వ్యవసాయ భారం తగ్గించాలంటే.. పరిశోధనలు పెరగాలి

వ్యవసాయ భారం తగ్గించాలంటే.. పరిశోధనలు పెరగాలి

వన్ నేషన్.. వన్ సబ్​స్క్రిప్షన్

అందరికీ అందుబాటులో రీసెర్చ్ జర్నల్స్

దేశంలో కొత్త ఆవిష్కరణలు జరగాలంటే పరిశోధనలే మూలం. జాతీయ స్థాయి పరిశోధన కేంద్రాలు, ఉన్నత విద్యా సంస్థలు, విశ్వ విద్యాలయాల్లో అలాంటి రీసెర్చ్ లు జరుగుతున్నాయి. అయితే ఈ పరిశోధనలు ముందుకు సాగాలంటే రీసెర్చర్లకు నాణ్యమైన ఇన్​ఫర్మేషన్ కావాలి. దీని కోసం అంతర్జాతీయంగా పబ్లిష్ అయ్యే జర్నల్స్, బుక్స్ వారికి అందుబాటులో ఉండాలి. కానీ ఏటా దీని కోసమే మన దేశంలో సైంటిస్టులు, సంస్థలకు కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి. ఈ వ్యయ భారాన్ని తగ్గించి.. పరిశోధనలకు బూస్టింగ్ ఇచ్చేందుకు వన్ నేషన్ – వన్ సబ్ స్క్రిప్షన్ విధానం ఎంతైనా అవసరం ఉంది. ప్రపంచంలో ఫేమస్ రీసెర్చ్ సంస్థల జర్నల్స్ ను మన దేశంలో వర్సిటీల ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్లు, సైంటిస్టులతో పాటు సామాన్యులకు సైతం అందుబాటులోకి తేవాలి.

దేశంలో కొన్నాళ్లుగా వినిపిస్తున్న నినాదాల్లో వన్ నేషన్ – వన్ రేషన్ కార్డ్, వన్ నేషన్ – వన్ ఎలక్షన్, వన్ నేషన్ – వన్ ఐడెంటిటీ (ఆధార్) వంటివి బాగా ఫేమస్. వీటిలానే ఇప్పుడు వన్ నేషన్ – వన్ సబ్ స్క్రిప్షన్ కూడా అదే స్థాయిలో పాపులర్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. దీనిని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా అన్ని రంగాల్లోనూ పండితుల సాహిత్యం, రీసెర్చర్స్ పరిశోధన పత్రాలు, వ్యాసాలు, పుస్తకాలు ఇంటర్నెట్ లో ఉచితంగా దేశంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. నెట్ లో ఓపెన్ యాక్సిస్ తో పాటు రీడ్ అండ్ పబ్లిష్ (ఉచితంగా చదువుకోవడం, మన శాస్త్రవేత్తల పరిశోధనలను ప్రచురించడం), రీడ్ అండ్ రివ్యూకు కూడా వన్ నేషన్ – వన్ సబ్​స్క్రిప్షన్ ద్వారా అవకాశం కల్పించాలి.

కొన్ని దేశాల్లో ఇప్పటికే ఈ పాలసీ

మన దేశంలో ప్రస్తుతం  పలు ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధన సంస్థలు సొంతంగా చందా రూపంలో డబ్బు కట్టి నేషనల్, ఇంటర్నేషనల్ జర్నల్స్ ని కొనుగోలు చేస్తున్నాయి. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వమే డబ్బులు కట్టి (సబ్ స్క్రైబ్ చేసి) దేశంలోని రీసెర్చర్స్, విద్యా సంస్థలు, మేధావులతో పాటు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉంచాలన్నదే వన్ నేషన్ – వన్ సబ్ స్క్రిప్షన్ లక్ష్యం. ఈ తరహా పాలసీని ఇప్పటికే కొన్ని దేశాలు ఫాలో అవుతున్నాయి కూడా. పరిశోధనలకు అవసరమైన ల్యాబ్స్, టెక్నాలజీతో పాటు లైబ్రరీల్లో లేటెస్ట్ సైంటిఫిక్ జర్నల్స్, బుక్స్ అందుబాటులో ఉంచుతున్నాయి. ఇందులో భాగంగా జర్మనీ, ఈజిప్టు, ఉరుగ్వే దేశాలు తమ ప్రజలకు ఓపెన్ యాక్సిస్ లో ఉంచుతున్నాయి. పోర్టల్ టింబో పేరుతో ఉరుగ్వే 2009 నుంచే ఈ పని చేస్తోంది. ఇందు కోసం ఏటా 2.3 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తోంది. 2015 నుంచి ఈజిప్టు కూడా ‘ఈజిప్షియన్ నాలెడ్జ్ బ్యాంక్’ పేరుతో ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ క్రియేట్ చేసి ఆ దేశ ప్రజలకు ఇంటర్నేషనల్ సంస్థలు ప్రచురించే జర్నల్స్, బుక్స్, వ్యాసాలను ఈ–బుక్స్ రూపంలో అందుబాటులో ఉంచుతోంది.

రీసెర్చర్స్ కు పబ్లిషింగ్ చార్జీలు ఉండొద్దు

దేశంలో ఎవరైనా రీసెర్చర్స్ తమ పరిశోధనల గురించి లేదా మరేదైనా అబ్జర్వేషన్ గురించి జర్నల్స్ లో పబ్లిష్ చేయించాలన్నా అర్టికల్ పబ్లిషింగ్ చార్జెస్ (ఏపీసీ) చెల్లించాల్సి ఉంటుంది. పాపులర్ జర్నల్స్ లో అవి రావాలంటే 3 వేల నుంచి 5 వేల డాలర్ల వరకు పే చేయాలి. అంత మొత్తం శాస్త్రవేత్తలే చెల్లించాలంటే కష్టంగా మారుతోంది. దీని వల్ల వారి పరిశోధనలు ప్రపంచానికి తెలియకుండా మరుగునపడిపోతున్నాయి. ఈ సమస్యను అధిగమిస్తే మేధావులైన మన రీసెర్చర్స్ ప్రయోగాలు అందరికీ ఉపయోగపడుతాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఏపీసీని కూడా ప్రభుత్వమే భరించి పబ్లిష్ చేసేలా వన్ నేషన్ – వన్ సబ్ స్క్రిప్షన్ విధానం ఉండేలా చూడాలి.

పరిశోధన సంస్థలకు భారం తగ్గించేలా

భారత్ లో మాత్రం పరిశోధన సంస్థలన్నీ కలిపి దాదాపు 1500 కోట్ల రూపాయల చందాలు కడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రపంచంలోనే ప్రముఖ పబ్లిషింగ్ సంస్థలైన ఎల్జీ వేర్, స్ప్రింగ ర్, నాచుర్, వైలి, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వంటి సంస్థలతో భారత ప్రభుత్వం వన్ నేషన్ వన్ సబ్ స్క్రిప్షన్ కోసం ఒప్పందాలు చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచంలో ఉన్న 50 శాతానికి పైగా సంస్థలతో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ దిశగా చర్చలు జరుపుతోంది.-డాక్టర్ రవికుమార్ చేగోని, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గ్రంథాలయ సంఘం.