పుష్పం ప్రియా చౌదరి. బిహార్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన గంటల వ్యవధిలో ఈ పేరు వార్తల్లో నిలిచింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి డెవలప్‌మెంట్ స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందిన పుష్పం ప్రియా చౌదరికి బిహార్ ఓటర్లు మరోసారి తత్వం బోధపడేలా చేశారు. రాజకీయలు ఎలా ఉంటాయో ఆమెకు మరోమారు రుచి చూపించారు. పీహెచ్‌డీ లెవెల్ పాఠాన్ని బోధించారు. ఎన్నికల్లో గెలిచే వరకు మాస్క్ తీయనని ప్రతిజ్ఞ చేసిన ఈ పుష్పం ప్రియా చౌదరి ప్లూరల్స్ పార్టీ చీఫ్. ఈ ప్రతిజ్ఞ కారణంగానే ఆమె బిహార్ ఎన్నికల ప్రచార సమయంలో జనం నోళ్లలో నానారు. అయితే.. మరో ఐదేళ్లు మాస్క్ తీయక్కర్లేదని బిహార్ ఓటర్లు ఆమెను ఓడించారు. రెండో సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమెకు కేవలం 1,403 ఓట్లు మాత్రమే దక్కాయి.
దర్భాంగా నుంచి పోటీ చేసిన పుష్పం ప్రియా చౌదరికి నోటా కంటే తక్కువ ఓట్లు పడ్డాయి. ఈ స్థానం నుంచి విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి సంజయ్ సరోగి దరిదాపుల్లో కూడా ఈమెకు ఓట్లు పడలేదు. పుష్పం ప్రియ విషయానికొస్తే.. ఆమె ప్లూరల్స్ పార్టీ నుంచి బీహార్‌లోని 243 స్థానాల్లోనూ 'విజిల్' గుర్తుపై అభ్యర్థులు పోటీ చేశారు. పుష్పం ప్రియా చౌదరితో పాటు ఏ ఒక్కరికీ డిపాజిట్లు కూడా దక్కలేదు. ఆమె పూర్తిగా నల్లటి దుస్తులు, ముసుగు ధరించి ప్రచారం చేసింది. తాను గెలిచినప్పుడు మాత్రమే మాస్క్ తీసేస్తానని శపథం చేసిన పుష్పం ప్రియా చౌదరికి మరో ఐదేళ్లు మాస్క్ ధరించక తప్పని పరిస్థితి.
ఇక.. దర్భాంగాలో తన ఘోర ఓటమిపై పుష్పం ప్రియా చౌదరి ఈవీఎం రిగ్గింగ్ కారణమని ఆరోపించారు. తన తల్లి, కుటుంబం, తన బంధువుల ఓట్లన్నీ బీజేపీ అభ్యర్థికే పడ్డాయని ఆమె ఆరోపించారు. ప్రతీ బూత్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని.. తన హోం టౌన్లో తనకు వేల ఓట్లు అనుకూలంగా పడాల్సి ఉంటే.. అలా జరగలేదని.. తన ఓటమికి కచ్చితంగా ఈవీఎం ట్యాంపరింగ్ కారణమని పుష్పం ప్రియా చౌదరి ట్వీట్ చేశారు. చాలా పెద్ద తప్పు చేశారని బీజేపీని, మోదీని, అమిత్ షాను ట్యాగ్ చేసి ఆమె ఈ ట్వీట్ చేయడం గమనార్హం.
