కేరళలో మంకీపాక్స్ కలకలం 

కేరళలో మంకీపాక్స్ కలకలం 

కరోనా ముప్పు తొలగిపోకముందే ‘మంకీపాక్స్‌’ వైరస్‌ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే 50కి పైగా దేశాలకు ఈ వైరస్‌ వ్యాప్తిచెందడంతో వేల కొద్దీ కేసులు నమోదవుతున్నాయి. భారత్ లో మంకీ పాక్స్ కేసులు నమోదు కానప్పటికీ..తాజాగా కేరళలో ఓ వ్యక్తిలో మంకీపాక్స్‌ తరహా లక్షణాలు కన్పించడం సర్వత్రా భయాందోళనకు గురిచేస్తోంది.

ఇటీవల విదేశాల నుంచి తిరిగొచ్చిన ఓ వ్యక్తి మంకీపాక్స్‌ తరహా లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు కేరళ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ వెల్లడించారు. వైరస్‌ నిర్ధారణ పరీక్షల నిమిత్తం అతడి నుంచి సేకరించిన నమూనాలను పుణెలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపినట్లు తెలిపారు. ఆ ఫలితాలు వచ్చిన తర్వాత వ్యాధిని ధ్రువీకరించగలమన్నారు. సదరు వ్యక్తి విదేశాల్లో మంకీపాక్స్‌ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగినట్లు మంత్రి తెలిపారు. అయితే, ఆ వ్యక్తి వయసు, ఏ దేశానికి వెళ్లొచ్చారన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు.