
ఉమ్మడి మెదక్ జిల్లాలోని చాలా ప్రాంతాలలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వాన కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు పంటలు దెబ్బతిన్నాయి. ధాన్యం తడుస్తోంది. పాత ఇండ్లు కూలుతున్నాయి.
మెదక్, వెలుగు : మెదక్ జిల్లా కొల్చారం మండలం రాంపూర్, కిష్టాపూర్, పోతంశెట్ పల్లి, చిన్న ఘనపూర్ గ్రామాల పరిధిలో కోతకు సిద్ధమైన వరి వర్షం దాటికి నేలకొరిగింది. వడ్లు నాని మొలకలు వస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పలు చోట్ల ధాన్యం తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాలు దీపావళి తరువాత ప్రారంభిస్తామని అధికారులు తెలపడంతో మరో పది రోజులు ధాన్యాన్ని ఎలా కాపాడుకోవాలని రైతులు వాపోతున్నారు.
జలదిగ్బంధంలో ఏడుపాయల ఆలయం
పాపన్నపేట, వెలుగు : ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. సింగూర్ నుంచి ఇరిగేషన్ఆఫీసర్లు మూడు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు. సింగూర్ నీటితో పాటు కురుస్తున్న భారీ వర్షాలతో మెదక్ జిల్లాలోని వనదుర్గ ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. నీళ్లు దుర్గమ్మ ఆలయాన్ని చుట్టుముట్టాయి. దీంతో ఆఫీసర్లు ఆలయంలో నుంచి హూండీలతో పాటు విలువైన వస్తువులను కార్యాలయానికి తరలించారు. దుర్గమ్మ రాజగోపురంలోనే పూజలు అందుకుంటోంది.
దెబ్బతిన్న కల్వర్టులు..
సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా శనివారం 20.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, హత్నూర మండలంలో అత్యధికంగా 56.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రామచంద్రపురం, అమీన్ పూర్, సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్, పుల్కల్, మనూర్, కోహిర్ మండలాల్లోని పలు ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లడంతో కల్వర్టులు దెబ్బతిన్నాయి. సంగారెడ్డి, రామచంద్రపురం లోతట్టు ప్రాంతాల్లోని పలు ఇండ్లలోకి నీళ్లొచ్చాయి. జిన్నారం మండలంలో రెండు ఇండ్లు కూలిపోయాయి.
సింగూర్‌కు పెరిగిన వరద..
పుల్కల్, వెలుగు : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్ట్‌కు శనివారం వరద తాకిడి భారీగా పెరిగింది. దీంతో 19467 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంటంతో రెండు గేట్లను ఎత్తి 29585 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 2647 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మొత్తం 32232 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు డిప్యూటీ ఈఈ నాగరాజు, ఏఈఈ మాహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 29.184 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
పొంగిపొర్లిన వాగులు.. చేన్లలో నిలిచిన నీళ్లు
సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా శుక్రవారం అర్థరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. పలు వాగులు, చెరువులు, చెక్ డ్యామ్ లు పొంగిపొర్లుతున్నాయి. హుస్నాబాద్ డివిజన్ పరిధిలో వేరు శనగ, పత్తి చేన్లలో నీళ్లు నిలిచాయి. జిల్లా వ్యాప్తంగా 45.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాలు నీటమునగడంతో స్థానికులు ఇబ్బందిపడ్డారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు మత్తడి దూకడంతో రోడ్డు పైనుంచి భారీగా నీళ్లు వెళ్తున్నాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
శిథిలావస్థలో స్కూలు.. అద్దె ఇంట్లో పాఠాలు
మెదక్ (మనోహరాబాద్), వెలుగు : పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి కూలే స్థితి ఉండటంతో టీచర్లు అద్దె ఇంట్లో పాఠాలు చెబుతున్నారు. ఈ పరిస్థితి జిల్లా పరిషత్ చైర్పర్సన్ సొంత మండలంలో నెలకొనడం గమనార్హం. మనోహరాబాద్ మండలం గౌతోజిగుడ గ్రామంలోని మండల పరిషత్ స్కూల్ లో 1 నుంచి 5వ తరగతి వరకు ఉండగా, మొత్తం 42 మంది స్టూడెంట్స్ ఉన్నారు. కాగా, స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థకు చేరింది. తరగతి గదుల్లో, వరండలో పైకప్పు నుంచి సిమెంట్ పెచ్చులూడి పడుతున్నాయి. దీంతో ప్రమాదం పొంచి ఉందని కొద్ది రోజులుగా గ్రామంలోని ఓ ఇంట్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇది చాలా ఇబ్బంది కరంగా ఉన్నందున సంబంధిత అధికారుల స్పందించి తగుచర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
మెదక్ టౌన్, వెలుగు : మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ పట్టణంలో జరిగింది. మెదక్ టౌన్ సీఐ మధు తెలిపినప్రకారం.. పట్టణంలోని జంబికుంటకు చెందిన నూగూరి వెంకటేశం (50) స్థానికంగా హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల అతడు మద్యానికి బానిసై భార్యాపిల్లలను రోజూ కొడుతున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల కింద అతడిని వదిలేసి భార్య, పిల్లలు హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. దీంతో మద్యం తాగేందుకు డబ్బులు లేవని వెంకటేశం ఇంట్లో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు భార్యకు సమాచారం ఇచ్చారు. మృతుడు భార్య వినీత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
‘దళితబంధు’తోఆర్థికంగా ఎదగాలి
కంది, వెలుగు : దళితబంధు పథకంతో లబ్ధిదారులు ఆర్థికంగా బలోపేతమై మిగతావారికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. శనివారం కలెక్టర్ క్యాంపు ఆఫీసులో దళిత బంధు పథకంలో వివిధ యూనిట్ల లబ్ధిదారుల స్థితిగతులు, అభివృద్ధి, లాభాల పురోగతి తదితర అంశాలపై అడిషనల్ కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, దళితబంధు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారులు తాము తీసుకున్న యూనిట్ తో సక్సెస్ సాధించేలా చూడాల్సిన బాధ్యత ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలపైపే ఉందన్నారు. లబ్ధిదారులకు అందించిన ప్రతి యూనిట్ నూ ఎంపీడీవోలు పరిశీలించాలని సూచించారు. లబ్ధిదారులను కలిసి ముఖాముఖి మాట్లాడి, సమగ్రంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబురావు, నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, డీఆర్డీవో పీడీ శ్రీనివాసరావు, డీపీవో సురేశ్‌మోహన్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీసీవో ప్రసాద్, పరిశ్రమల శాఖ జీఎం ప్రశాంత్ కుమార్, వ్యవసాయ శాఖ జేడీ నరసింహారావు, ఉద్యాన శాఖ అధికారి సునీత, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.
కబ్జా నుంచి భూములను కాపాడండి
తహసీల్దార్ ఆఫీస్ ఎదుట రైతుల ఆందోళన
మెదక్ (శివ్వంపేట), వెలుగు: రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ భూములు కబ్జా చేస్తున్నారని, ఆఫీసర్లు స్పందించి కాపాడాలని శివ్వంపేట మండలం సికింద్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధి పిట్టలవాడకు చెందిన రైతులు శనివారం తహసీల్దార్ఆఫీస్ ఎదుట ఆందోళన చేశారు. ఆఫీసర్లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే నంబర్ 192, 193, 194, 195, 196, 197లో దాదాపు 80 ఎకరాలు తమ తాతతండ్రుల కాలం నుంచి సాగు చేసుకుంటున్నామన్నారు. ఇప్పుడు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చి ఆ భూమి కబ్జా చేయడానికి కడీలు వేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇండ్లులేని తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా అదే భూమిలో కట్టించారని, ఇపుడేమో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చి ఇది తమ భూమి కాదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పోయినా సరే భూమి మాత్రం వదిలేది లేదని స్పష్టం చేశారు. వెంటనే ఆఫీసర్లు సర్వే చేసి బాధితులకు న్యాయం చేయాలని గ్రామ ఉప సర్పంచ్ సుధాకర్‌రెడ్డి కోరారు.
సిద్దిపేటలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్
భవన నిర్మాణానికి 4 కోట్లు మంజూరు
సిద్దిపేట, వెలుగు : ఒంటరి మహిళలు, ఉద్యోగాలు చేసే మహిళల వసతి కోసం సిద్దిపేట లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఏర్పాటు చేయనున్నారు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేసింది. సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద నిర్మించే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ శాశ్వత భవనం నిర్మాణానికి త్వరలోనే మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో కులం, మతం, వైవాహిక స్థితి మొదలైన వాటికి ఎటువంటి తేడా లేకుండా శ్రామిక మహిళలందరికీ
అడ్మిషన్ ఇవ్వనున్నారు.
అబ్దుల్ కలామ్‌కు ఘన నివాళి
మెదక్‌టౌన్, వెలుగు : భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ జయంతి సందర్భంగా శనివారం మెదక్ జిల్లా స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాతా, శిశు ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ కవితా రెడ్డి, ఫౌండేషన్ ప్రెసిడెంట్ జుబేర్ అహ్మద్, టీఆర్ఎస్ నాయకులు రామకృష్ణ, జిల్లా స్పోర్ట్స్ ఫౌండేషన్ కన్వీనర్ నందిని శ్రీనివాస్, సభ్యులు సకిలం శ్రీనివాస్, కొండ శ్రీనివాస్, శివ నాగు, శ్రావణ్, వంశీ, ఒమర్, గణేశ్ పాల్గొన్నారు.
సైబర్ క్రైమ్స్‌పై ప్రజలకు అవేర్‌నెస్
మెదక్‌టౌన్/కంది/సిదిపేట రూరల్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించి చైతన్య పరచడమే లక్ష్యంగా పోలీసులు పని చేస్తున్నారని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, సంగారెడ్డి అడిషనల్ ఎస్పీ ఉషా విశ్వనాథ్ అన్నారు. శనివారం మెదక్ఎస్పీ ఆఫీసులో సైబర్ నేరాలపై అవగాహన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ సైబర్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ అక్టోబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో షీ టీమ్‌తో పాటు కళాబృందంతో మహిళా సేఫ్టీ వింగ్ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. సైబర్ నేరం జరిగితే వెంటనే జాతీయ సైబర్ హెల్ప్ నంబర్ 1930కి ఫోన్ చేయాలని సూచించారు. సంగారెడ్డి ఎస్పీ ఆఫీసులో సైబర్ అవేర్‌నెస్ మంన్త్ అక్టోబర్ 2022 క్యాలెండర్‌ను ఎస్పీ ఉషా విశ్వనాథ్ ఆవిష్కరించి మాట్లాడారు. వివిధ వేధింపులకు గురయ్యే మహిళలు, విద్యార్థినులు షీ-టీం సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సిద్దిపేటలో సీపీ శ్వేత ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఏబీ దుర్గ పట్ణంలోని శ్రీవాణి హైస్కూల్ లో స్టూడెంట్స్ కు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
ఆర్థిక ఇబ్బందులతో..
మెదక్ (చేగుంట), వెలుగు : ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన వీరయ్య (50) భార్య అనారోగ్యానికి గురికావడంతో ట్రీట్మెంట్ కోసం అప్పులు చేశాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక రోజూ బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య వసంత ఫిర్యాదు మేరకు చేగుంట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రాజస్థాన్ దొంగల ముఠా అరెస్ట్
తూప్రాన్, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడిన రాజస్థాన్ కు చెందిన ముఠాను అరెస్ట్ చేసినట్లు మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. శనివారం తూప్రాన్ డీఎస్సీ ఆఫీస్ లో ఆమె మీడియాకు నిందితుల వివరాలను వెల్లడించారు. వెల్దుర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఎస్సై వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. రాజస్థాన్ కు చెందినకారులో ఇనుప రాడ్లు, నగదును గుర్తించారు. కారులో ఉన్న ఏడుగురిని విచారించగా పలు ఆలయాల్లో దొంగతనాలు పాల్పడినట్లు తేలింది. వెల్దుర్తిలోని ఆంజనేయస్వామి, మాచవరం, బొంతపల్లిలోని వీరభద్రస్వామి, శెట్టిపల్లి కలాన్ వీరభద్ర స్వామి ఆలయాలలో దొంగతనాలు చేసినట్లు వారు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి మారుతి వ్యాన్, రూ.21 వేలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇందుకు సహకరించిన డీఎస్పీ యాదగిరి రెడ్డి, సీఐ శ్రీదర్, వెల్దూర్తి ఎస్సై, పోలీసులను ఆమె అభినందించారు.
మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయం
నర్సాపూర్, వెలుగు : టీఆర్ఎస్ కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా మునుగోడులో బీజేపీ గెలవడం ఖాయమని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందన్నారు. అధికార పార్టీ నాయకులు హైదరాబాద్ చుట్టూ ఉన్న కోట్ల విలువైన భుములను అమ్ముకుంటూ విదేశాలలో పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు. మనుగోడులో సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ నాయకుల కొనుగోళ్ల పర్వం కొనసాగుతుందన్నారు. వారు ఎన్ని కుట్రలు చేసినా రాజగోపాల్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో కౌన్సిలర్ గోడ రాజేందర్, బీజేపీ సీనియర్ నాయకులు బాల్‌రెడ్డి ఉన్నారు.