రైతును ముంచిన పత్తి..వరుస వానలతో 10లక్షల ఎకరాల్లో నష్టం

రైతును ముంచిన పత్తి..వరుస వానలతో 10లక్షల ఎకరాల్లో నష్టం
  • సగానికి తగ్గిన దిగుబడి.. లాగోడి ఎల్లుడూ కష్టమే 
  • అమ్ముకోబోతే అగ్గువకు అడుగుతున్నరు
  • గుడ్డిపత్తికి ధరొస్తలే.. క్వింటాల్‌ రూ.3 వేలే
  • సర్కార్ చెప్పిందని ఈసారి ఎక్కువగా సాగు చేసిన రైతులు
  • 15 లక్షల ఎకరాల్లో పెరిగిన పత్తి పంట

 

హైదరాబాద్‌, వెలుగు:తెల్ల బంగారాన్ని నమ్ముకుంటే.. రైతులను వానలు నట్టేట ముంచినయ్. రాష్ట్ర సర్కార్ చెప్పిందని ఎక్కువగా సాగు చేస్తే.. దిగుబడులు సగానికి పడిపోయి రైతులను మరింత దెబ్బతీసినయ్. గుడ్డిపత్తికి ధరొస్తలేదు. మిగిలిన చేన్లల్ల కాపొస్తలేదు. రాష్ట్రంలో వరుస వానలకు లక్షల ఎకరాల్లో పత్తి పంటలకు నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్రం తెచ్చిన ఫసల్ బీమాను అమలు చేయకపోవడం.. ఇటు ఇన్పుట్ సబ్సిడీని కూడా విడుదల చేయకపోవడంతో పత్తి రైతులు నిండా మునిగే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన వరుస వర్షాలు పత్తిపంటను తీవ్రంగా దెబ్బతీశాయి. వానల దెబ్బకు పంట నీటమునిగి భారీగా నష్టం జరిగింది. దీంతో ఆరుగాలం కష్టపడి పత్తి సాగు చేసిన  రైతుల ఆశలు ఆవిరయ్యాయి. పత్తిపంట  చేతికందే దశలో వరుస వర్షాలతో  దెబ్బతిన్నది. భూమి తడారకుండా కురుస్తున్న వర్షాలకు పత్తిపంట తడిసి నల్లబడి పోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు దిగుబడి తగ్గిపోతుండగా మరోవైపు పత్తి రంగు మారుతుండటంతో లాగోడీలు కూడా తిరిగి రాని పరిస్థితుల్లో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు ఆవేదనకు గురవుతున్నారు.

60 లక్షల ఎకరాల్లో సాగు..

రాష్ట్రంలో ఏటా వానాకాలం సీజన్ లో 45 లక్షల ఎకరాల వరకూ పత్తి సాగవుతుంటుంది. ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం షరతుల సాగుకు ఆదేశించడంతో పాటు 60.16 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని టార్గెట్ పెట్టింది. సర్కార్ పెట్టిన టార్గెట్ కంటే ఆరెకరాలు ఎక్కువగానే.. 60.22 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి వేశారు. సాగు రికార్డ్ స్థాయిలో పెరిగినా.. వానల వల్ల దిగుబడి సగం కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పంట వేసి నాలుగు నెలలైంది.ఇప్పుడు పూత, కాయ, కాయ పగిలే దశల్లో పంటలు ఉన్నాయి. ముందే వేసిన రైతులకు మొదటి విడత పత్తితీత ప్రారంభమైంది. కానీ వరుస వర్షాల వల్ల రైతులకు భారీగా నష్టం వచ్చే పరిస్థితులు ఉన్నాయి.

ముంచిన వరుస వర్షాలు

ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన వానలకు10 లక్షల ఎకరాల్లో పత్తి నీట మునిగింది. వానలు ఎక్కువగా పడటంతో పత్తిచేన్లు జాలుపట్టాయి. మిగతా మరో10 లక్షల ఎకరాలు తెగుళ్ళ బారీన పడి ఆకులు ఎర్రబడుతూ మాడిపోయాయి. ఉన్న పత్తి పంటకు జాజురోగం, వరుస వర్షాలతో వేర్లు కుళ్లిపోయి ఎదుగుదల లేదు. ఎక్కడో ఓదగ్గర బాగుందంటే  కాయలన్నీ మురిగిపోయినయి. కొన్ని ప్రాంతాల్లో పూత రాలిపోగా పంటకు తెగుళ్ళు వచ్చాయి. వర్షాల వల్ల పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సూర్యాపేట, నల్గొండ, ఆదిలాబాద్‌‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌‌, వరంగల్‌‌ రూరల్‌‌, జనగామ.. ఇలా ఎక్కడ చూసినా ఎర్రబారి, ముడుసుకున్న ఆకుతో పత్తి పంటలు కన్పిస్తున్నయి. ప్రతేడు దసరా కల్లా పత్తితీయడం మొదలయ్యేది. ఈసారి కొన్నిచోట్ల దీపావళి దాటినా మొదలు కానీ పరిస్థితి ఉంది.

ఆందోళనలో రైతులు

పత్తి బాగా పండితే రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటరు. రెండేళ్లుగా పత్తికి మంచి రేటు కూడా వస్తుండటంతో ఈ పంటను సాగుచేస్తే మంచిగ లాభం వస్తదని అనుకున్నరు. కానీ ఈసారి వర్షాలు ఎక్కువ గా పడి పంటను దెబ్బతీయడంతో రైతులు ఆందోళన లో మునిగారు. వర్షాలతో వచ్చిన తెగుళ్ల నుంచి పంట లను కాపాడుకోవడానికి వేలు ఖర్చువెట్టి మందులను పిచికారీ చేస్తున్నరు. మామూలుగా ఎకరానికి 10, 15 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. వర్షాల వల్ల ఇప్పుడు ఐదారు క్వింటాళ్ల పత్తి కూడా వస్తుందో లేదోనని రైతులు దిగులు పడుతున్నరు. చేతుల పైసలు లేవని వచ్చిన కొత్త పత్తిని అమ్ముకోబోతే.. పత్తి మంచిగలేదని వ్యాపారులు అగ్గువకే అడుగుతున్నరు. మద్దతు ధరలో సగం కూడా పెడ్తలేరు. పత్తి మీడియం రకానికి రూ.5,515,  లాంగ్‌‌ రకానికి రూ.5,825 మద్దతు ధర ఉన్నా.. మార్కెట్‌‌కు తీసుకపోతే 3 వేలు కూడా వస్తలేదని రైతులు చెప్తున్నరు. క్వింటాల్‌‌ రూ.2700 నుంచి రూ.3500 మించి కొనడం లేదని అంటున్నరు. కనీసం లాగోడీలు కూడా ఎల్లేలా లేవని.. పత్తితో బతుకు బంగారం అయితదనుకుంటే.. ఇలా ఆగమయ్యే పరిస్థితి వచ్చిందని గోస పడుతున్నరు.

క్వింటాలు రూ.2,700లే వచ్చింది

నాకున్న భూమితో పాటు మరికొంత కౌలుకు తీసుకొని ఈ యేడు పదెకరాల్లో పత్తి పెట్టిన. వానలు ఎక్కువపడి పత్తి కాయ సరిగా రాలే.  పది ఎకరాలకు 40 క్వింటాళ్లు గుడ ఎల్లెటట్టు లేదు. మొదాలు ఏరిన పత్తి అమ్మెతందుకు మొన్న మండలానికి తీసుకుపోతే క్వింటాలుకు రూ.2,700 ధర పెట్టిన్రు. ఏడు క్వింటాళ్లు అమ్మితే వచ్చిన పైసలు కూళ్లకుగుడ సరిపోలే.  పండిన ఈ సగం పంటనన్న సర్కారు జల్ది కొనాలె.

–  శెట్టె అయిలయ్య,  సిద్దిపేట జిల్లా

లాగోడి గూడా వచ్చేటట్ల లేదు

మూడెకరాలు పత్తి వేసినం. ఇప్పటి వరకు 50 వేలు పెట్టుబడి పెట్టినం. వర్షాలతో పత్తి మొత్తం దెబ్బతిన్నది. మందులకే రూ.20 వేలు ఖర్చు అయినయి. 30 క్వింటాళ్లు దిగుబడి వస్తదనుకున్నాం. కానీ 20 క్వింటాళ్లు కూడా వచ్చేటట్ల లేదు. కూలీల రేట్లు ఎక్కువైనయి. ఏటా మూడు సార్లు పత్తి తీసేటోళ్లం. ఇప్పుడు రెండు సార్లే వచ్చేటట్లుంది. ఈసారి పత్తి సాగు దండుగే అయ్యేటట్లుంది. మొత్తంగా లాగోడి గూడా వచ్చేటట్ల లేదు.

-కవిత, ఖమ్మం జిల్లా

బుగులు అయితాంది

వానలకు పత్తి చేన్లు మునిగినయ్‌‌. ఆకంత జాడిచ్చింది. చేన్లు ఊటలు పట్టింది. కాపు తక్కువైంది. మొదటి పంటను ఇప్పుడిప్పుడే ఏరిస్తున్నం. ఇప్పడు వచ్చే పత్తి అంతా నల్లగ ఉన్నది. ఈగుడ్డి పత్తిని  రూ.1,500లకు కొంటరో.. 2 వేలకు కొంటరో అని బుగులు అయితాంది. పెట్టుబడి అయినా పూడేటట్ల లేదు.

– బీరయ్య, ఆలేడు, నెల్లికుదురు మండలం, మహబూబాబాద్‌‌ జిల్లా

ఏం మిగిలేటట్ల లేదు

ఐదెకరాల్లో పత్తి వేసినం. 70 వేల వరకు పెట్టుబడి పెట్టినం. వానలకు పంట దెబ్బతిన్నది. ఏటా ఈ నెలలో పత్తి తీసేటోళ్లం. ఈ ఏడాది కాయలు ఇప్పుడే వస్తున్నయి. ఇంకా నెల తర్వాత పత్తి తీసే స్టేజ్ కి వస్తుంది. వర్షాల వల్ల దిగుబడి తక్కువయింది. మిరప తోట అడుగులో పత్తి వేస్తే ఎకరానికి10 కింటాళ్లకు పైగా  వచ్చేది. ఈ సారి వర్షాలతో ఎకరానికి 4 కింటాళ్లు కూడా రావటం కష్టమే.

– మర్రి లచ్చిరెడ్డి, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం జిల్లా