
నల్గొండ అర్బన్, వెలుగు : జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. మంగళవారం నల్గొండ కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎరువుల ఫిర్యాదుల కేంద్రాన్ని, టోల్ ఫ్రీ నంబర్ 18004251442 ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ యూరియాను వ్యవసాయ పనులకు కాకుండా ఇతర పనులకు దారి మళ్లిస్తే దుకాణ యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఆగస్టు మొదటి వారంలో నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాలకు సాగునీరు వస్తుందని, దీంతో జిల్లాలో అవసరమైనన్ని ఎరువులను సరఫరా చేసేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎరువుల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెలాఖరులోపు జిల్లాకు 3 వేల మెట్రిక్ టన్నుల యూరియా రానున్నదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్, అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.