కుక్కలను అరికట్టండిఆఫీసర్లకు సీడీఎంఏ ఆదేశం

కుక్కలను అరికట్టండిఆఫీసర్లకు సీడీఎంఏ ఆదేశం

హనుమకొండ, వెలుగు: గ్రేటర్​వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కుక్కలు, కోతులు జనాలకు కునుకులేకుండా చేస్తున్నాయి. కుక్కలు రోడ్లపై గుంపులుగుంపులుగా తిరుగుతూ జనాలపై దాడి చేస్తుండగా.. కోతులు ఇండ్లలోకి చొరబడి సామాన్లు ఎత్తుకెళ్తూ, కనిపించినవారిపై ఎగబడుతున్నాయి. సిటీతో పాటు విలీన గ్రామాల్లోనూ ఇవి బీభత్సం సృష్టిస్తున్నాయి. కుక్కలు, కోతుల కంట్రోల్​కు బల్దియా అధికారులు ఏటా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా ఉంది.

70వేలకు పైగా కుక్కలు..

సిటీలో 70 వేలకు పైగా కుక్కలు ఉన్నట్లు ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. గల్లీకి 10 నుంచి 15 కుక్కలు కనిపిస్తున్నాయి. అటుగా వెళ్లే వారిపై ఇష్టారీతిన దాడి చేస్తున్నాయి. వరంగల్ ఎంజీఎంలో నెలకు ఐదారు వందల మంది కుక్కకాటు బాధితులు వస్తున్నారు. ఇక ప్రైవేటుకు వెళ్లే వారి సంఖ్యా ఎక్కువే. కుక్కలతో పాటు నగరంలో కోతుల సమస్య కూడా తీవ్రంగా  ఉంది. ఇదివరకు సిటీలోని పద్మాక్షి గుట్ట, మెట్టుగుట్ట, వరంగల్ కోట, చింతగట్టు గుట్ట తదితర ప్రాంతాల్లో కోతులు కనిపించేవి. అక్కడ ఆహారం దొరక్క ఇండ్లలోకి చొరబడుతున్నాయి. కుక్కుల బెడద అరికట్టేందుకు ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం.. కొన్ని చోట్ల మొక్కలు నాటి వదిలేసింది. గతంలో హనుమకొండ శివారు భట్టుపల్లిలోని ఓ ప్రభుత్వ హాస్టల్​ లో ఉంటూ చదువుకుంటున్న ఎంసీఏ విద్యార్థిని కోతుల గుంపు గదిలోకి రావడంతో బయటకు పరిగెడుతూ బిల్డింగ్​పైనుంచి పడి మృతిచెందింది. ఆ తర్వాత చింతగట్టు, హసన్​పర్తి, ఆరెపల్లి, పైడిపల్లి, శివనగర్​ తదితర ప్రాంతాల్లో కోతుల జనాలను కరిచిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక కుక్కల నియంత్రణ కోసం ఓ ప్రైవేటు ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఇవ్వగా.. చింతగట్టు సమీపంలోని యానిమల్​బర్త్​ కంట్రోల్​(ఏబీసీ) సెంటర్​ లో డైలీ 25 నుంచి 30 కుక్కలకు స్టెరిలైజేషన్​ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కోతులను పట్టి అటవీ ప్రాంతంలో వదిలేస్తున్నట్లు పేర్కొంటున్నారు. కానీ అసలు కోతులు, కుక్కలను పట్టకుండానే పట్టినట్టు లెక్కలు రాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకచోట పట్టిన కుక్కలను తిరిగి అదే చోట వదలాల్సి ఉండగా.. ఇతర ప్రాంతాల్లో వదిలేయడం వల్ల వాటి మానసిక పరిస్థితి దెబ్బతిని వింతగా ప్రవర్తించడంతో పాటు జనాలపైకి ఎగబడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రూ.లక్షలు పెడుతున్నా ఫలితం శూన్యం..

కుక్కలు, కోతుల కంట్రోల్​ కోసం బల్దియా ఏటా రూ.లక్షలు ఖర్చు చేస్తోంది. కుక్కలకు స్టెరిలైజేషన్, వాటికి ఆహారం, సిబ్బంది వేతనాలు ఇలా అన్నీ కలిపి కాంట్రాక్ట్​ సంస్థకు జీడబ్ల్యూఎంసీ నుంచి ఒక్కో కుక్కకు రూ.800 చొప్పున చెల్లిస్తున్నారు. కాగా గడిచిన ఐదేండ్లలో దాదాపు 10 వేల కుక్కలకు స్టెరిలైజేషన్​ చేసినట్లు సిబ్బంది చెబుతున్నారు. అంటే సుమారు రూ.80 లక్షల వరకు నిధులు కేవలం కుక్కల నియంత్రణకే కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు కోతులను పట్టి వాటిని అటవీ ప్రాంతంలో వదిలేసేందుకుగానూ ఒక్కో కోతికి రూ.400 చొప్పున చెల్లిస్తున్నారు. గడిచిన ఏడాది కాలంలో దాదాపు 4 వేలకు పైగా కోతులను పట్టగా..  రూ.16 లక్షలకుపైగా కాంట్రాక్ట్​ సంస్థకు చెల్లించారు. ఇన్ని నిధులు ఖర్చు చేస్తున్నా నగరంలో కుక్కలు, కోతుల బెడదకు ఆఫీసర్లు ఫుల్​ స్టాప్​ పెట్టలేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇకనైనా నగరంలో అంబర్​ పేట లాంటి ఘటనలు ఇక్కడ చోటుచేసుకోకముందే గ్రేటర్ ఆఫీసర్లు  కోతులు, కుక్కల బెడదకు తగిన పరిష్కార చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

కుక్కలను అరికట్టండిఆఫీసర్లకు సీడీఎంఏ ఆదేశం

కాశిబుగ్గ(కార్పొరేషన్): హైదరాబాద్ లో కుక్కల దాడిలో ఒక బాలుడు మృతి చెందిన నేపథ్యంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ సత్యనారాయణ గురువారం వరంగల్ బల్దియా ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కుక్కలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు కరపత్రాలు పంపిణీ చేయాలన్నారు. బ్యానర్లు, హోర్డింగులు ఏర్పాటు చేయాలన్నారు. కుక్కలకు స్టెరిలైజేషన్ చేయాలన్నారు. వేసవిలో నీళ్లు దొరక్కపోతే దాడులు చేసే చాన్స్ ఉన్నందున నీటి తొట్టెలను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు ఎన్జీవోల సహకారం తీసుకోవాలన్నారు.