
న్యూఢిల్లీ: జీఎస్‌టీ అధికారులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్ (క్యూ1) లో రూ.15,851 కోట్ల నకిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) మోసాన్ని గుర్తించారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ అమౌంట్ 29 శాతం ఎక్కువ. 3,558 నకిలీ సంస్థలను జీఎస్‌టీ అధికారులు పట్టుకున్నారు. గత ఏడాది క్యూ1 లో పట్టుకున్న 3,840 సంస్థలతో పోలిస్తే తక్కువ. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని రాష్ట్ర ఆర్థిక మంత్రుల ప్యానెల్ ఐటీసీ మోసాలను అరికట్టేందుకు రంగాల వారీగా పన్ను ఎగవేతను అధ్యయనం చేస్తోంది. జూన్ క్వార్టర్‌లో 53 మందిని అరెస్ట్ చేశామని, రూ.659 కోట్లను రికవర్ చేశామని అధికారులు తెలిపారు. గత ఏడాది జూన్ క్వార్టర్‌లో రూ.12,304 కోట్ల ఐటీసీ మోసాన్ని, 3,840 నకిలీ సంస్థలను గుర్తించారు. 26 మందిని అరెస్ట్ చేసి, రూ.549 కోట్లను రికవరి చేశారు.
కాగా, వ్యాపారులపై ఒకసారి కంటే ఎక్కువసార్లు జీఎస్‌టీ పడితే రిఫండ్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. 2024–-25లో 25,009 నకిలీ సంస్థలను అధికారులు గుర్తించారు. మొత్తం రూ.61,545 కోట్ల ఐటీసీ మోసం జరిగిందని అంచనా. 2023లో మే 16, జులై 15 మధ్య జరిగిన మొదటి పాన్ -ఇండియా డ్రైవ్‌లో 21,791 నకిలీ సంస్థలను, రూ.24,010 కోట్ల ఎగవేతను గుర్తించారు. కిందటేడాది ఏప్రిల్ 16,- అక్టోబర్ 30 మధ్య జరిగిన రెండో డ్రైవ్‌లో 18 వేల నకిలీ సంస్థలను, రూ.25 వేల కోట్ల ఎగవేతను గుర్తించారు. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కఠినతరం చేయడంతోపాటు, రిస్కీ దరఖాస్తుదారులకు ఆధార్ ధృవీకరణ, ఫిజికల్ వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు. జీఎస్‌టీ చట్టం కింద, నకిలీ ఐటీసీ కేసుల్లో రిజిస్ట్రేషన్ రద్దు, ఐటీసీ ఆపేయడం, ఆస్తి/బ్యాంక్ ఖాతాల జప్తు వంటి శిక్షలు ఉన్నాయి.