గ్రేటర్ లో 13 మందికి చాన్స్.. కాంగ్రెస్ తొలి జాబితాలో టికెట్ కన్ఫమ్​

గ్రేటర్ లో 13 మందికి చాన్స్.. కాంగ్రెస్ తొలి జాబితాలో టికెట్ కన్ఫమ్​
  • గ్రేటర్ లో 13 మందికి చాన్స్
  • కాంగ్రెస్ తొలి జాబితాలో టికెట్ కన్ఫమ్​
  • కీలక సెగ్మెంట్లలో అభ్యర్థులు ఖరారు
  • పేర్లు లేని నేతల్లో ఆందోళన
  • రెండో జాబితా కోసం ఎదురుచూపు 

హైదరాబాద్,వెలుగు : కొంతకాలంగా ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా.. కాంగ్రెస్​అభ్యర్థుల మొదటి జాబితా ఆదివారం విడుదలైంది. ఇందులో గ్రేటర్​హైదరాబాద్​నుంచి 13 మందికి టికెట్​ఖరారైంది. అయితే.. పాతబస్తీలోని స్థానాల నుంచే ఎక్కువ మంది ఉన్నారు. ముందుగా ఊహించిన వారిలో కొందరికి టికెట్​దక్కడంతో అభ్యర్థుల శిబిరాల్లో ఆనందాలు వెల్లువెత్తాయి. ఓల్డ్ సిటీ నుంచి స్థానికేతరులనే ఎక్కువమందిని ఎంపిక చేశారంటూ కొందరు మైనార్టీ నేతలు గాంధీభవన్​లో ఆందోళనకు దిగారు. గ్రేటర్​లోని 24 స్థానాలకుగాను 13 చోట్ల కన్ఫమ్ చేయగా.. మిగిలిన11 సెగ్మెంట్లు అత్యంత కీలకమైనవి కావడంతో రెండో జాబితాలో వెల్లడించే చాన్స్ ఉందని ఆ పార్టీ నేతలు తెలిపారు.  

ముందుగా అనుకున్నట్టుగానే..  

ఎవరికి టికెట్ వస్తుందనే దానిపై కొద్దిరోజులుగా పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే వారికే టికెట్లు దక్కడం విశేషం. ఇందులో ప్రధానంగా మల్కాజిగిరి నుంచి సిట్టింగ్​ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్​కు రాజీనామా చేసి కాంగ్రెస్​లో చేరారు. ​ఆయనకే టికెట్‌ వస్తుందనే ప్రచారంతో  అనుకున్నట్టుగానే ఖరారైంది. ముషీరాబాద్​ నుంచి మాజీ ఎంపీ అంజన్​కుమార్​యాదవ్​ పేరు  వినిపించింది.  ఊహించినట్టుగానే ఆయననే అభ్యర్థిగా ప్రకటించారు. 2004, 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్​ ఎంపీగా ఆయన గెలుపొందారు.

సిటీ కాంగ్రెస్​ అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం కూడా ఉంది. ఆయన కుమారుడు అనిల్​కుమార్​ యాదవ్​ ప్రస్తుతం సికింద్రాబాద్​ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీలో వివాదారహితుడిగా పేరు పొందిన అంజన్ ఈసారి ముషీరాబాద్​ నుంచి పోటీ చేయాలనుకుని మొదట్నుంచీ అక్కడ పని చేస్తున్నారు. సికింద్రాబాద్ ​నుంచి ఎవరు పోటీ చేస్తారనే ఉత్కంఠకు తెర దించుతూ పార్టీ సీనియర్​నేత ఆదం సంతోష్​కుమార్​కు టికెట్​ఇచ్చారు.  ఆయన తొలి నుంచి కాంగ్రెస్​ కార్యకర్తగా ఉన్నారు. ఐఎన్టీయూసీ, సిటీ కాంగ్రెస్, రాష్ట్ర కాంగ్రెస్​లో వివిధ హోదాల్లో పని చేశారు. దీంతో  ఆయనకు  సికింద్రాబాద్ నుంచి పోటీకి చాన్స్ వచ్చింది. ఈసారి సనత్​ నగర్​నుంచి మహిళకు చాన్స్ ఇచ్చారు.

ఇక్కడ డాక్టర్​రవీందర్​గౌడ్​, విజయవర్ధన్ నాయుడు, డాక్టర్​కోట నీలిమ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. చివరకు మహిళా నేత నీలిమను అభ్యర్థిగా ప్రకటించారు. ఆమె సెగ్మెంట్ లో  పెద్దగా ప్రచారంలో లేకున్నా ఢిల్లీస్థాయిలో తనకున్న పలుకుబడి కారణంగానే టికెట్​దక్కిందని పార్టీవర్గాలు పేర్కొన్నాయి. ఉప్పల్​నుంచి పరమేశ్వర్​రెడ్డిని ఎంపికచేశారు. కుత్బుల్లాపూర్​నుంచి కొలను హన్మంతరెడ్డిని ప్రకటించారు. గత ఎన్నికల్లో నాంపల్లి నుంచి మహ్మద్​ఫిరోజ్​ ఖాన్​స్వల్ప మెజారిటీతో ఓటమి చెందారు. ఈసారి కూడా ఆయనకే టికెట్​కన్ఫమ్ అయింది. 

పలు చోట్ల అసంతృప్తి

​తొలి జాబితాలో టికెట్​దక్కని పలువురు కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పని చేసినా గుర్తించలేదని పలువురు ఆశావహులు నిరాశ చెందారు. పార్టీ నిర్ణయాన్ని బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా బీసీ నేతలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముషీరాబాద్​నుంచి టికెట్​ఆశించిన పార్టీ సీనియర్​నేత నగేశ్​ముదిరాజ్​టికెట్​రాకపోవడంతో పార్టీ చేసిన సర్వేలోనూ తాను ముందున్నా.. తనను ఎంపిక చేయలేదని తెలిపారు. త్వరలో తన భవిష్యత్​కార్యాచరణ రూపొందించుకుంటానని పేర్కొన్నారు. ఉప్పల్ ​నుంచి టికెట్​ దక్కని రాగిడి లక్ష్మారెడ్డి కూడా తీవ్ర నిరాశకు గురై  పార్టీ తీరుపై అసంతృప్తి వెళ్లగక్కారు. సనత్​ నగర్​నుంచి టికెట్​ఆశించిన డాక్టర్​రవీందర్​గౌడ్​తనకు టికెట్​రాకపోవడం పై నిరసన వ్యక్తం చేశారు. 

మైనార్టీ నేతల ఆందోళన 

ఓల్డ్ సిటీలోని పలు స్థానాలకు కాంగ్రెస్​ క్యాండిడేట్లను ప్రకటించడంతో వారిపై  స్థానిక మైనార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  పలువురు నేతలు గాంధీభవన్​వద్ద నిరసన తెలిపారు. తొలి లిస్ట్ లో  కె. రవిరాజు(యాకుత్​పురా), రాజేశ్​కుమార్​పులిపాటి(బహదూర్​పురా), షేక్​ అక్బర్​(మలక్​పేట),ఉస్మాన్​ బిన్​ మహ్మద్​అల్​హజ్రి(కార్వాన్​), మొగిలి సునీత(గోషామహల్​), బోయ నగేశ్ (చాంద్రాయణగుట్ట) నుంచి అభ్యర్థులుగా ఖరారయ్యారు. ఇందులో ఎక్కువమంది తెలుగు వారే ఉండడంతో ఓల్డ్ సిటీకి చెందిన  పలువురు మైనార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.