కాళేశ్వరం నీళ్లు పాయె

కాళేశ్వరం నీళ్లు  పాయె

మూడు నెలల్లో 600 టీఎంసీలు సముద్రంపాలు
ఎత్తిపోసిన 32 టీఎంసీలు కూడా కిందికే
జూన్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు ఖుల్లా
గోదావరి అన్ని ప్రాజెక్టుల గేట్లు రెండోసారి ఓపెన్​
మూడేండ్లలో కరెంట్​ బిల్లులకు రూ. 2 వేల కోట్లు

లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చుపెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వరుసగా మూడో ఏడాది కూడా ఫెయిలైంది. ఈ వానాకాలం సీజన్​లోనూ ఒక్క ఎకరానికీ నీళ్లివ్వలేదు. జూన్​లో 20 రోజుల పాటు మోటర్లు నడిపించి 32 టీఎంసీలు లిఫ్టు చేసినా.. ఆ తర్వాత భారీ వర్షాలు పడి వరదలు రావడంతో ఎత్తిపోసిన నీళ్లన్నీ కిందికి వదిలేశారు. జులై 4న బంద్​పెట్టిన కాళేశ్వరం మోటర్లను ఇప్పటికీ చాల్ జేయలేదు. అప్పటి నుంచి మేడిగడ్డ బ్యారేజీ గేట్లు ఓపెన్​గానే ఉండడంతో 600 టీఎంసీల నీళ్లు సముద్రంపాలయ్యాయి. గోదావరిపై ఎస్సారెస్పీ మొదలుకొని ఎల్లంపల్లి, మేడిగడ్డ వరకు, అటు మిడ్​మానేరు మొదలుకొని ఎల్​ఎండీ వరకు ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. ఇప్పుడు కురుస్తున్న వానలతో ఈ సీజన్​లో రెండోసారి మళ్లీ అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీళ్లను కిందికి వదిలేస్తున్నారు.

వెలుగు, నెట్​వర్క్: రాష్ట్ర ప్రభుత్వం కోట్లు పోసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లన్నీ సముద్రం పాలవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏటా 225 టీఎంసీల గోదావరి నీటిని లిఫ్ట్ చేసి 40 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ 2019‒20లో 60 టీఎంసీలు, 2020‒21లో కేవలం 32 టీఎంసీల నీళ్లనే లిఫ్ట్ చేసింది. 2019-–20లో మొదట ఎత్తిపోసిన నీళ్లను భారీ వర్షాల కారణంగా కిందికి వదలాల్సి వచ్చింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో 2020–-21 సీజన్ ప్రారంభంలో ప్రభుత్వం పంపులు ఆన్​చేసే విషయంలో ‘వెయిట్ అండ్ సీ’ అన్నట్లుగా వ్యవహరించింది. అదే టైమ్​లో భారీ వర్షాలు పడి, ప్రాజెక్టుల్లోకి నీళ్లు రావడంతో పంపులను నడపలేదు. చివర్లో ఎత్తిపోద్దామన్నా ప్రాణహిత దగ్గర నీళ్లు లేకుండా పోయాయి. ఈసారి రుతుపవనాలు త్వరగా ప్రవేశించడంతో జూన్ ప్రారంభంలోనే రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. మహారాష్ట్రలో కూడా వానలు పడటంతో ప్రాణహిత నదికి వరదలు వచ్చాయి. దీంతో జూన్ 16న ఆఫీసర్లు మోటర్లు స్టార్ట్ చేసి, జులై 4 దాకా నడిపించారు. మొత్తం 20 రోజుల్లో 32 టీఎంసీల నీళ్లను అన్నారం బ్యారేజీలోకి, అక్కడ్నుంచి సుందిళ్ల బ్యారేజీలోకి 29.72 టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేశారు. సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి, ఎల్లంపల్లి నుంచి మిడ్​మానేరుకు 23.32 టీఎంసీలు ఎత్తిపోశారు. కానీ భారీ వర్షాల కారణంగా జులై మూడోవారంలో అన్ని ప్రాజెక్టుల గేట్లు ఓపెన్​ చేయడంతో ఎత్తిపోసిన నీళ్లన్నీ కిందికి వదిలేశారు. దీంతో గడిచిన మూడేళ్లలో కాళేశ్వరం కరెంట్​బిల్లుల రూపంలో 2 వేల కోట్లు మీదపడడం తప్ప ఎలాంటి లాభం లేకుండా పోయింది.

యాసంగిలో ఒక్క ఎకరాకూ నీళ్లియ్యలే
కాళేశ్వరం ద్వారా 13 జిల్లాల్లో 18,25,700 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లిస్తూ 18.5 లక్షల పాత ఆయకట్టును స్థిరీకరిస్తా మని సర్కారు చెప్పింది. అదనపు టీఎంసీ ఎత్తిపోతల పనులతో కలిపి కాళేశ్వరం అంచనా వ్యయం రూ. లక్షా 20 వేల కోట్లకు చేరింది. కానీ ఈ మూడేళ్లలో కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు కూడా కొత్తగా నీళ్లివ్వలేక పోయింది. యాసంగిలో 2.50 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని టార్గెట్​గా పెట్టుకున్నారు. రంగనాయకసాగర్ కింద కొత్త ఆయకట్టు తేవాలనుకున్నా డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం పూర్తవక సాధ్యపడలేదు. 

ఈసారి జులై మూడోవారంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో గోదావరి, దాని ఉపనదులపై ప్రాజెక్టులన్నీ నిండడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ఒక దశలో జులై 22 నుంచి 24వ తేదీ వరకు ఎస్సారెస్పీకి 8 ఏండ్ల తర్వాత రికార్డు స్థాయిలో వరదలు రావడంతో మూడురోజుల్లోనే ప్రాజెక్టు నిండి గేట్లు ఎత్తారు. మూడు రోజులుగా కురుస్తున్న వానలకు మరోసారి గోదావరి బేసిన్​లోని ప్రాజెక్టులన్నీ నిండడంతో ఆఫీసర్లు గేట్లు ఖుల్లా పెట్టారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలోకి మహారాష్ట్ర నుంచి 86,530 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా, 24  గేట్లను ఓపెన్‌‌ చేసిన ఆఫీసర్లు 99,980 క్యూసెక్కుల నీటిని రిలీజ్​ చేస్తున్నారు. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటిసామర్థ్యం ‌‌90 టీఏంసీలు కాగా, ప్రస్తుతం 89 టీఎంసీల నిల్వ ఉంది. ఎల్లంపల్లికి 1,68,678 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా, 22 గేట్లు ఎత్తి 1,30,095 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పార్వతి బ్యారేజీకి 56,685 క్యూసెక్కుల వరద వస్తుండగా 55 గేట్లు తెరిచి 1,07,890 క్యూసెక్కుల నీటిని సరస్వతి బ్యారేజ్ లోకి వదిలేస్తున్నారు. సరస్వతి బ్యారేజీ దగ్గర 1.18 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉండగా, 46 గేట్లు తెరిచి 67,500 క్యూసెక్కుల నీటిని లక్ష్మీ బ్యారేజీకి రిలీజ్ చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీకి 1.65 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉండగా 44 గేట్లను తెరిచి 2.9 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రం వైపు విడిచిపెడుతున్నారు. మిడ్ మానేర్ లోకి  23 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 8 గేట్లు ఎత్తి ఎల్ఎండీకి 18,760 క్యూసెక్కులు రీలీజ్ చేస్తున్నారు. ఎల్ ఎండీ పూర్తిస్థాయిలో నిండడంతో12 గేట్లను ఎత్తి దిగువకు 66 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎల్ఎండీ నుంచి ఈ సీజన్​లో ఇప్పటికే 17 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు. జూన్ నుంచి ఇప్పటిదాకా మేడిగడ్డ నుంచి 600 టీఎంసీల నీటిని వదిలారు.