సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని .. టీచర్ల సూసైడ్ అటెంప్ట్

సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని .. టీచర్ల సూసైడ్ అటెంప్ట్
  • శామీర్ పేటలోని జైన్ హెరిటేజ్ స్కూల్ లో ఘటన

శామీర్ పేట, వెలుగు:  మా జీతాలు, సర్టిఫికెట్లు, పీఎఫ్ ఇవ్వాలని టీచర్లు ఆత్మహత్యకు యత్నించిన ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. శామీర్ పేట మండలం మజీద్​ పూర్ లోని జైన్ హెరిటేజ్ స్కూల్ లో 8 మంది టీచర్లు కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. స్కూల్ యాజమాన్యం టైమ్ కు జీతాలు ఇవ్వకపోతుండగా.. వారంతా వేరే స్కూల్ కు వెళ్లేందుకు దరఖాస్తులు పెట్టుకున్నారు. అయితే.. స్కూల్ లో జాయిన్ అయినప్పుడు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ అందజేశారు.

దీంతో తమ సర్టిఫికెట్స్, జీతాలు, పీఎఫ్ ఇవ్వాలని కొంతకాలంగా స్కూల్ యాజమాన్నాన్ని అడుగుతుంటే పట్టించుకోవడంలేదు. దీంతో శామీర్ పేట పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. అయినా యాజమాన్యం స్పందించకపోగా టీచర్లు మంగళవారం ఆందోళనకు దిగడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అతి కాస్త గొడవకు దారితీయడంతో  టీచర్స్ తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను పోసుకునేందుకు యత్నించారు.

స్థానికులు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇవ్వగా.. శామీర్ పేట పోలీసులు వెళ్లి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి వారం రోజుల్లో సర్టిఫికెట్స్ ఇప్పించేలా ఒప్పందం కుదిర్చారు. బాధిత టీచర్లు  మాట్లాడుతూ..  కొన్నేళ్లుగా స్కూల్ లో పని చేస్తున్నామని, టైమ్ కు జీతాలు, పీఎఫ్ ఇవ్వకుండా ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని యాజమాన్యం తీరుపై మండిపడ్డారు. ఇకనైనా జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి స్కూల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.