2500 కిలోల చాక్లెట్ గణేషుడు.. నిమజ్జనం ఎలా చేస్తారంటే..

2500 కిలోల చాక్లెట్ గణేషుడు.. నిమజ్జనం ఎలా చేస్తారంటే..

దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా గణేషుడు కొలువుదీరాడు. ఏపీలోని విశాఖపట్నంలో చాక్లెట్తో చేసిన ప్రత్యేక గణపతి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విశాఖపట్నంలోని  విశాఖ బీచ్ రోడ్డులో ఈ గణేషుని ప్రతిష్టించారు.  ఈ విగ్రహాన్ని 2500 కిలోల చాక్లెట్ తో తయారు చేశారు. 

విశాఖ తీరంలో నేవీ అధికారి లక్ష్మణ్ ప్రతి సంవత్సరం ఈ గణేష్ చతుర్థిని ప్రత్యేకంగా జరుపుకుంటారు. పర్యావరణానికి అనుకూలమైన వినాయకుడిని ప్రతిష్టించడం ద్వారా సమాజానికి మంచి సందేశం ఇవ్వాలన్నది లక్ష్మణ్ ఉద్దేశం. ఈసారి కూడా ప్రత్యేక గణేషుడిని ప్రతిష్టించాలని నిర్ణయించిన లక్ష్మణ్ చాక్లెట్ గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించాలనే ఆలోచన వచ్చింది.  వెంటనే ముంబై నుంచి చాక్లెట్ తెప్పించారు. మొదట వెయ్యి కిలోల చాక్లెట్ ఆర్డర్ చేశారు. చివరికి విగ్రహాన్ని తయారు చేసేందుకు 2500 కిలోలు పట్టింది. విగ్రహాన్ని తయారు చేసేందుకు అండమాన్ నుంచి శిల్పులను తీసుకువచ్చారు. ఈ విగ్రహం తయారీకి నాలుగు వారాలు పట్టింది. ఈ విగ్రహం తయారిలో చాక్లెట్ తప్పా మరే పదార్థాలు వాడలేదు. 

అయితే చాక్లెట్ గణేష్ విగ్రహం వేడికి కరిగిపోతుందని.. చాక్లెట్ అస్సలు కరగకుండా ఏసీలు పెట్టించాలని నిర్ణయించుకున్నారు. చాక్లెట్ కరగకుండా ఉండేందుకు అవసరమైన ఉష్ణోగ్రత మైనస్ పది డిగ్రీలు. రెండు భారీ ఏసీలను ఏర్పాటు చేశారు.ఇందుకోసం నిర్వాహకులు రూ. 10 లక్షలు ఖర్చు చేశారు. నిర్వాహకులు లక్ష్మణ్ శ్రమ ఫలించింది. చాక్లెట్ గణేష్ విగ్రహం విశాఖపట్నం కేంద్రంగా ప్రతిష్టించబడింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చాక్లెట్ గణేష్ విగ్రహాన్ని చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. 

అయితే ఈ చాక్లెట్ వినాయక విగ్రహం నిమజ్జనం ప్రత్యేకంగా జరగనుంది.  విగ్రహాన్ని పాలతో కరిగించనున్నారు. కరిగిపోయేవరకు ఈ ప్రక్రియ కొనసాగిస్తారు. భక్తులకు చాక్లెట్ లిక్విడ్ ను ప్రసాదంగా అందజేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. నిమజ్జన తేదీని ఇంకా ప్రకటించలేదు.. త్వరలో ప్రకటిస్తామని అంటున్నారు నిర్వాహకులు లక్ష్మణ్.. ఏది ఏమైనా విశాఖలో కొలువు దీరిని చాక్లెట్ వినాయకుడు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.