యూట్యూబ్‌‌ ఛానెల్‌‌​లో.. అంతా ఫ్యామిలీనే

V6 Velugu Posted on Sep 17, 2021

లాక్‌‌డౌన్‌‌లో వచ్చిన ఒక ఆలోచనను వీడియోలుగా చేసింది రమా నందన. ‘ నీ గొంతు వింటే నవ్వొస్తుంది’ లాంటి నెగెటివ్‌‌ కామెంట్లను ఫేస్‌‌ చేసింది. ఆ కామెంట్లనే ఎంకరేజ్‌‌మెంట్‌‌గా తీసుకుని ముందుకు వెళ్లింది. యూట్యూబ్‌‌ ఛానెల్‌‌ పెట్టి లక్షల మంది సబ్‌‌స్క్రయిబర్లను సొంతం చేసుకుంది. యాసతో అందర్నీ నవ్విస్తోంది. ఫ్యామిలీతో కలిసి వీడియోలు చేస్తూ ‘నందూస్‌‌ వరల్డ్‌‌’ గా ఫేమస్‌‌ అయ్యింది.   ఆమెను ఇంటర్వ్యూ చేస్తే తన యూట్యూబ్‌‌ జర్నీ గురించి చెప్పింది. 

అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది?

నేను పుట్టి పెరిగిందంతా గుంటూరులోనే. పెళ్లయ్యాక యూకే వచ్చాను. ఇక్కడ 15 ఏండ్లు జాబ్‌‌ కూడా చేశా. లాక్‌‌డౌన్‌‌ అన్నప్పుడు చాలామంది బోర్‌‌‌‌ ఫీలయ్యారు. కొందరు బాధపడ్డారు. అలాంటి వాళ్లందరికీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌‌తోనే హ్యాపీగా ఉండొచ్చని చెప్పాలనుకున్నా. ఇంట్లో వాళ్ల మధ్య జరిగే కొన్ని సిచ్యుయేషన్స్‌‌ చాలా ఫన్నీగా ఉంటాయి. మొగుడు, పెళ్లాలు మాట్లాడుకునే మాటలు, వాళ్ల మధ్య గిల్లికజ్జాలు భలే నవ్వు తెప్పిస్తాయి. వాటి గురించి నలుగురికీ చూపించాలి అనుకున్నా. అందుకు తగ్గట్టుగా వీడియోలు తీస్తున్నా. అందుకే, మా ఫ్యామిలీ మొత్తం వీడియోల్లో కనిపిస్తాం. వాటికి చాలా మంచి రెస్పాన్స్‌‌ వస్తోంది కూడా. ఇండియాలోని తెలుగువాళ్లతో పాటు వేరే దేశాల్లోని వాళ్లు కూడా బాగానే చూస్తున్నారు.

మీతోపాటు పిల్లలు కూడా చేస్తున్నారు. అదెలా వీలవుతోంది? 

మా అబ్బాయి రోహన్‌‌కి సినిమా, యాక్టింగ్‌‌ అంటే చాలా ఇంట్రెస్ట్‌‌. యాక్టింగ్‌‌ చేసే ఛాన్స్‌‌ రావడంతో హ్యాపీగా ఫీల్‌‌ అవుతున్నాడు. పాప పేరు రీనా. చిన్నదైనా చాలా బాగా సపోర్ట్‌‌ చేస్తుంది. నా హజ్బెండ్‌‌ మధుకర్‌‌‌‌ ఎంకరేజ్‌‌ చేశాడు. మధు సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌. ఇప్పుడు వర్క్‌‌ఫ్రమ్‌‌ హోం కావడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. పిల్లల చదువులు, మధు వర్క్‌‌కు ఇబ్బంది లేకుండా వీడియోలు తీయడానికి టైంటేబుల్‌‌ వేసుకుంటాం. వారానికి రెండు వీడియోలు చేయాలని టార్గెట్. యూకే వచ్చిన కొత్తలో పదిహేనేండ్లు జాబ్‌‌ చేశా. యూట్యూబ్‌‌ వీడియోలు చేయడం కోసం ఆ జాబ్‌‌ మానేశా. జాబ్‌‌ కంటే నాకు ఇవి చేయడంలోనే సంతృప్తి, ఆనందం ఉన్నాయనిపించింది. నేను ‘జాబ్‌‌ మానేస్తా’ను అన్నప్పుడు కూడా ‘నీకు నచ్చింది చెయ్యి’ అన్నాడు మధు.

 వీడియోలు ఎవరు తీస్తారు? 

కెమెరా లేదు. అన్నీ ఫోన్‌‌లోనే షూట్‌‌ చేస్తాం. ఫోన్‌‌ను ట్రైపాడ్‌‌కు కనెక్ట్‌‌ చేసి వీడియోలు తీస్తాం. మధునే మా డీఓపీ. నలుగురం కలిసి చేసినప్పుడు మాత్రం రిమోట్‌‌ కంట్రోల్‌‌ ట్రైపాడ్‌‌ వాడతాం. మనకున్న లిమిట్స్‌‌లో,  ఉన్న నాలెడ్జ్‌‌తో ఏ పనైనా చేయొచ్చని   మా పని మేమే చేసుకుంటాం. 

  స్క్రిప్ట్‌‌ ఎవరు రాస్తారు? 

స్క్రిప్ట్‌‌  నేనే రాస్తా. నేనే డైరక్ట్‌‌ చేస్తాను. ఛానెల్‌‌ను సొంతంగా నడుపుతున్నప్పుడు వీడియో ఎడిటింగ్‌‌, తంబ్‌‌ నెయిల్స్‌‌ కూడా నేనే చేసుకునేదాన్ని. ‘తమాడా మీడియా’తో కొలాబరేట్ అయ్యాక వీడియో ఎడిటింగ్‌‌, తంబ్‌‌నెయిల్స్‌‌ వర్క్‌‌ వాళ్లు చూసుకుంటున్నారు. తమాడా వాళ్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాత   రీచ్‌‌ బాగా పెరిగింది.  

 రెస్పాన్స్‌‌ ఎలా ఉంది? 

చాలా మంచి రెస్పాన్స్‌‌ వస్తోంది. వేరే వేరే దేశాల్లో ఉన్న తెలుగు వాళ్లంతా నా వీడియోలు చూస్తున్నారు. షాపింగ్‌‌కి బయటికి వెళ్తే తెలుగు వాళ్లు నన్ను గుర్తుపట్టి ఫొటోలు దిగుతున్నారు. నాతో నా వీడియోల గురించి మాట్లాడుతున్నారు. యూకేలో నా కొలిగ్స్‌‌ కొందరు ‘వీడియోలకు సబ్‌‌టైటిల్స్‌‌ ఉంటే మేమూ ఎంజాయ్‌‌ చేస్తాం’ అని అడుగుతున్నారు. అందుకే, ఇక నుంచి వీడియోలకు సబ్‌‌టైటిల్స్‌‌ ఇవ్వాలనుకుంటున్నాం. ఓటీటీలో రిలీజవ్వబోతున్న ఒక సినిమాలో కూడా ఛాన్స్‌‌ వచ్చింది. కొన్ని సీన్లు ఇంట్లోనే షూటింగ్‌‌ చేసి పంపుతున్నాం.  

 మీ ఫ్యామిలీ మెంబర్స్‌‌ ఏమన్నారు?

నాది లవ్‌‌మ్యారేజ్‌‌. మధు నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటాడు. ఆయన సపోర్ట్‌‌తోనే ఈ వీడియోలు చేయగలుగుతున్నా. కాలేజీలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్‌‌, ఊళ్లో వాళ్లంతా నా గొంతును వెక్కిరించేవారు. అది గుర్తుపెట్టుకున్న మా అమ్మ ‘ఎలాంటి కామెంట్స్‌‌ వచ్చినా రిసీవ్‌‌ చేసుకుంటేనే మొదలుపెట్టు లేకుంటే వద్దు’ అంది. మా అత్తమ్మ వాళ్లు మొదట్లో ‘అందరూ ఎలా రిసీవ్‌‌ చేసుకుంటారో ఏమో’ అని భయపడ్డారు. కానీ, ఇప్పుడు అందరూ నాకు చాలా సపోర్ట్‌‌ చేస్తున్నారు. వీడియో అప్‌‌లోడ్‌‌ చేశాక, చూసి ఫోన్‌‌చేసి మరీ అభినందిస్తున్నారు. మధు, నేను చేసే ఫన్నీ వీడియోలని మా అత్తగారు చాలా ఇష్టపడతారు. మా అక్క, వదిన, ఫ్రెండ్స్‌‌ అంతా ‘జాబ్‌‌ మానేసి ఏంటి ఈ పిచ్చిపని?’  అన్నారు మొదట్లో. కానీ, తర్వాత నాకు వచ్చిన రెస్పాన్స్‌‌, నేను చేసిన వీడియోలు చూసి హ్యాపీగా ఫీల్‌‌ అవుతున్నారు.  

 వేరే దేశం వెళ్లినా యాస మారలేదు?

నేను గుంటూరు జిల్లా వడ్లమూడిలో పుట్టా. ఆ తర్వాత అమ్మా నాన్న ఉద్యోగాల కోసం విజయవాడ వెళ్లారు. నేను అమ్మమ్మ, తాతయ్య దగ్గరే పెరిగా.  ఇరవై ఏండ్లు ఇండియాలోనే ఉన్నా. ఇక్కడికి వచ్చి పద్దెనిమిదేండ్లు అయ్యింది. కానీ, నా తెలుగు యాసలో మాత్రం మార్పు రాలేదు. నా యాసను, కల్చర్​ను ఎప్పుడూ మర్చిపోను. పిల్లలకు కూడా తెలుగు నేర్పిస్తున్నా. ఇక్కడ (యూకేలో) పుట్టిన వాళ్లు ఇక్కడిలా బతుకుతున్నప్పుడు. అక్కడ (ఇండియాలో) పుట్టిన నేను అక్కడలానే ఉండాలనుకుంటా కదా.  

  మీకు బాగా పేరు తెచ్చిన వీడియో?

‘ఎన్నారై హజ్బెండ్‌‌, విలేజ్‌‌ వైఫ్‌‌’ వీడియోకి మంచి రెస్పాన్స్‌‌ వచ్చింది. ఫ్యామిలీతో కలిసి, అన్నీ ఫ్యామిలీ కాన్సెప్ట్స్‌‌ చేస్తా. ప్రతి వీడియో చివర్లో ఏదో ఒక మెసేజ్‌‌ కూడా చెబుతున్నా. బహుశా అందుకే కాబోలు వీడియోలు అందరికీ బాగా నచ్చుతాయి. మీ వీడియోల కోసం మా ఫ్యామిలీ అంతా ఎదురు చూస్తున్నాం మేడం’’, “ అందరం కలిసి కూర్చుని మరీ మీ వీడియోలు చూస్తాం’ అని కామెంట్స్‌‌ పెడుతుంటారు. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది.


నెగెటివ్‌‌ కామెంట్స్‌‌ వస్తుంటాయా?

చాలా వస్తాయి. నిజానికి నేను వాటి నుంచే చాలా నేర్చుకున్నా. నేను ఫస్ట్‌‌ వీడియో చేసినప్పుడు “ నీకు, నీ గొంతుకు సంబంధమే లేదు. నీ గొంతు వింటే నవ్వొస్తుంది” అని కామెంట్‌‌ పెట్టారు ఒకరు. అది చూసి నేను ఫీల్‌‌ అవ్వలేదు. ‘ఓహో నా గొంతుతో జనాన్ని నవ్వించొచ్చా?’ అనుకున్నా. ఫన్నీ వీడియోలు చేసి అందర్నీ నవ్వించాలనే ఉద్దేశంతో  వీడియోలు చేయాలని డిసైడ్‌‌ అయ్యా. వీడియోల కింద పెట్టే ప్రతి కామెంట్‌‌ కచ్చితంగా చదువుతా. అన్నింటికీ రిప్లై ఇవ్వడానికి ట్రై  చేస్తా.  కామెంట్లు చదవడం కోసమే రెండు గంటల టైం కేటాయిస్తా.  వర్కింగ్‌‌ ఉమెన్‌‌ కేవలం వర్క్‌‌ చేస్తుందని, హౌస్‌‌వైఫ్‌‌ కేవలం ఇంటికే పరిమితం అని అనుకోకూడదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్‌‌ ఉంటుంది. దానికి భర్త, ఫ్యామిలీ సపోర్ట్‌‌ తోడైతే ఆడవాళ్లు అద్భుతాలు సృష్టించగలరు. టాలెంట్‌‌ను నిరూపించు కునేందుకు యూట్యూబ్‌‌ మంచి ఫ్లాట్‌‌ఫామ్‌‌. ఫ్యామిలీ సపోర్ట్‌‌ చేస్తే ఎంతోమంది ఆడవాళ్లు అద్భుతాలు చేస్తారు. 

 

 

::: తేజ తిమ్మిశెట్టి

Tagged life, family, acting, youtube channel,

Latest Videos

Subscribe Now

More News