మునుగోడు బైపోల్ ఫలితంపై కోట్లలో పందాలు

మునుగోడు బైపోల్ ఫలితంపై కోట్లలో పందాలు
  • ఆసక్తికరంగా చివరి మూడు గంటల పోలింగ్‌
  • తెలంగాణ, ఏపీలో కోట్ల రూపాయల్లో పందాలు
  • మునుగోడు బైపోల్ ఫలితంపై కోట్లలో పందాలు
  • ఏజెంట్లతో రంగంలోకి దిగిన బుకీలు

హైదరాబాద్‌, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికలో గెలుపోటములపై భారీగా బెట్టింగులు నడుస్తున్నాయి. గురువారం సాయంత్రం వరకు వార్‌ వన్‌సైడే అన్నట్టుగా సాగిన పందాలు రాత్రి టర్న్‌ తీసుకున్నాయి. చివరి మూడు గంటల్లో దాదాపు 20 శాతం ఓట్లు పోలవడంతో గెలుపోటములను అవే డిసైడ్‌ చేయనున్నాయి. దీంతో చివరి మూడు గంటల పోలింగ్‌పైనే పెద్ద ఎత్తున బెట్టింగ్‌ సాగుతోంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ క్యాండిడేట్లపై రూ.వేల నుంచి మొదలుకొని రూ.లక్షల్లో పందాలు కాస్తున్నారు. ఇందుకోసం బుకీలు ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకున్నారు. ఐపీఎల్‌ తరహాలో వారిని రంగంలోకి దించి బెట్టింగులను ప్రోత్సహిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నాటి నుంచి ఈ ఉపఎన్నికపై రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వచ్చిన నాటి నుంచి ఈ బైపోల్‌పై బెట్టింగులు మొదలయ్యాయి. పోలింగ్‌కు 48 గంటల ముందు పందాలు ఊపందుకున్నాయి. పోలింగ్‌ రోజు ప్రతి రెండు గంటలకు నమోదవుతున్న పోలింగ్‌ శాతాన్ని బట్టి బెట్టింగ్‌లు నిర్వహించారు. సాయంత్రం 5 గంటల వరకు బెట్టింగులు ఒక స్థాయిలో ఉండగా, ఆ తర్వాత ఇంతకు మూడు రెట్లు అదనంగా బెట్టింగ్ సాగినట్టు తెలుస్తోంది. శుక్రవారం కూడా ఈ బెట్టింగులు కొనసాగాయి. ఆదివారం కౌంటింగ్​ ఉండడంతో శనివారం కూడా కొనసాగే అవకాశముంది.

ఎక్కడ ఎవరికి లీడ్? మెజార్టీ ఎంత?
దక్షిణాదిలో కర్నాటక తర్వాత తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బీజేపీ మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేసింది. కాంగ్రెస్‌‌‌‌ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌ రెడ్డితో రాజీనామా చేయించి తమ పార్టీ క్యాండిడేట్‌‌‌‌గా పోటీచేయించింది. దేశ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ సైతం ఈ ఉప ఎన్నికను అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డారు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రెండు పార్టీలు హోరాహోరీగా తలపడటంతో ఈ ఉప ఎన్నిక అందరి దృష్టిని ఆకర్షించింది. రెండు పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేయడమే కాదు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడంలోనూ అదే తరహాలో పోటీపడ్డాయి. దీంతో ఈ రెండు పార్టీల్లో ఎవరు గెలుస్తారు అనే దానిపై పెద్ద ఎత్తున బెట్టింగులు సాగాయి. గెలిచే పార్టీ ఏది.. ఏ క్యాండిడేట్‌‌‌‌ గెలుస్తారు.. ఎంత మెజార్టీతో గెలుస్తారు.. ఎక్కడ ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది.. కేసీఆర్‌‌‌‌, కేటీఆర్‌‌‌‌, హరీశ్‌‌‌‌రావు ఇన్‌‌‌‌చార్జ్​లుగా ఉన్న గ్రామాల్లో ఎవరికి లీడ్‌‌‌‌ వస్తుంది.. ఈటల రాజేందర్‌‌‌‌ అత్తగారి ఊరిలో ఏ పార్టీ లీడ్‌‌‌‌లో ఉంది అనే అంశాలపైనా బెట్టింగ్‌లు కాశారు.

ఇంటెలిజెన్స్ రిపోర్టులో నోక్లారిటీ
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వైపే మొగ్గు ఉందని అన్ని ఎగ్జిట్‌‌‌‌ పోల్స్‌‌‌‌ అంచనా వేశాయి. సాయంత్రం 6 గంటలకు అవి తమ అంచనాలను ప్రకటించాయి. సాయంత్రం 5 గంటల వరకు ఉన్న ట్రెండ్‌‌‌‌ ఒకలా ఉంటే ఆ తర్వాతే అసలు కథ మొదలైనట్టుగా చెప్తున్నారు. సాయంత్రం వరకు గెలుపు ధీమాలో ఉన్న అధికార పార్టీ చివరి మూడు గంటల్లో నమోదైన పోలింగ్‌‌‌‌ ఎవరికి లాభిస్తుందనే లెక్కలు వేస్తోంది. హైదరాబాద్‌‌‌‌ నుంచి వచ్చిన యూత్‌‌‌‌తో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యువత, మహిళలు పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. ఈ ఓట్లలో ఎవరికి ఎన్ని పోల్‌‌‌‌ అయ్యే అవకాశం ఉంది అనేదానిపై బేగంపేట క్యాంప్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో పార్టీ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్‌‌‌‌ ఆధ్వర్యంలో పోస్ట్‌‌‌‌ మార్టం నిర్వహించారు. గురువారం అర్ధరాత్రి, శుక్రవారం ఉదయం వచ్చిన ఇంటెలిజెన్స్‌‌‌‌ రిపోర్టుల్లోనూ రిజల్ట్‌‌‌‌పై క్లారిటీ లేకపోవడంతో అధికార పార్టీ హైరానా పడినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రచారం కూడా బెట్టింగ్‌‌‌‌ రాయుళ్లకు బూస్టింగ్‌‌‌‌ ఇస్తున్నట్టు సమాచారం. ఈక్రమంలోనే టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, బీజేపీపై పోటాపోటీగా పందెం కాస్తున్నారు. మునుగోడు ఓటర్ల తీర్పు ఏంటో ఆదివారం మధ్యాహ్నానికే తేలిపోనుంది.

ఏజెన్సీలతో బుకీల సర్వే
ఉప ఎన్నికల్లో బెట్టింగ్ ​కోసం బుకీలు ప్రత్యేకంగా సర్వే ఏజెన్సీలను రంగంలోకి దించారు. ఆయా సర్వే రిపోర్టులను ఏజెంట్ల ద్వారా చేరవేసి బెట్టింగులు పెట్టేలా ప్రోత్సహించారు. ఐపీఎల్‌‌‌‌లో బెట్టింగులు పెట్టిన వారితో పాటు రాజకీయాలంటే ఇంట్రస్ట్‌‌‌‌ చూపే వాళ్లు సైతం పందెం కాసినట్టు తెలుస్తోంది. బుకీలు హైదరాబాద్‌‌‌‌ లోని హోటళ్లలో రూమ్‌‌‌‌లు అద్దెకు తీసుకొని బెట్టింగ్‌‌‌‌లు నిర్వహించినట్టు సమాచారం. మునుగోడు, చౌటుప్పల్‌‌‌‌, నాంపల్లి, ఎల్బీ నగర్‌‌‌‌, ఇబ్రహీంపట్నం, హైదరాబాద్‌‌‌‌లోని పలు ప్రాంతాలు, ఏపీలో గుంటూరు, విజయవాడ, వైజాగ్‌‌‌‌లో ఏజెంట్లను నియమించి వారి ద్వారా బెట్టింగులు నిర్వహించారు. కొందరు వేలల్లో బెట్టింగ్‌ కాస్తే మరికొందరు లక్షల్లో కాసినట్టు తెలుస్తోంది. విజయవాడ, గుంటూరులో బెట్టింగ్​లు లక్షలు దాటి కోట్ల వరకు చేరినట్టు ప్రచారంలో ఉంది.