
- నాలుగు రోజుల్లో ఏడుగురు మోసపోయిన్రు..
సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయి నాలుగు రోజుల వ్యవధిలో ఏడుగురిని మోసగించి లక్షల రూపాయలు కాజేశారు. సైబర్ నేరగాళ్లు వివిధ రూపాల్లో మోసాలకు పాల్పడుతున్నందున గుర్తు తెలయని మెసేజ్ లకు స్పందించవద్దని మంగళవారం సీపీ ఎన్ శ్వేత సూచించారు. వివరాల్లోకి వెళ్లితే.. గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాధితుడు ఇన్ స్టాగ్రామ్ పేజీలో తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ సంపాదించుకోవచ్చనే మెసేజ్ ను చూసి గుర్తు తెలియని వ్యక్తి నంబర్ కు ఫోన్ చేశాడు. అతడి మాటలునమ్మి ఫోన్ పే ద్వారా రూ.10 వేలు పంపించాడు. తరువాత ఆ నంబర్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో వెంటనే సైబర్ సెల్ హెల్ప్ లైన్ నంబర్ కు ఫిర్యాదు చేశాడు. దీంతో రూ.7 వేలను - ఫ్రీజ్ చేశారు.
చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాధితుడు ఇన్స్టాగ్రామ్ లో పార్ట్ టైం జాబ్ ఉందనే లింక్ ఓపెన్ చేసి సైబర్ నేరగాడి వలలో పడ్డాడు. అతడు చెప్పినట్టు టాస్కుల పై పెట్టుబడిగా రూ.10 వేలు పంపించాడు. తరువాత లింకు బ్లాక్ చేసి ఉండటంతో మోసపోయానని గుర్తించాడు. వెంటనే జాతీయ సైబర్ సెల్ హెల్ప్ లైన్ నంబర్ కు ఫిర్యాదు చేయడంతో ఆ డబ్బులను ఫ్రీజ్ చేశారు. ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక వ్యక్తికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నానని మాయమాటలు చెప్పాడు. పాన్‌కార్డు నంబర్, ఓటీపీ ఇతర వివరాలు చెప్పడంతో కొద్ది సేపటికే బాధితుడి అకౌంట్లో నుంచి రూ.28,779 డెబిట్ అయ్యాయి. మోసపోయానని గుర్తించి హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయడంతో రూ.3,749 -ఫ్రీజ్ చేశారు.
భూంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాధితున్ని సైబర్ నేరగాళ్లు తమ సంస్థలో పెట్టుబడిపెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి రూ. లక్ష కాజేశారు. మరో ఘటనలో నిశాంత్, సందీప్ మేనేజర్ పేర్లతో సైబర్ నేరగాళ్లు ఐడీ కార్డు తయారు చేసుకుని పక్కా ప్లాన్ ప్రకారం బాధితుడికి ఫోన్ చేసి తాము బ్యాంకుల్లో పనిచేస్తున్నామని నమ్మించారు. తమ సంస్థలలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని బ్యాంక్ అకౌంట్ వివరాలు పాస్ బుక్, ఓటీపీని పొందారు. వెంటనే అతడి అకౌంట్నుంచి రూ. 6,66,558 డ్రా చేసి రెండు, మూడు రోజుల్లో లాభాలతో తిరిగి డబ్బులు వస్తాయని నమ్మించారు.
నాలుగు రోజులు గడిచినా డబ్బులు రాకపోయేసరికి బాధితుడు జాతీయ సైబర్ సెల్ హెల్ప్ లైన్ నెంబర్ కు ఫిర్యాదు చేశాడు. దీంతో రూ. 47,422 ఫ్రీజ్ చేశారు. కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బాధితుడికి వాట్సప్ ద్వారా ఒక మెసేజ్ వచ్చింది. మెసేజ్ లోని నంబర్ కు ఫోన్ చేయగా దుబాయ్ జమ్ జమ్ ఎలక్ట్రికల్ డ్రాలో మీరు ఐఫోన్ విన్ అయ్యారని, ఛార్జీలు పంపిస్తే ఐఫోన్ పంపుతామనే నమ్మించారు. వారు ఇచ్చిన నంబర్‌కు బాధితుడు రూ.1.68 లక్షలు గూగుల్ పే చేశాడు. తరువాత పార్సల్ రాకపోవడంతో ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. అతడి ఫిర్యాదుతో రూ.39,030 ఫ్రీజ్ చేశారు.
రాజగోపాలపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బాధితుడికి గుర్తుతెలియని ఫోన్ చేసి రూ.2 లక్షల పర్సనల్ లోన్ మంజూరైందని చెప్పాడు. జీఎస్టీ లోన్ ప్రాసెస్ ఖర్చులు చెల్లిస్తే లోన్ డబ్బులు అకౌంట్ల పడతాయని నమ్మించాడు. ఫోన్ పే ద్వారా రూ.4500 రూపాయలు పంపించాడు. మరుసటి రోజు మరిన్ని డబ్బులు పంపించాలని అడగడంతో అనుమానించి జాతీయ సైబర్ సెల్ కు ఫిర్యాదు చేశాడు.
దీంతో రూ.4,500 ఫ్రీజ్ చేశారు. సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాధితుడికి ఫేస్బుక్ లో బిగ్ బజార్ లో కిరాణా ఆఫర్ వచ్చిందని, రూ.999 పంపాలనే మెసేజ్ కు స్పందించి ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు పంపాడు. డబ్బులు పంపిన ఐదు నిమిషాల తర్వాత బాధితుడి అకౌంట్లో నుంచి రూ. 39,600 డెబిట్ కావడంతో జాతీయ సైబర్ సెల్ హెల్ప్ లైన్ నెంబర్ కు ఫిర్యాదు చేశాడు. దీంతో 3,749 ఫ్రీజ్ చేశారు.