మనవడి మృతి తట్టుకోలేక..ఆగిన నానమ్మ గుండె

మనవడి మృతి తట్టుకోలేక..ఆగిన నానమ్మ గుండె
  • గంటల వ్యవధిలోనే ఇద్దరి మృతి
  • కుటుంబంలో తీవ్ర విషాదం
  • ములుగు జిల్లా పస్రాలో ఘటన 

కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎక్కువ అంటారు.. అల్లారుముద్దుగా పెంచిన మనవడు ఆకస్మాత్తుగా దూరం అవడంతో ఆమె తట్టుకోలేకపోయింది. రోజూ ఒడిలో కూర్చోబెట్టుకొని ఎంతో ఇష్టంగా గోరు ముద్దలు పెట్టి పెంచింది.. మనవడు ఇక కనిపించడు అని తెలిసి ఆమె హృదయం ముక్కలైంది..  

ములుగు(గోవిందరావుపేట), వెలుగు : యాక్సిడెంట్లో మనవడు మృతిచెందడంతో తట్టుకోలేకపోయిన నానమ్మ గుండె ఆగిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది.  కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గోవిందరావుపేట మండలం పస్రాకు చెందిన నర్సింహరావు తన మనవడు హర్షసాయి(4)ను తీసుకొని గురువారం గోవిందరావు పేటకు వెళ్లాడు. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతిచెందాడు. కాగా.. మనవడి మృతిని తట్టుకోలేకపోయిన నానమ్మ నీలమ్మ(58) తీవ్ర మనోవేదనకు గురై శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయింది. గంటల వ్యవధిలోనే ఇద్దరి మృతితో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.