కుల గణనకు తెలంగాణ ఒక మోడల్: రాహుల్ గాంధీ

కుల గణనకు తెలంగాణ ఒక మోడల్: రాహుల్ గాంధీ
  • కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నం
  • ఎప్పుడు మొదలు పెడ్తరో చెప్పాలి

దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతోపాటే కుల గణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆకస్మిక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోదీ సర్కారు కుల గణనను 11 ఏండ్లుగా వ్యతిరేకించిందని, ఇప్పుడు ప్రకటన చేసినందున ఎప్పటి నుంచి అమలు చేస్తారో టైమ్ లైన్ చెప్పాలన్నారు. బుధవారం కేంద్రం ప్రకటన తర్వాత ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కుల గణనకు తెలంగాణ ఒక మోడల్ గా నిలుస్తుందన్నారు. 

కేంద్రం కుల గణనకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. అలాగే రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని తాము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నామని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ అన్నారు. ‘‘కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోదీకి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే రెండేండ్ల కిందట.. 2023, ఏప్రిల్ 16న లేఖ రాశారు. 

మేం ఇంకా ఏమైనా చెప్పాల్సింది ఉందా?” అంటూ ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. పోయిన నెల 9న అహ్మదాబాద్ లో జరిగిన సమావేశాల్లో సోషల్ జస్టిస్ అంశంపైనా కాంగ్రెస్ న్యాయపథ్ తీర్మానం చేసిందని గుర్తు చేశారు. ‘‘అసలు ప్రారంభించకపోవడం కంటే.. ఆలస్యంగానైనా మొదలుపెట్టడం మేలు” అని కామెంట్ చేశారు.