మంత్రి రేసులో సీతక్క, సురేఖ.. ఇద్దరికీ కేబినెట్​లో చోటు దక్కే ఛాన్స్​

మంత్రి రేసులో సీతక్క, సురేఖ.. ఇద్దరికీ కేబినెట్​లో చోటు దక్కే ఛాన్స్​
  • తమకూ అవకాశం దక్కుతుందని ఆశ పడుతున్న జూనియర్లు
  • ఉమ్మడి వరంగల్​ నుంచి 10 మందిని గెలిపించిన జనాలు
  • కేసీఆర్‍ సర్కారులో ఓరుగల్లుకు మినిస్టర్​ పదవులు, చీఫ్ ​విప్​

వరంగల్‍, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్‍ పార్టీ అధికారంలోకి రావడంతో ఓరుగల్లు నుంచి మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయోననే డిస్కషన్‍ మొదలైంది. ఉమ్మడి వరంగల్​జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలుండగా ఓటర్లు కాంగ్రెస్‍ పార్టీకి చెందిన 10 మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించారు. ఈ క్రమంలో పార్టీ పెద్దలు పదవుల కేటాయింపులో జిల్లాకు సముచిత స్థానం కల్పిస్తారని అంతా భావిస్తున్నారు. మంత్రి రేసులో ఇప్పటికే ఇద్దరు సీనియర్​ లీడర్లు ఉండగా.. మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్న జూనియర్లు కూడా తమకు అవకాశం దక్కుతుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు.  

సీనియర్ల కోటాలో సీతక్క, సురేఖ

ఉమ్మడి వరంగల్‍ జిల్లా నుంచి 10 మంది కాంగ్రెస్‍ అభ్యర్థులు గెలవగా, ఇందులో గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు నలుగురు ఉన్నారు. ఇందులో ములుగు నుంచి ఎమ్మెల్యే సీతక్క, వరంగల్‍ తూర్పు ఎమ్మెల్యే సురేఖ ముందు వరుసలో ఉన్నారు. మహిళా కాంగ్రెస్‍ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతక్క పార్టీ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్‍ గాంధీ, ప్రియాంక గాంధీకి దగ్గరయ్యారు. పీసీసీ చీఫ్​గా వ్యవహరించిన రేవంత్‍రెడ్డికి సోదరిలా మెదిలారు. టీడీపీ, కాంగ్రెస్‍ తరఫున ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా మూడోసారి సైతం విజయం సాధించారు.  ఆమెకు డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన  మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయంటున్నారు. దీనికి తోడు ఎస్టీ ఆదివాసీ బిడ్డ కావడం ఆమెకు కలిసొచ్చే అంశం. కొండా సురేఖ సైతం తనకు మంత్రి పదవి దక్కుతుందని భావిస్తున్నారు. గతంలో మూడుసార్లు ఎమ్మెల్యే అవడానికితోడు వైఎస్‍ రాజశేఖర్‍రెడ్డి హయంలో మంత్రిగా కూడా పనిచేశారు. బీసీ సామాజికవర్గానికి తోడు గ్రేటర్‍ వరంగల్‍ సిటీ నుంచి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రూరల్‍ ఏరియా నుంచి సీతక్క, గ్రేటర్‍ నుంచి సురేఖకు మంత్రి పదవులు వస్తాయని అందరూ భావిస్తున్నారు. సీనియర్లలో వీరేగాక మరో ఇద్దరు పురుష ఎమ్మెల్యేలు సైతం కేబినెట్ ​హోదా కోసం ఎదురుచూస్తున్నారు. రేవూరి ప్రకాశ్‍రెడ్డి, దొంతి మాధవరెడ్డి గతంలో ఎమ్మెల్యేలుగా వ్యవహరించారు. ప్రకాశ్‍రెడ్డి గతంలో నర్సంపేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేగాక టీడీపీలో రేవంత్‍రెడ్డితో కలిసి పనిచేశారు. ఇప్పుడు నాలుగోసారి బలమైన లీడర్‍ చల్లా ధర్మారెడ్డిపై అనూహ్యంగా విజయం సాధించారు. ఇక నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్‍ పార్టీలో సీనియర్‍ లీడర్‍. పార్టీలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్‍ టిక్కెట్‍ కేటాయించకున్నా.. ఇండిపెండెంట్‍గా నిలిచి గెలిచిన లీడర్‍గా ప్రత్యేక గుర్తింపు ఉంది.  

కేసీఆర్‍ సర్కారులో జిల్లాకు పెద్ద పదవులు

కేసీఆర్‍ ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్‍ జిల్లాకు మంత్రి పదవులతో పాటు అంతే సమానమైన పదవుల కేటాయింపులో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మొదటి టర్మ్​లో తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎం పోస్టులు ఇచ్చారు. తొలి శాసనసభ స్పీకర్‍గా మధుసూదనా చారి పనిచేశారు. రెండో టర్మ్​లో జిల్లా నుంచి 10 మంది బీఆర్‍ఎస్‍ ఎమ్మెల్యేలుగా గెలవగా.. ఎర్రబెల్లి దయాకర్‍రావు, సత్యవతి రాథోడ్‍కు మంత్రి పదవులతో పాటు కేబినెట్​హోదా ఉండే ప్రభుత్వ చీఫ్‍ విప్‍ పదవిని దాస్యం వినయ్‍ భాస్కర్‍కు కట్టబెట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్ ​నుంచి కూడా పది మంది ఎమ్మెల్యేలు గెలవగా అంతే ప్రాధాన్యం దక్కుతుందని జిల్లా వాసులు అనుకుంటున్నారు.