- విద్యుత్ అధికారుల అత్యుత్సాహం
- దోమలతో నిరుపేదల జాగారం
నల్లబెల్లి(వరంగల్): కరెంటు బిల్లులు కట్టట్లేదనే కారణంతో అర్ధరాత్రి పూట ఎస్సీ కాలనీకి సర్వీస్ కట్ చేసిన ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మందపల్లిలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పలువురు దళితులు పేదరికం కారణంగా గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. అవసరం మేరకు కరెంటు వినియోగిస్తున్నారు.
ఈ క్రమంలో నిన్ని రాత్రి పది గంటల దాటాక విద్యుత్ సిబ్బంది ఎటువంటి సమాచారం ఇవ్వకుండా దళిత కాలనీకి కరెంట్ సర్వీస్ ఆపేసింది. దీంతో కాలనీవాసులు పిల్లాపాపలతో రాత్రిళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కరెంట్ బిల్లు కట్టమని చెబితే కట్టేవాళ్లమని చెప్పారు..
అర్ధరాత్రి సమయంలో ఇబ్బందులు పెట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా అందుబాటులో ఉన్న విద్యుత్ సిబ్బంది మాట్లాడుతూ.. కొందరు వ్యక్తులు ఎటువంటి కరెంటు మీటర్లు లేకుండా దొంగతనంగా కరెంటు వాడుతున్నారని చెప్పారు.
బిల్లుతో సంబంధం లేకుండా కనీసం కరెంట్ మీటర్లు తీసుకోవాలని పదులసార్లు వారిని రిక్వెస్ట్ చేసినా పట్టించుకోవట్లేదన్నారు. కరెంట్ చౌర్యం కారణంగా లోడ్ ఎక్కువై ఇతర ప్రాంతాల్లో కరెంట్ కట్ అవుతోందని చెప్పారు. కావాలని కాలనీకి కరెంటు కట్ చేయలేదని సిబ్బంది చెప్పారు.