
గౌహతి: షూటర్లు మను భాకర్, సౌరభ్ చౌదరి, ఇషా సింగ్.. వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్‌రినుంగా.. స్విమ్మర్ శ్రీహరి నటరాజన్.. ఖేలో ఇండియా గేమ్స్‌తో వెలుగులోకి వచ్చి ప్రపంచ వ్యాప్తంగా పలు మెగా టోర్నీలో సత్తా చాటుతున్న యువ క్రీడాకారులు. వీరి బాటలో నడిచేందుకు, తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునేందుకు ఇప్పుడు దేశవ్యాప్తంగా వేలాది మంది యువ ప్లేయర్లు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మూడో ఎడిషన్ బరిలో నిలిచారు. యువతలో టాలెంట్‌ను గుర్తించి, వారిని భావి చాంపియన్లుగా తీర్చిద్దడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్ శుక్రవారం మొదలవనుంది. ఈ నెల 22 వరకు జరిగే గేమ్స్‌లో కేంద్ర పాలిత ప్రాంతాలు సహా 35 రాష్ట్రాల నుంచి 6500 పైచిలుకు క్రీడాకారులు.. 20 క్రీడాంశాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అండర్–17, అండర్–21 ఏజ్ గ్రూపుల్లో బాలబాలికలకు పోటీ జరగనున్నాయి. శుక్రవారం జరిగే ఓపెనింగ్ సెర్మనీలో స్టార్ అథ్లెట్ హిమాదాస్ టార్చ్ బేరర్‌గా వ్యవహరించనుంది. ట్రాక్‌పై ఆమె పోటీ పడకపోయినా.. జార్ఖండ్‌కు చెందిన ఆర్చర్ కోమలికా బారి వంటి పలువురు స్టార్ ప్లేయర్లు బరిలో నిలిచారు. తెలంగాణకు చెందిన బధిర షూటర్ ధనుశ్ శ్రీకాంత్, స్విమ్మర్లు శ్రీహరి నటరాజన్ (కర్నాటక), కుశాగ్ర రావత్ (ఢిల్లీ).. ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు జిష్నా మాథ్యూ (400 మీ.), శ్రీశంకర్ (లాంగ్‌జంప్)పై అందరి దృష్టి ఉంది. గత సీజన్‌లో 228 మెడల్స్ నెగ్గిన మహారాష్ట్ర డిఫెండింగ్ చాంపియన్ హోదాలో 579 మందితో కూడిన స్ట్రాంగ్ టీమ్‌తో పోటీలో ఉండగా, తొలి ఎడిషన్ విన్నర్ హర్యానా 682 మంది అథ్లెట్లతో గౌహతి వచ్చింది.