
హైదరాబాద్ : మాదాపూర్ లో డాన్యోన్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దాదాపు 200 మంది నుంచి డబ్బులు వసూలు చేసిన ఐటీ కంపెనీ.. బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు వసూలు చేశారని బాధితులు చెబుతున్నారు. డాన్యోన్ ఐటీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్ గా ప్రతాప్ అనే వ్యక్తి ఉన్నారు. ప్రస్తుతం మాదాపూర్ పోలీసుల అదుపులో ప్రతాప్ ఉన్నారని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ యువజన సంఘం అధ్యక్షులు శివాసేన రెడ్డి.. బాధితులతో కలిసి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
మూడు రోజుల క్రితం డాన్యోన్ కంపెనీపై పోలీసులు కేసులు నమోదు చేసినా.. ఇప్పటి వరకూ సంస్థ యజమానిని రిమాండ్ కు తరలించలేదని శివాసేన రెడ్డి చెప్పారు. ఉద్యోగం వస్తుందనే ఆశతో ఒక్కొక్కరు దాదాపు లక్ష నుంచి రెండు లక్షల వరకు చెల్లించారని అన్నారు. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు.. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందన్నారు.