కడెం,వెలుగు:ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేజ్కల్చర్ వరద పాలైంది. కడెం ప్రాజెక్టులో మొన్నటి వర్షాలు... వరదలకు దాదాపు 30 టన్నుల చేపలు గోదావరి పాలయ్యాయి. 2015లో రాష్ట్ర ప్రభుత్వం కేజ్కల్చర్విధానానికి శ్రీకారం చుట్టింది. జార్ఖండ్ రాష్ట్రంలో అప్పటికే అమలవుతున్న కేజ్కల్చర్విధానంపై మత్స్యకారులకు శిక్షణ ఇప్పించింది. నిర్మల్జిల్లాలో కడెం రిజర్వాయర్లో చేపల పెంపకం ప్రారంభించారు. ఈ విధానంలో లాభాలు రావడంతో చాలామంది అటువైపు మొగ్గుచూపారు. పది మంది ఓ గ్రూప్గాచేసి ఎనిమిది గ్రూప్లు కేజ్కల్చర్యూనిట్లు ప్రారంభించారు. ఆఫీసర్లు సూచనలు, సలహాల మేరకు చేపల పెంపకం చేపట్టారు.
గత ఏడాది నుంచే..
గత ఏడాది భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టులో మూడు కేజ్కల్చర్యూనిట్లు కొట్టుకుపోయాయి. దీంతో మత్స్యకారులకు రూ.80 లక్షల దాకా నష్టం జరిగింది. ఈసారి భారీ వర్షాలకు ఉన్న మూడు యూనిట్లలో రెండు కొట్టుకుపోయాయి. ఫలితంగా 30 టన్నులు చేపలు గోదావరి పాలయ్యాయి. మత్స్యకారులు దాదాపు రూ.30 లక్షల వరకు నష్టపోయారు.
పెట్టుబడి రాక అప్పుల పాలు...
--కడెం రిజర్వాయర్లో ఏర్పాటు చేసిన కేజ్కల్చర్యూనిట్లకు సభ్యులు సబ్సిడీ పోను ఒక్కో యూనిట్కోసం రూ. 60 వేల చొప్పున పది యూనిట్లకు రూ. 6 లక్షలు ప్రభుత్వానికి చెల్లించారు. వరుసగా రెండేళ్ల నుంచి మొత్తం అయిదు యూనిట్లు వరద పాలుకావడంతో మత్స్యకారులు నిండా మునిగారు. సబ్సిడీ పోను పెట్టుబడి రాక అప్పులపాలయ్యారు.
ఉపాధి లేక విలవిల...
ఈసారి భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టు ప్రమాద స్థాయికి చేరుకుంది. గేట్లు ఖరాబ్కావడంతో వచ్చిన నీరంతా గోదావరిలోకి వెళ్లడంతో చెరువులు, కుంటలు, గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. కడెం ప్రాజెక్టు గేట్లు పాడైపోవడంతో నీరంతా గోదావరి పాలవుతోంది. దీంతో రిజర్వాయర్, గోదావరిలో చేపల వేట లేక వందలాది మత్స్యకారుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రతీరోజు చేపల వేట సాగించి కుటుంబాన్ని పోషించుకునే మత్స్యకారులు నెల రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గోదావరిలో రిజర్వాయర్లో వేసిన వలలు, తెప్పలు కొట్టుకపోవడంతో మరింత నష్టపోయామని పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
అప్పులే మిగిలాయి...
అప్పులు చేసి కడెం ప్రాజెక్టులో కేజ్కల్చర్యూనిట్లు పెట్టుకున్నం. కంటికి రెప్పలాగ కాపాడుకుంటున్న సమయంలో వరద నోటికాడి బుక్క ఎత్తుకెళ్లింది. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి - భీమన్న, ధర్మాజీపేట
ఉపాధి లేక ఇబ్బందులు..
ప్రాజెక్టు గేట్లు ఖరాబ్కావడంతో నీళ్లన్నీ గోదావరి పాలయ్యాయి. తెప్పలు, వలలు, చేపలు వరదలకు కొట్టుకుపోయాయి. ఉపాధి కరువై ఇబ్బంది పడుతున్నాం. నెల రోజులుగా చేపల వేట లేదు. - గడప దేవరాజు, కడెం
