తెలంగాణలోని పలు జిల్లాలో కుండపోత వర్షం.. తడిసిపోయిన వరి ధాన్యం

తెలంగాణలోని పలు జిల్లాలో కుండపోత వర్షం.. తడిసిపోయిన వరి ధాన్యం

తెలంగాణలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వరి ధాన్యం తడిసిపోయింది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నానా అవస్థలు పడుతున్నారు. అకాల వర్షాలకు వరి, మామిడి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. 

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర మండలం మహాత్మానగర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వర్షానికి వరి ధాన్యం తడిసిపోయింది. ఇటు ఎల్ఎండీ కాలనీలోని రామ్ లీలా మైదానంలోనూ ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రంలో భారీ వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది. 

కరీంనగర్ లో సాయంత్రం కురిసిన భారీ వర్షానికి గన్నేరువరం మండలంలోని పలు గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరద నీరు చేరింది. దీంతో ధాన్యం కొట్టుకుపోయింది. పదుల సంఖ్యలో వరి బస్తాలు తడిసిపోయాయి. 

* కరీంనగర్ లో సాయంత్రం కురిసిన భారీ వర్షానికి జ్యోతినగర్, అల్కాపురి కాలనీ, ఇతర లోతట్టు ప్రాంతాలు.
జలమయం అయ్యాయి. 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిరుమలాపూర్ లో తాటిచెట్టుపై పిడుగుపడడంతో మంటలు చెలరేగాయి. 

* వడగండ్ల వర్షంతో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కురుమపల్లి గ్రామంలో రేకుల షెడ్డు కూలిపోయి.. 20 గొర్రెలు మృతిచెందాయి.

* జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరి గ్రామానికి చెందిన బోడపట్ల చారి అనే రైతుకు చెందిన రెండు గేదెలు  పిడుగుపాటుకు మృతిచెందాయి. గేదెలపైనే జీవిస్తున్న తమకు ఇప్పుడు జీవనాధారం లేకుండా అయ్యిందని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు చారి వేడుకుంటున్నాడు. 

* సిద్దిపేట జిల్లా చేర్యాల, మద్దురు, ధూల్మిట, కొమురవెళ్లి మండలల్లోని పలు గ్రామాల్లో వడగండ్ల వర్షం కురిసింది. పలుచోట్ల వరి  ధాన్యం తడిసిపోయింది.

* జనగామ జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నర్మెట్ట, బచ్చన్నపేట, తరిగొప్పుల మండలాల్లోని పలు గ్రామాల్లో వర్షం కురిసింది. లింగాలఘణపురం మండలం నావాబుపేట, కుందారం గ్రామాల్లో కుండపోత వర్షం కురిసింది. చెట్టుపై పిడుగు పడడంతో ప్రమాదం తప్పింది. నర్మెట్ట, తరిగొప్పుల మండలాల్లో రాళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో భారీగా మామిడి, వరి, మిర్చి  పంటలు నష్టపోయాయి.

*  ములుగు జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షం కురిసింది.