దెయ్యాలను 12 ట్రక్కుల్లో రోజుకు మూడుట్రిప్పుల్లో తరలించారంట.!

దెయ్యాలను 12 ట్రక్కుల్లో రోజుకు మూడుట్రిప్పుల్లో తరలించారంట.!

దెయ్యాలను

ట్రక్కుల్లో తరలించారంట!

దెయ్యాలు ఉన్నాయా?

ఏమో? ఎవరు చూశారు..?

‘నేను చూశాను’ అని చెప్పినవాళ్లెవరూ లేరు

‘ఫలానావాళ్లు చూశారట’ అని చెప్పినవాళ్లే అంతా!

ఇంతకీ దెయ్యాలున్నాయా?

ఆ.. ఉన్నాయి! ఉండడమేంటి…

ట్రక్కుల్లో వాటిని వేరొకచోటుకు తరలించారట!

మమ్మల్ని తీసుకెళ్లలేదని కొన్ని దెయ్యాలు అలిగాయట కూడా!!

ప్రపంచవ్యాప్తంగా దెయ్యాలు ఉన్నాయన్న విషయాన్ని కొట్టిపారేసేవారు ఎందరున్నారో.. అంతకు మించి దెయ్యాల్ని నమ్మేవాళ్లు ఉన్నారట. విచిత్రమేమిటంటే.. పల్లెటూళ్లలోకంటే నగరాల్లోనే ఎక్కువమంది దెయ్యాలున్నాయని నమ్ముతున్నారు. పేద దేశాల్లోకంటే అభివృద్ధి చెందిన దేశాల్లోనే దెయ్యాలున్నాయనే నమ్మకం ఎక్కువగా ఉంది. దెయ్యాలున్నాయని నమ్ముతున్నవాళ్లలో చదువుకున్నవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. రకరకాల సర్వేల్లో వెల్లడైన విషయాలివి. అయితే సర్వేలు తేల్చినదాంట్లో నిజమెంతో, అబద్ధమెంతో పక్కనబెడితే.. దెయ్యాలు నిజంగానే ఉన్నాయని, వాటిని ట్రక్కుల్లో తరలించారని చెబుతున్నారు మయన్మార్​ ప్రజలు. అదీ ఏదో ఒక్కసారి కాదు.. ఒక్కో ట్రక్కులో 10 దెయ్యాల చొప్పున, 12 ట్రక్కుల్లో, రోజుకు మూడుట్రిప్పుల్లో, మూడు రోజులపాటు తరలించారట.

మనదగ్గర ఎవరికైనా దెయ్యం పడితే భూతవైద్యుడి దగ్గరకు తీసుకెళ్తాం. రకరకాల పూజలు, హాహాకారాల్లాంటి మంత్రాలతో ఆ భూతవైద్యుడు దెయ్యాన్ని వదిలిస్తాడని నమ్ముతారు. ఇలా వదిలించేటప్పుడు అతను నేరుగా దెయ్యాలతో  మాట్లాడుతాడని నమ్ముతారు. చూస్తుంటే ఇదంతా మనకు వింతగా అనిపిస్తుంది. భూతవైద్యుడిని నమ్మేవాళ్లు మాత్రం.. అతను నిజంగానే దెయ్యాలతో మాట్లాడుతున్నాడని అనుకుంటారు. ఇలా దెయ్యాలతో మాట్లాడేవాళ్లను మనదగ్గర ‘భూతవైద్యులు’ అని పిలిస్తే.. మయన్మార్​లో మాత్రం ‘నాట్సాయా’ అని పిలుస్తారు. ఆ దేశంలో దెయ్యాల తరలింపు అసలు ఎందుకు జరిగిందో తెలియాలంటే మయన్మార్​ రాజధాని చరిత్ర గురించి తెలియాలి.

2006కు ముందు మయన్మార్​ రాజధాని యాంగాన్. ఇది సముద్ర తీరానికి దగ్గరగా ఉండడంతో శత్రువుల నుంచి రక్షణ ఉండదని భావించి నేపీటా నగరానికి 2006లో అధికారికంగా తరలించారు. అయితే నేపీటాకు ‘దెయ్యాల నగరం’ అనే మరో పేరు కూడా ఉంది. ఇక్కడి ప్రజలకు ఆత్మలు, దెయ్యాలు ఉన్నాయని బలంగా నమ్ముతారు. రాజధాని మారడంతో నేపీటాలో ఒక బౌద్ధ ఆరామాన్ని, జిల్లా కోర్టును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు స్థలాన్ని కూడా ఎంపిక చేసింది. అయితే అది అప్పటికే శ్మశానవాటిక కావడంతో సమాధులను మరోచోటుకు తరలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సమాధులను ఇలా మరోచోటుకు తరలించడం మయన్మార్​ సంప్రదాయంలో భాగంగానే ఉంది. దీంతో సమాధులను తరలించేందుకు కెప్టెన్​ ఆంగ్​ కాంట్​ను నేపీటాకు పంపింది.

సమాధులను తరలించడం అంటే వాటిని తవ్వి, శవపేటికలను వేరొకచోటుకు తరలించడం కాదు. ప్రాచీన బర్మా సంప్రదాయం ప్రకారం ఆత్మలను కూడా తరలించాలి. ఇలా ఆత్మలను తరలించే ప్రక్రియ సక్రమంగా జరగకపోతే వాటి కోపానికి బలికావాల్సి ఉంటుందనేది అక్కడి ప్రజల బలమైన విశ్వాసం. అందుకే ఇలా సమాధుల్ని, వాటితోపాటు ఆత్మలను తరలించే కార్యక్రమాన్ని సక్రమంగా జరిపించేందుకు ‘నాట్సాయా’లను పిలిపిస్తారు. ఇదే పనిమీద నేపీటాకు వచ్చిన కెప్టెన్​ ఆంగ్​ కాంట్​.. నగరంలో ఫేమస్​ ‘నాట్సాయా’ల్లో ఒకరైన వూపీ గోల్డ్‌‌‌‌బర్గ్ దగ్గరకు వచ్చాడు. బౌద్ధ ఆరామంతోపాటు జిల్లా కోర్టును నిర్మించాలనుకుంటున్న టాట్కాన్‌‌ ప్రాంతంలో ఉన్న వెయ్యికిపైగా సమాధుల్ని తరలించే విషయాన్ని వివరించాడు. కెప్టెన్​ చెప్పిన మాటల్ని విన్న తర్వాత వూపీ అడ్డంగా తల ఊపాడు. ఇది ఒక్క నాట్సాయాతో జరిగే పనికాదని, ఏ చిన్న పొరపాటు జరిగినా దాని ఫలితం నగర ప్రజలంతా అనుభవించవలసి ఉంటుందని హెచ్చరించాడు. అవసరమైతే మరింతమంది నాట్సాయాలను పిలిపిద్దామని కెప్టెన్​ చెప్పడంతో ఓ రోజున సమాధుల తరలింపు మొదలైంది.

సైన్యం ఉపయోగించే భారీ ట్రక్కుల్లో ముందుగా సమాధుల్ని తరలించారు. ఆ తర్వాత ఆత్మలను తరలించే కార్యక్రమం మొదలైంది. వూపీ సూచించిన ప్రకారం 12 ట్రక్కులను సిద్ధంగా ఉంచారు. ఒక్కో ట్రక్కులో పది ఆత్మల చొప్పున ఎక్కించి ట్రక్కులను పంపించేశారు. అలా మొదటిరోజు 12 ట్రక్కులు మూడు ట్రిప్పుల్లో ఆత్మలను వేరొకచోటుకు చేర్చాయి. కెప్టెన్​తోపాటు వూపీ, మరికొంతమంది నాట్సాయాలు అక్కడే ఉండి ఆత్మల తరలింపును జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. రెండో రోజు, మూడో రోజు కూడా మూడు ట్రిప్పుల్లో ఆత్మలను తరలించారు. టాట్సాన్​ ప్రాంతంలో ఆత్మల తరలింపు మొత్తం పూర్తయిందని వూపీ చెప్పడంతో కెప్టెన్​ ఉదయాన్నే నేపీటా నుంచి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

డిన్నర్​ చేసి పడుకున్న కెప్టెన్​కు అర్ధరాత్రి ఎవరో మంచం మీద నుంచి కిందకు తోసినట్లు అనిపించింది. చూస్తే.. నిజంగానే నేలపై ఉన్నాడు. లేచి బెడ్​పై పడుకున్నాడు. మరికాసేపటికి మళ్లీ అలాగే అనిపించింది. అయితే ఈసారి కాస్త గట్టిగా కిందకు తోసినట్లు అనిపించింది. అలా రాత్రిమొత్తం రెండుమూడుసార్లు జరిగింది. దీంతో ఉదయాన్నే వూపీని పిలిపించి రాత్రి జరిగిందంతా చెప్పాడు. కెప్టెన్​ మాటలు విన్న తర్వాత వూపీ ఓసారి శ్మశానమంతా తిరిగిచూసి, మరో మూడు ఆత్మలు మిగిలిపోయాయని, అవి వాటిని కూడా తరలించకపోవడంపై కోపంగా ఉన్నాయని చెప్పాడు. చివరికి ఏవేవో పూజల్లాంటివి చేసి, మరో ట్రక్కులో వాటిని కూడా తరలించారు.

చిత్రమేంటంటే.. ఆత్మలను తరలించే ట్రక్కుల్లో ఎవరికీ ఏమీ కనపడలేదు. కానీ ఆత్మలను ఎక్కించామని నాట్సాయాలు చెప్పిన తర్వాత ట్రక్కు బలవంతంగా కదలడం, మధ్యలో ఇంజన్​ ఆగిపోవడం, ట్రక్కు అటూఇటూ ఊగిపోవడం వంటివి మాత్రం జనమంతా చూశారు. చివరకు ట్రక్కు నడిపిన సైనికులు కూడా తాము ఆత్మలను చూడకపోయినా.. ట్రక్కుల్లో మాత్రం వేటినో మోసుకెళ్లామని చెప్పారు. దెయ్యాలు ఉన్నాయో, లేవో కానీ దెయ్యాల ట్రాన్స్​పోర్ట్​ మయన్మార్​లో పెద్ద కథై పోయింది.