భూమి రిజిస్ట్రేషన్​ చేయాలంటూ వేధింపులు

భూమి రిజిస్ట్రేషన్​ చేయాలంటూ వేధింపులు
  • వివాహేతర సంబంధం అంటగట్టిన భర్త 
  • భూమి రిజిస్ట్రేషన్​ చేయాలంటూ వేధింపులు

జీడిమెట్ల, వెలుగు: పేట్​బషీరాబాద్ ​పీఎస్ పరిధిలో పెండ్లయిన 15 రోజులకే భర్త వేధింపులు భరించలేక ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. సీఐ ప్రశాంత్​ కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్ బాపునగర్​కు చెందిన నర్సింహారెడ్డి కూతురు నిషిత(24)కు మేడ్చల్ మండలం డబిల్​పురాకు చెందిన శ్రీరామ్​రెడ్డి కొడుకు సంతోష్​రెడ్డితో ఈనెల 5న పెండ్లి జరిగింది. వధువు తరఫు వారు పెండ్లి సమయంలో 60 తులాల బంగారం, 2 కిలోల వెండి, ఇతర సామాన్లు ఇచ్చారు. గుమ్మడిదలలో ఉన్న 550 గజాల ప్లాట్​ను నిషిత పేరుపై రిజిస్ట్రేషన్ ​చేస్తామని చెప్పారు.

పెండ్లయినప్పటి నుంచి ప్లాట్​ను తన పేరుపై రిజిస్ట్రేషన్​ చేయాలంటూ నిషితను ..సంతోష్​రెడ్డి వేధించడం మొదలుపెట్టాడు. నిషిత ఫోన్ ​తీసుకుని పెండ్లికి ముందు జాబ్ ​చేసిన ఆఫీసులోని తోటి ఉద్యోగుల ఫోన్ ​నంబర్ల డీపీలను స్ర్కీన్​షాట్ తీసి వారితో వివాహేతర సంబంధం అంటగట్టేవాడు. ఈనెల 17న సాయంత్రం నిషితను ఆమె  పుట్టింటికి తీసుకెళ్లి ‘నీ కూతురుకు చాలా మందితో సంబంధం పెట్టుకుంది’ అని చెప్తూ చేయిచేసుకున్నాడు. ప్లాట్​ రిజిస్ట్రేషన్ ​త్వరగా  చేయాలని చెప్పి వెళ్లిపోయాడు. 18న మళ్లీ ఇంటికి వచ్చి ఆమె ఫోన్​లో ఉన్న నంబర్లు ఎవరివో చెప్పాలని అడిగి ఫోన్​  తీసుకుపోయాడు.

రాత్రి 10 గంటలకు నిషిత సోదరుడు సంతోష్​రెడ్డితో మాట్లాడుతుండగా నిషిత గ్రౌండ్​ఫ్లోర్​లోకి వెళ్లి హుక్​కి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు గమనించి వెళ్లి చూసే సరికి ఆమె చనిపోయింది. సంతోష్​రెడ్డి వేధించడంతోనే  తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.