నెరవేరని సీఎం ఎయిర్ అంబులెన్స్ హామీ

నెరవేరని సీఎం ఎయిర్ అంబులెన్స్ హామీ

ఆసిఫాబాద్, వెలుగు: ‘ఏజెన్సీ గ్రామాల్లో వానాకాలం వస్తే ప్రజలు రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇన్నేండ్లు పరాయి పాలనలో ఏజెన్సీ ప్రజలకు తీరని నష్టం జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రంలో.. మన పాలన మొదలైంది. ఇకమీదట ఏజెన్సీలో కష్టాలు ఉండవు. వానాకాలంలోనూ గిరి గ్రామాలకు మెరుగైన వైద్యం అందాలి. దీనికోసం ఎయిర్ అంబులెన్స్ లు పెట్టిస్తా. ’2014 అక్టోబర్8న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాట్ లో కుమ్రంభీం వర్ధంతి సందర్భంగా గిరిజన దర్బార్ లో సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీ ఇది. ఎనిమిదేండ్లు గడిచినా సీఎం హామీ నెరవేర్చే దిశగా ఒక్క అడుగూ పడలేదు. మరోవైపు గ్రామాల్లో రోడ్ల పరిస్థితి గతంలోకన్నా అధ్వానంగా మారింది.  ఆదివాసీ జిల్లాలో నిండు గర్భిణులకు ప్రసవం నరకప్రాయంగా మారుతోంది. ఊరిని చుట్టుముట్టిన వరద నీళ్ల మధ్యలో బిక్కుబిక్కుమంటూ పురిటి వేదనతో ప్రాణాలు కోల్పోతున్నారు. అధ్వాన రోడ్లతో సకాలంలో అంబులెన్స్​రాక బ్రిడ్జి మీదే ప్రసవిస్తున్నారు. గత 15 రోజులుగా గర్భిణులు పడుతున్న అవస్థలు అందరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి. ఆపద వస్తే అప్పటి మందం అన్న చందంగా స్పందించడం తప్ప ఎక్కడా ఆఫీసర్లు ముందస్తు జాగ్రత్తలు చేపట్టడం లేదు. దీంతో ప్రసవ వేదన ప్రాణసంకటంగా మారుతోంది. జిల్లాలో ఇటీవలి వర్షాలకు 36 రోడ్లు, 30 కల్వర్టులు తెగిపోయాయి. 15 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు తట్టెడు మట్టి వేయకపోగా కనీసం గండ్లు కూడా పూడ్చలేదు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రోడ్డు కనెక్టివిటీ ఉన్న గ్రామాలు తక్కువ. 15 మండలాల్లోని 335 గ్రామ పంచాయతీల్లో 332 ఆవాసాలకు ఇప్పటికీ రోడ్డు సౌకర్యం లేదు. 117 లో లెవల్, హై లెవల్ బ్రిడ్జిలు కట్టాల్సి ఉంది. 

సేఫ్​జోన్​పై దృష్టి పెట్టని ఆఫీసర్లు

ఆసిఫాబాద్​జిల్లాలో 3,496 మంది గర్భిణులు ఉండగా ఈ నెలలో డెలివరీ అయ్యేవారు 160 మంది వరకు ఉన్నారు. వానలతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని  ప్రస్తుత తరుణంలో గర్భిణులను సేఫ్ జోన్ కు తరలించాల్సి ఉండగా.. ఆఫీసర్లు, లీడర్లు ఆ దిశగా దృష్టి పెట్టడం లేదు. ఏ ఊర్లో ఎంతమంది గర్భిణులు ఉన్నారు, వాళ్ల డెలివరీ టైం ఎప్పుడున్నది వైద్య ఆరోగ్యశాఖ దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది. ఆ  జాబితా ఆధారంగా రోడ్లు, రవాణా సౌకర్యాలు లేని గ్రామాల్లో ఉన్న నిండు గర్భిణులను వారం పదిరోజుల ముందే హాస్పిటళ్లకు, రవాణా సౌకర్యాలు బాగున్న ప్రాంతాలకు తరలిస్తే చివరి నిమిషంలో ఇబ్బందులు ఉండవు. మహబూబాబాద్​జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గర్భిణులను అక్కడి కలెక్టర్​శశాంక ముందస్తు జాగ్రత్తలు తీసుకుని సేఫ్​జోన్​కు తరలించారు.  రెండు వారాల్లోపు ప్రసవించే మారుమూల ప్రాంతాల్లోని 131 మంది గర్భిణులను గుర్తించగా వారందరినీ స్థానిక ఆరోగ్య కేంద్రాలు, రహదారి సౌకర్యం సక్రమంగా ఉన్న బంధువుల ఇళ్లకు తరలిస్తున్నారు. ఆసిఫాబాద్​జిల్లాలోనూ ఈ దిశగా చొరవ తీసుకోవాలని, గర్భిణుల కష్టాలను కొంతవరకైనా తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. 

దేవుని దయతో గండం గట్టెక్కింది

తొలుచూరు కాన్పుకు మొట్లగూడలోని మా పుట్టింటికి పోయిన. నెలలు నిండి నొప్పులు రాంగనె మావోల్లు ఆశ వర్కర్ ప్రమీలకు చెప్పిండ్రు. నా భర్త, ఆశ వర్కర్, మా అమ్మ ఆటో మాట్లాడుకొని దహెగాం సర్కారు దవాఖానకు పోతుంటే దారిల గాలికి చెట్టు పడి రోడ్డు మూసుకుపోయింది. దేవుడు పంపినట్టు పోలీసులు అక్కడికి వచ్చి మా పరిస్థితి చూసి చెట్టును పక్కకు జరిపి ఆటోకు తోవ చేసిండ్రు.అక్కడినుంచి పోంగ పీకలగుండం అవతల ఒర్రె నడుముల లోతు పారుతుండే. నేను దవాఖానకు పోతానో పోనో, బతుకుతనో లేదో అని దేవుని మీదనే భారమేసిన. అవతల అంబులెన్సు వాళ్లు వచ్చి స్ట్రెచర్ మీద పండుకోబెట్టి పీకల గుండం ఊరోళ్లు నలుగురితో కలిసి మోసుకొని ఒర్రె దాటిచ్చిన్రు. అంబులెన్సుల దహెగాం దవాఖానకు తీసుకపోయిన్రు. అక్కడ డాక్టర్లు పురుడు పోసిన్రు. పాప పుట్టింది. నాలుగైదు గంటలు నరకయాతన పడ్డంక పాపని చూసి అంత మరిచిన. దేవుని దయతో గండం గట్టెక్కింది.  -కామెర విజయ, చిన్నరాస్పల్లి, దహెగాం

బిడ్డను చూస్తానో లేదోనని భయపడ్డా

పురిటి నొప్పులు రావడంతో దవాఖానాకు తీసుకుపోయేందుకు నా భర్త, ఆడపడుచు, ఆశావర్కర్ ఆటో ఎక్కించారు. 5 కిలోమీటర్ల దూరం వెళ్లేసరికి అక్కడ కోయపల్లి వాగు మీద ఉన్న బ్రిడ్జి కాడ రోడ్డు తెగి ఆటో ముందుకు వెళ్లలేదు. అక్కడే బ్రిడ్జి మీద దించారు. గంటన్నరసేపు విలవిలా కొట్టుకున్నా అంబులెన్స్ రాలేదు. నొప్పుల బాధ పుట్టే బిడ్డ కోసం భరించిన. అసలు నేను బతుకుతానో లేదోనని భయపడ్డా. బ్రిడ్జి మీదే ప్రసవించిన. కండ్ల ముందు తెగిన రోడ్డు నాకు నరకం చూపింది. నాకు వచ్చిన కష్టం ఎవరికీ రావద్దు. 
– మల్లుబాయి, నాగపల్లి, బెజ్జూర్​మండలం