బూతు సినిమాల వ్యాపారం చేస్తున్న శిల్పా శెట్టి భర్త అరెస్ట్

V6 Velugu Posted on Jul 20, 2021

ముంబై: సినిమాల్లో ఒక్క చాన్స్‌ వస్తే తమను తాము ప్రూవ్‌ చేసుకోవాలని, బాలీవుడ్‌లో స్టార్‌‌గా ఎదగాలని ముంబైలో ఎంతోమంది యువతులు అడుగుపెడుతుంటారు. అలా వచ్చే అమాయక మహిళలను టార్గెట్ చేసి, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి.. ఆ తర్వాత పోర్న్‌లోకి దించుతున్న కేసులో బాలీవుడ్ యాక్టర్ శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా అరెస్టు తర్వాత ఇవాళ (మంగళవారం) మరో నిందితుడు రేయాన్ తోర్పేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రాజ్‌ కుంద్రా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతడిని కోర్టులో ప్రవేశపెట్టగా ఈ నెల 23 వరకు పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఒక నెట్‌వర్క్ సెట్ చేసుకుని, ముంబైకి వచ్చే అమ్మాయిలను ట్రాప్‌ చేసి ముందుగా పోర్న్‌లో చేస్తే ఆ తర్వాత పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తున్నారని పోలీసుల దర్యాప్తు తేలింది.  ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు పక్కాగా ఉన్నాయని ముంబై పోలీసులు తెలిపారు. వీళ్లు పోర్న్ సినిమాలు తీయడంతో పాటు వాటిని ఆన్‌లైన్‌ యాప్స్‌ ద్వారా రిలీజ్ చేస్తున్నారని గుర్తించామన్నారు.
ఫిబ్రవరి నుంచే దర్యాప్తు..
‘‘ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఓ యువతి ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించింది. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి, బలవంతంగా పోర్న్‌లోకి దించి మోసం చేశారని కంప్లైంట్ ఇచ్చింది. అప్పటి నుంచి లోతైన దర్యాప్తు చేస్తున్నాం. పోర్న్ సినిమాల ప్రొడక్షన్‌తో పాటు వాటిని కొన్ని యాప్స్‌లో రిలీజ్ చేస్తున్నట్టు గుర్తించాం. ఈ కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రాను సోమవారం విచారించాం. పక్కా ఆధారాలు ఉండడంతో అరెస్టు చేశాం” అని ముంబై పోలీస్ కమిషనర్ సోమవారం సాయంత్ర ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కేసును ముంబై క్రైం బ్రాంచ్ ఇన్వెస్టిగేషన్ చేస్తోందని, ఇప్పటి వరకు తొమ్మిది మందిని అరెస్టు చేశారని తెలిపారు.
యూకేలో కంపెనీ పెట్టి.. ఇక్కడ పోర్న్ వీడియోల చిత్రీకరణ
యూకేలో పోర్న్‌ను ప్రైవేట్‌గా చూడడం లీగల్ కావడంతో రాజ్‌ కుంద్రా ఈ రకమైన కంటెంట్‌తో ఆ దేశంలో కంపెనీ పెట్టినట్టు దర్యాప్తులో తేలిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే తన కంపెనీ కోసం పోర్న్ వీడియోలను ఇండియాలో షూట్‌ చేసి, వుయ్‌ ట్రాన్స్‌ఫర్‌‌ యాప్‌ ద్వారా వాటిని యూకేకు పంపి, అక్కడ పెయిడ్ మొబైల్ యాప్స్‌లో రిలీజ్ చేసి డబ్బు సంపాదించుకుంటున్నాడు. ముంబైలోని కొన్ని హోటళ్లు, గెస్ట్ హౌస్‌లలో ఈ పోర్న్ వీడియోలను చిత్రీకరించారని పోలీసులు తెలిపారు. సినిమాల్లో అవకాశాల కోసం వచ్చిన యువతులు, మోడల్స్‌ను చాన్స్‌లు ఇప్పిస్తామని మాటిచ్చి వాళ్లను రాజ్‌ కుంద్రాతో పాటు మరికొందరు ఈ పోర్న్‌ రొచ్చులోకి నెడుతున్నారని చెబుతున్నారు. గతంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొన్న రాజ్ కుంద్రాను అన్ని రకాల క్రికెట్ యాక్టివిటీస్‌లో పాల్గొనడంపైనా బ్యాన్ విధించారు.

 

Tagged arrest, porn, movie chance, Raj Kundra, shilpa shetty, Shilpa Shetty Husband

Latest Videos

Subscribe Now

More News