- ఎడతెరిపి లేని వాన
- అనేక చోట్ల తడిసిన ధాన్యం
- నేలవాలిన వరి పైర్లు
- దెబ్బతిన్న పత్తి, సోయా పంటలు
మెదక్/సంగారెడ్డి/సిద్దిపేట, వెలుగు : తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా వర్షంతో రైతులకు నష్టం జరిగింది. కొనుగోలు కేంద్రాల వద్ద, రోడ్ల మీద ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. వరి, పత్తి, సోయా పంటలు దెబ్బతిన్నాయి.
మెదక్ జిల్లాలో...
మెదక్ పట్టణం, రూరల్ మండలం, కొల్చారం, కౌడిపల్లి తదితర మండలాల్లో కొనుగోలు కేంద్రాలు, మెదక్–- బోధన్ నేషనల్ హైవే, మెదక్ –- హైదరాబాద్ నేషనల్ హైవేపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యాయి. శివ్వంపేట మండలం శివ్వంపేట, చిన్న గొట్టిముక్కుల, చెన్నాపూర్, గోమారం, సీతారాం తండా, భీమ్లా తండా గ్రామాల్లో ఆరబోసిన వరి ధాన్యం కొట్టుకుపోయింది. మెదక్ మండలం తోగిట, ఔరంగాబాద్, కొల్చారం మండలం నాయిని జలాల్ పూర్, కొంగోడ్ తదితర గ్రామాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పైర్లు నేలకొరిగాయి.
సంగారెడ్డి జిల్లాలో...
సంగారెడ్డి, నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల పరిధిలో కురిసిన వర్షంతో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసిపోయాయి. సంగారెడ్డి, కంది, మునిపల్లి, సదాశివపేట, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్, కంగ్టీ మండలాల్లో వరి, పత్తి, సోయా పంటలు దెబ్బతిన్నాయి. రాయికోడ్ మండలంలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. కుష్నూర్ శివారులోని గురిమిల వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. సింగూర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి 11,877 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. బుధవారం ఇరిగేషన్ అధికారులు 14 నంబర్ గేటును 2 మీటర్లు ఎత్తి 9,649 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.
సిద్దిపేట జిల్లాలో...
జిల్లాలో 137.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, పది మండలాల్లో భారీ వర్షం కురిసింది. జగదేవ్ పూర్ లో 15.8, మర్కుక్ లో 12.1, దౌల్తాబాద్ లో 9.8, అక్కన్న పేటలో 9.7 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల, గజ్వేల్ పట్టణాలతోపాటు పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వర్షాలతో సిద్దిపేట, హుస్నాబాద్ మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిపోవడంతోపాటు వరద నీటిలో కొట్టుకపోయింది. జిల్లాలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలతోపాటు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసింది. హుస్నాబాద్ బస్టాండ్ లోకి పద్ద ఎత్తున వరద నీరు రావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.
