విద్యార్థులను డిస్టర్బ్ చేస్తే ఊరుకునేదిలేదు

విద్యార్థులను డిస్టర్బ్ చేస్తే ఊరుకునేదిలేదు

బాసర: క్యాంపస్ లో నెలకొన్న అన్ని  సమస్యలను పరిష్కిరించడానికి కృషి చేస్తున్నామని బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జీ వీసీ వెంకట రమణ తెలిపారు. త్వరలోనే పరిస్థుతులు సద్దుమణుగుతాయని, అంతవరకు విద్యార్థులు సంయమనంతో ఉండాలని ఆయన కోరారు. క్యాంపస్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ బాసర విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఫుడు పాయిజన్ వ్యవహారంపై విద్యార్థులు తీవ్ర ఆందోళనకు దిగారు. వారికి పేరేంట్స్ కూడా తోడయ్యారు. ఈ నేపథ్యంలో ఇంచార్జీ వీసీ వెంకట రమణ మాట్లాడుతూ... శ్రద్ధగా చదువుకుంటోన్న విద్యార్థులను డిస్టర్బ్ చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. క్యాంపస్ లో నెలకొన్న సమస్యలను పరిష్కిరిస్తున్నామన్న ఆయన... అనవసరంగా బయటివాళ్ల మాటలు విని విద్యార్థులు ఆందోళనకు గురికావొద్దని కోరారు. క్యాంపస్ లోకి ఇతరులకు అనుమతి లేదని, ఎవరైనా రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఫుడ్ పాయిజన్ వ్యవహారానికి సంబంధించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. మెస్ నిర్వాహకులకు షోకాజ్ నోటీసులిచ్చామన్న ఆయన... వారిపై కేసులు కూడా నమోదు చేసినట్లు తెలిపారు. ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించామని, నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రస్తుత మెస్ కాంట్రాక్టు కాల పరిమితి వచ్చే సెప్టెంబర్ వరకు ఉందని, కొత్త టెండర్లకు నోటీసు జారీ చేశామన్నారు.  విద్యార్థులకు సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బును కాజేసినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్న వీసీ... ఆ డబ్బు మొత్తాన్ని యూనివర్సిటీ ఖాతాలోనే జమ చేసినట్లు చెప్పారు. 

ఇదిలా ఉండగా... బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిముందు ఆందోళనకు దిగారు. తమ పిల్లల సమస్యలు పరిష్కరించే వరకు అక్కడి నుంచి కదిలేదిలేదని తేల్చి చెప్పారు. ఇక తమ డిమాండ్స్ పరిష్కారం అయ్యే వరకు అన్నం తినబోమని పట్టుపట్టినా విద్యార్థులు... సీనియర్ విద్యార్థులు రిక్వెస్ట్ చేయడంతో అన్నం తిన్నారు. ప్రస్తుతం విద్యార్థులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు.