థితి ఇది..

విత్తనం వేసిన తర్వాత మొలక వచ్చిన కొద్ది రోజుల్లోనే వారం, పది రోజుల పాటు భారీ వానలు కురిశాయి. భూముల్లో  రోజుల తరబడి వాన నీళ్లు నిల్వ ఉండడంతో మొలక కుళ్లింది. పంట ఎదిగే దశలో ఉన్నప్పుడు రోజుల తరబడి అసలు వాన కురియలేదు. కంకి విత్తు పోసే దశలో వాడిపోయింది. ఈ ప్రభావం పంట ఎదుగుదలపై చూపింది. పంట చేతికొచ్చే దశలో మళ్లీ భారీ వానలు కురిశాయి. ఈ పరిస్థితులు అన్నీ దిగుబడి తగ్గటానికి కారణమయ్యాయి. దీనికి తోడూ  అడవి పందులు కూడా పంటపై దాడి చేశాయి. జిల్లాలో గాంధారి,  తాడ్వాయి, సదాశివనగర్, రాజంపేట, తాడ్వాయి, దోమకొండ, భిక్కనూరు,  రామారెడ్డి, మాచారెడ్డి, బీబీపేట, బాన్సువాడ మండలాల్లో ఈసారి మక్క పంట ఎక్కువగా సాగైంది. ఆయా మండలాల్లో పంట దిగుబడి తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు భారీ వర్షాలకు  పంట దెబ్బతిన్న కూడా గవర్నమెంట్ నయాపైసా నష్టపరిహారం చెల్లించలేదు. ఫసల్ బీమా కూడా అమలు చేయడం లేదు. దీంతో అటు నష్టపరిహారం రాక, ఇటు దిగుబడులు లేక ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చిందని పలువురు రైతులు  ఆవేదన చెందుతున్నారు.

రేట్ పెరిగే చాన్స్​

మక్కలకు క్వింటాల్‌‌‌‌కు ప్రభుత్వం రూ.1,962 మద్దతు ధర ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్‌‌‌‌లో మద్దతు కంటే కాస్త ఎక్కువ రేటుకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. పౌల్ర్టీలకు మక్కలు అవసరం ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం క్వింటాల్‌‌‌‌కు రూ.2,050 నుంచి రూ.2200 వరకు కొంటున్నారు. కొన్ని రోజులైతే ఇది మరింత పేరిగే చాన్స్‌‌‌‌ ఉంది.  

బాగా దెబ్బతింది

నేను నాలుగు ఎకరాల్లో మక్క సాగు చేశా. ఎకరాకు 10 క్వింటాళ్లు కూడా వచ్చేటట్లు కనిపిస్తలేదు. పోయిన సారి  ఎకరాకు 30 క్వింటాళ్ల మక్కలు వచ్చినయ్. ఈసారి వానలతో పంట బాగా దెబ్బతిన్నది. -- కుంట గంగారెడ్డి, గుర్జకుంట

వానలు దెబ్బతీసినయ్​

నేను ఎకరం మక్క సాగు చేసిన. మొలక పెరిగేటప్పుడు పెద్ద వానలు బాగా పడినయ్. మొలకలు మునిగేటట్లు నీళ్లు నిలిచాయి. దీంతో పంట కొంత దెబ్బతింది. ఇప్పడు పంట చేతికొచ్చే టైంలో మళ్లీ వానలు పడుతున్నాయి. ప్రభుత్వం ఆదుకోవాలి. - సాయిలు, భిక్కనూరు